పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... ఒసామా బిన్ లాడెన్‌ను అమరుడన్నందుకు వెల్లువెత్తిన విమర్శలు

అమెరికా ఒసామా బిన్ లాడెన్ ని అమరుడిని చేసిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా విమర్శించారు.

అమెరికాలో చోటు చేసుకున్న 9/11 దాడులకు బిన్ లాడెన్ మాస్టర్ మైండ్ గా వ్యవహరించారు. 2011లో అమెరికా ప్రత్యేక సేనలు పాకిస్తాన్ లోని అబోట్టాబాద్‌లో ఉన్న లాడెన్ స్థావరం మీద దాడి చేసి అతడ్ని హతమార్చాయి.

ఈ విషయం గురించి పాకిస్తాన్ కి ముందుగా సమాచారం ఇవ్వలేదు.

"అమెరికా సేనలు పాకిస్తాన్ లో ప్రవేశించి ఒసామా బిన్ లాడెన్ ని హతమార్చి అతడిని అమరుడిని చేసిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను" అని ఖాన్ అన్నారు .

ఖాన్ అరబిక్ భాషలో "షహీద్" అనే పదాన్ని వాడారు. షహీద్ అంటే అమరుడని అర్ధం.

ఒక తీవ్రవాదిని అమరుడనడాన్ని ప్రతిపక్ష నాయకుడు , మాజీ విదేశాంగ మంత్రి క్వాజా ఆసిఫ్ విమర్శించారు.

"నా దేశాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఖాన్ అమరుడంటున్నారని " ఆయన పార్లమెంట్ లో అన్నారు.

దేశ ప్రధాని హింసాత్మక తీవ్రవాదానికి ఊతం పలుకుతున్నారని బిన్ లాడెన్ మరణం సమయంలో అధికారంలో ఉన్న పీపుల్స్ పార్టీ విమర్శించింది.

"ఇటీవల చోటు చేసుకున్న తీవ్రవాద ఘటనల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ వివక్షను ఎదుర్కొంటున్న సమయంలో ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ పరిస్థితిని మరింత పెంచినవారవుతారని", మీనా గబీనా అనే పాకిస్తాన్ కి చెందిన ఒక కార్యకర్త ట్వీట్ చేసారు.

పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలకు స్థావరంగా సహాయ పడుతోందని అమెరికా విదేశాంగ శాఖ నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో ఖాన్ ఈ వ్యాఖ్యలు చేసారు.

"అల్ ఖైదా తీవ్రవాద సంస్థ ప్రభావం బాగా తగ్గినట్లు నివేదిక పేర్కొన్నప్పటికీ , ఒకప్పుడు ప్రపంచానికి భయంగా పరిణమించిన అల్ ఖైదా ని అణిచివేసేందుకు పాకిస్తాన్ వహించిన పాత్ర గురించి మాత్రం నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదని, పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది.

ఖాన్ తాలిబన్ల పట్ల సానుభూతితో వ్యవహరిస్తారని గతంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన వ్యతిరేకులు ఆయనను "తాలిబన్ ఖాన్" అని కూడా పిలుస్తారు.

పాకిస్తాన్ ప్రధాని "ప్రాజెక్ట్ తాలిబన్" ని నిర్వహించే పనిలో ఉన్నట్లున్నారని గురువారం ఆయన లాడెన్ గురించి చేసిన వ్యాఖ్యల గురించి మాజీ సెనేటర్ , పాకిస్తాన్ స్వతంత్ర మానవ హక్కుల కమిషన్ మాజీ అధికారి అఫ్రాసియాబ్ ఖఠక్ ట్వీట్ చేశారు.

నాలుగు సంవత్సరాల క్రితం ఖాన్ ఇచ్చిన ఒక టీవీ ఇంటర్వ్యూ లో బిన్ లాడెన్ ని తీవ్రవాది అనేందుకు ఒప్పుకోలేదు.

విశ్లేషణ

ఎం ఇల్యాస్ ఖాన్, ఇస్లామాబాద్

రాజకీయంగా అనువుగా ఉండటం వలన ఖాన్ అమరుడనే పదం వాడి ఉంటారు తప్ప లాడెన్ వాదం పట్ల ఖాన్ కి ప్రత్యేక అనుబంధం ఏమి ఉండి ఉండదు.

కానీ, పాకిస్తాన్ ఇండియా, ఆఫ్గానిస్తాన్ లలో తన మిలిటరీ అధికారాన్ని చాటుకోవడానికి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఒక ముఖ్య ఆయుధంగా వాడుకుంటోంది.

బిన్ లాడెన్ తో సహా అల్ ఖైదా కి చెందిన కొంత మంది సీనియర్ నాయకులను తీవ్రవాదులు ఇప్పటికీ గౌరవంతో చూస్తారు. అలాగే, తీవ్రవాదంలోకి కొత్తవారిని నియమించుకోవడానికి వీరి పేర్లను వాడతారు. ఈ నేపథ్యంలో బిన్ లాడెన్ కున్న స్థాయిని తగ్గించి చూపిస్తే అది వ్యతిరేక పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంది.

మిలటరీ సహకారంతోనే 2018 లో ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఇది మిలటరీతో ఆయనకున్న సత్సంబంధాలకు సూచికగా కనిపిస్తుందని ఖాన్ వ్యతిరేకులు విమర్శిస్తారు.

అమరుడు అన్నది ఆయన నోటి నుంచి పొరపాటున దొర్లిన మాట కాదు. ఆయన ప్రసంగం మొదట్లో బిన్ లాడెన్‌ను చంపారంటూ, తర్వాత ఆయనను అమరుడిని చేశారని అనడం చాలా మంది గమనించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)