చైనా - బ్రిటన్ మధ్య చిచ్చు పెట్టిన హాంకాంగ్ సంక్షోభం... ప్రపంచ క్రమం మారిపోతుందా?

    • రచయిత, జొనాథన్ మార్కస్
    • హోదా, రక్షణ, రాయబార ప్రతినిధి, బీబీసీ

ముప్ఫయి లక్షల మంది హాంకాంగ్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ తలుపులు తెరిచింది. ఆ చర్య తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ చైనా మండిపడింది.

బ్రిటన్‌పై బదులు తీర్చుకుంటామని చైనా బెదిరింపులకు దిగడంతో.. ప్రస్తుతం కరోనావైరస్‌తో తల్లడిల్లుతున్న ప్రపంచంలో ఈ హాంకాంగ్ సంక్షోభం దౌత్య పరీక్షగా మారింది.

మారుతున్న పరిస్థితుల్లో ప్రపంచ రాజకీయాల్లో చైనా స్థానంపై ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయి?

బ్రెగ్జిట్ తరువాత బ్రిటన్‌ను అంతర్జాతీయ యవనికపై మునుపటి స్థాయిలో నిలిపేందుకు ఆ ప్రభుత్వం తీసుకురానున్న సరికొత్త విదేశాంగ విధానంపై, ఇతర సమస్యలపై ఇది ఎలాంటి ప్రభావం చూపనుంది?

ఇది చర్చించడానికి ముందు అసలు ఈ సంక్షభం అనివార్యమా అన్నదీ చూడాలి.

పాశ్చాత్యం పరాకుగా ఉన్నప్పుడు చైనా చెలరేగిపోయింది

రెండు దశాబ్దాలకు పైగా కాలంలో చైనా ఎదుగుతున్న తీరు చూసిన పాశ్చాత్య విధాన నిర్ణేతలు అంతర్జాతీయ సమాజంలో చైనా బాధ్యతాయుత భాగస్వామిగా ఉంటుందని భావించారు.

అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటుందని అనుకున్నారు. అందుకు కారణమూ ఉంది.

అంతర్జాతీయ సమాజం నుంచి చైనా లాభపడినంతగా ఇంకెవరూ లాభపడలేదు. చైనా కనుక అంత కచ్చితంగా వ్యవహరించి ఉంటే హాంకాంగ్ విషయంలో బ్రిటన్, చైనా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కొనసాగేది.

కానీ, అలా జరగలేదు.. చైనా ఎదుగుదల శరవేగంగా తదేక ధ్యాసతో సాగింది. అది ఒక మిలటరీ సూపర్ పవర్‌గా మారింది. ఎంతలా అంటే అమెరికా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు కష్టపడాల్సినంతగా.

పాశ్చాత్య దేశాలు పెద్దగా పట్టించుకోని సాధారణ సమయంలో, అమెరికా ఇతర అంశాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో చైనా వేగంగా ఎదిగింది.

యూరప్ బ్రెగ్జిట్‌పై దృష్టి పెట్టిన సమయం.. అమెరికా ఉగ్రవాదంపై పోరు, సిరియా యుద్ధంలో తలమునకలై ఉన్న వేళ చైనా వేగంగా ఎదిగింది.

అమెరికా ప్రభావం తగ్గడం..

డోనల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా.. చైనాకు సంబంధించి ఒక స్థిరమైన, వ్యూహాత్మక విధానం పాటించలేకపోయింది.

గత అయిదేళ్లలో అమెరికా సాపేక్షంగా కాదు పూర్తిగా తగ్గడం వల్లే చైనా ఎదగగలిగింది. ముఖ్యంగా ఆసియా, ఐరోపా, మధ్య ప్రాచ్యాలలో అమెరికా కూటమి వ్యవస్థలు సంక్షోభంలో పడ్డాయి.

పశ్చిమ ప్రపంచం - చైనా మధ్య సమస్యలు పెరుగుతూ వచ్చినా వాటిపై స్థూలంగా స్పందించలేదు. వాణిజ్య యుద్ధం, సాంకేతిక యుద్ధం వంటివాటిపై ఎవరికి వారు విడివిడిగానే స్పందించారు.

చైనాను అతిపెద్ద సమస్యగా చూస్తే దానికి మరింత నేరుగా, అందరూ సమన్వయంతో స్పందించి ఉండాలి.

ప్రస్తుతం ప్రపంచం కోవిడ్-19 సంక్షోభంలో ఉంది. చైనాలో జనించిన ఈ మహమ్మారి కారణంగా ఆ దేశం తొలుత ఇబ్బందులు పడినా ఆ తరువాత దాన్నే అవకాశంగా మలచుకోవాలని విస్పష్టంగా నిర్ణయించుకుంది.

చైనా కఠిన జాతీయవాద స్వరం ఎత్తుకోవడం ఏదో అనుకోకుండా జరిగింది కాదు.. అది వారి విధానం.

ఆ విధాన ఫలితమే అమెరికా, ఆస్ట్రేలియా, భారత్‌‌లతో ఘర్షణ. వీటన్నిటినీ మించిపోయేలా ఇప్పుడు హాంకాంగ్ విషయంలో బ్రిటన్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది.

హాంకాంగ్ విషయంలో చైనా దృఢ విధానం

హాంకాంగ్ సంక్షోభాన్ని మళ్లీ ముందుకు తేవడానికి కోవిడ్ సంక్షోభం చైనాకు ఒక అవకాశంగా మారింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి.

ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో పదవిలో ఉన్న ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యవహార దక్షత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ‘గ్లోబల్ బ్రిటన్’గా చెబుతున్న బ్రిటన్ విదేశాంగ విధానం పూర్వవైభవం సాధించడానికి ఇది అతిపెద్ద పరీక్ష.

నిజానికి ‘‘గ్లోబల్ బ్రిటన్’’ అంటే ఏమిటో ఎవరికీ పూర్తిగా తెలియదు.

అయితే... కరోనావైరస్ ప్రభుత్వ సమయాన్ని చాలావరకు తినేస్తున్న తరుణంలో హాంకాంగ్ అనుభవం ఆధారంగా ‘గ్లోబల్ బ్రిటన్’ గురించి అంతిమ తీర్పులు ఇవ్వడం తొందరపాటే అవుతుంది.

మాటలు - చేతలు

అయితే, ఇప్పుడు చైనాతో ఏర్పడిన ఈ వివాదం బ్రిటన్ ప్రస్తుత విదేశాంగ విధాన బలాబలాల నిగ్గు తేల్చుతుంది.

మాటలు కంటే వాస్తవాలు చెప్పడం ఇప్పుడు ప్రధానం. హాంకాంగ్ చైనాలో అంతర్భాగం. ఒకప్పటి వలస శక్తి బ్రిటన్.

చైనా సరైనవి కాని అంతర్గత భద్రతా విధానాలను అనుసరించడమే కాకుండా బ్రిటన్‌తో తనకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నది సుస్పష్టం. కానీ, వాస్తవం చూస్తే చైనా ఒక సూపర్ పవర్.. బ్రిటన్ అలా కాదు. మరి, బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని ఇది ఎక్కడ నిలుపుతుంది?

హాంకాంగ్‌ వాసులు 30 లక్షల మందికి ఆశ్రయమిచ్చేందుకు జాన్సన్ నిర్ణయించడం ఘనతగానే చెబుతారు చాలా మంది.

ఇది చిన్న సంఖ్యేమీ కాదు.. పైగా ఇమిగ్రేషన్ వ్యవహారాలపై వైఖరి అనుమానాస్పదంగా ఉందనే విమర్శలున్న జాన్సన్ నుంచి ఇది అనూహ్య నిర్ణయమే.

అయితే, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు. చైనా చాలామందిని వెళ్లనివ్వకపోవచ్చు. చాలామంది తామే స్వయంగా హాంకాంగ్‌ను వీడడానికి ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ వెళ్లినా యూకే కాకుండా ఇంకెక్కడికైనా వెళ్లొచ్చు.

కానీ, చైనా ఒత్తిళ్లను, స్థాయిని ఎదుర్కొంటూ జాన్సన్ బ్రిటన్ స్థాయిని నిలిపారన్నది మాత్రం వాస్తవం. అయితే దౌత్యమనేది అనేక అంశాలతో ముడిపడినది. పైగా సూత్రప్రాయమైనది కూడా. విదేశాంగ విధాన లక్ష్యాలను చేరుకోవడమనేది టీమ్ గేమ్ లాంటిది.

అమెరికా వైఖరేంటి?

మిత్రపక్షాల విశ్వాసం, మద్దతు పొందడం... సంయుక్త స్థితిగతులు, కార్యాచరణకు సంబంధించినది ఇది. హాంకాంగ్ విషయంలో యూకేకు మాటల్లో తప్ప పెద్దగా మద్దతు దొరకలేదు. హాంకాంగ్‌కు కల్పించిన కొన్ని వాణిజ్య ప్రయోజనాలను అమెరికా ఉపసంహరించుకుంటోంది.

మరోవైపు ట్రంప్‌కు ఇది ఎన్నికల ఏడాది కావడంతో చైనాతో వివాదం మళ్లీ మరోసారి తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా చేస్తుందన్న వ్యూహం ఆయనలో కనిపిస్తోంది.

అమెరికాతో బ్రిటన్ సంబంధాలేమీ సంక్లిష్టంగా లేవు. అయితే, అమెరికాతో వాణిజ్య ఒప్పందం అత్యావశ్యకమైన వేళ అమెరికాతో ఎలాంటి క్విడ్ ప్రోకో చేసుకోవాల్సివస్తుందోనన్న ఇబ్బందికర ఆలోచన బ్రిటన్‌ను వెంటాడుతుంది.

కోవిడ్ మహమ్మారి అలాంటి సమస్యలను మరింతగా అర్థమయ్యేలా చేసింది. ముఖ్యంగా రెమిడెసివర్ మందు విషయంలో ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానం వల్ల వారి వైఖరేంటో తెలిసేలా చేసింది.

యూకే జోరు పెంచాలి

గత శతాబ్దంలో చూసుకుంటే యద్ధ ట్యాంకులు, అణు బాంబులే ప్రపంచశక్తిగా ఎదగడానికి పనికొచ్చే సొత్తుగా భావించేవారు. సైనిక సంపత్తి ప్రాముఖ్యాలు ఎలా ఉన్నా కూడా రెండో ప్రపంచ యుద్ధం తరువాత, ప్రచ్ఛన్న యుద్దం తరువాత అమెరికా ఆధిపత్యానికి కారణం దాని ఆర్థిక బలిమి, పరిశోధనా పటిమే.

ఇప్పుడు చైనా కూడా ఈ లక్షణాలను సంతరించుకుంది. ‘‘గ్లోబల్ బ్రిటన్’’ అంటూ యూకే ముందుకెళ్లాలంటే గమనించాల్సిన విషయాలివి.

ఇక యూకే విషయానికొస్తే ఇప్పటికీ అది ప్రపంచంలో ఒక ధనిక దేశంగా ఉంది. అంతేకాదు.. ప్రపంచ రాజకీయాల్లో, ఐరాస భద్రత మండలిలో కీలకంగానూ చెలామణి అవుతోంది.

అయితే, కోవిడ్ అనంతర, బ్రెగ్జిట్ అనంతర ప్రపంచ రాజకీయాల్లో అది మరింత కీలకం కావడానికి మార్గాలు వెతుక్కోవాల్సి ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం చైనాతో తలెత్తిన వివాదంలో ప్రపంచ దేశాల మద్దతు, ఏకాభిప్రాయం కూడగట్టడానికి తగిన పాత్ర పోషించాల్సి ఉంది.

చైనా విధానాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వ్యతిరేకత ఉన్న సమయంలో హాంకాంగ్ విషయంలో చైనా ఆటకట్టించడానికి బ్రిటన్‌ తన వలస సామ్రాజ్య పరపతిని అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)