కరోనావైరస్: 'అమెరికాలో అధికారిక లెక్కల కన్నా ఎక్కువ మందే చనిపోయారు' - డాక్టర్ ఫౌచీ

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 42,62,799 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ కరోనా రిసోర్స్ సెంటర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ వైరస్ బారినపడి ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 2,91,981 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా తరువాత స్థానానికి రష్యా చేరుకుంది. అమెరికాలో 13.69 లక్షల కేసులు నమోదు కాగా, రష్యాలో స్పెయిన్, బ్రిటన్‌ల కన్నా ఎక్కువగా 2.32 లక్షల కేసులు నమోదయ్యాయి. రష్యాలో వైరస్ వల్ల చనిపోయిన వారి సంక్ 2,116కు చేరింది.

అమెరికాలో అధికారికంగా చెబుతున్న 82 వేల మంది కన్నా ఎక్కువ మందే చనిపోయి ఉంటారని వైట్ హౌస్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్‌లోని ఉన్నత స్థాయి సభ్యుడు డాక్టర్ ఆంథొనీ ఫౌచీ అన్నారు. అమెరికాలో ఫౌచీ అత్యంత విశ్వసనీయ వైద్యుడిగా గుర్తింపు పొందారు.

తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో కేసులు, మరణాలు

* అమెరికాలో 13,69,964 పాజిటివ్ కేసులు నమోదు కాగా 82,387 మంది చనిపోయారు.

* యూకేలో 2,27,741 కేసులు నమోదు కాగా 32,769 మంది ప్రాణాలు కోల్పోయారు.

* ఇటలీలో 2,21,216 పాజిటివ్ కేసులు, 30,911 మరణాలు నమోదయ్యాయి.

* మరణాల సంఖ్య విషయంలో ఫ్రాన్స్, స్పెయిన్, బ్రెజిల్, బెల్జియం, జర్మనీ, ఇరాన్, నెదర్లాండ్స్, కెనడా, చైనా, మెక్సికో, టర్కీ ఉన్నాయి.

* అమెరికాలో ఒక్క న్యూయార్క్‌లోనే ఏకంగా 27,284 మంది ప్రాణాలు కోల్పోయారు.

‘అమెరికాలో అధికారిక గణాంకాల కంటే ఎక్కువమందే చనిపోయారు’

అమెరికాలో మృతుల సంఖ్యపై గందరగోళమేర్పడుతోంది. కరోనా మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువే ఉంటుందని వైట్‌హౌస్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యుడు, అమెరికా అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు.

అమెరికాలో లాక్‌డౌన్ ఎత్తివేయడానికి వైట్‌హౌస్ రచిస్తున్న ప్రణాళికలు సరి కావని, లాక్‌డౌన్ ఎత్తివేస్తే వైరస్ మరింతగా వ్యాపిస్తుందని ఆయన హెచ్చరించారు.

ట్విటర్ వర్క్ ఫ్రం హోమ్

సెప్టెంబరు వరకు కూడా తమ కార్యాలయాలు తెరవాలని అనుకోవడం లేదని ట్విటర్ తెలిపింది.

కరోనా వైరస్ లాక్‌డౌన్ ముగిశాక కూడా తమ ఉద్యోగులు ఎవరైనా కోరుకుంటే వారికి ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పిస్తామని.. వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఎవరైనా కూడా శాశ్వతంగా పొందొచ్చని ఆ సంస్థ ప్రకటించింది.

ఎక్కడి నుంచైనా పనిచేయగల ఉద్యోగుల బృందం తమకు ఉందని.. గత కొద్దిరోజులుగా ఈ విధానంలో నడిపించగలమని నిరూపించామని ట్విటర్ పేర్కొంది.

భారతదేశవ్యాప్తంగా...

భారత్‌లోనూ కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 3,525 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి.

122 మంది మరణించారు.దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 74,281కి.. మరణాలు 2,415కి పెరిగాయి.

ఇప్పటివరకు 24,386 మంది కోలుకోగా మరో 47,480 మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 24,427 కేసులు నమోదు కాగా 921మంది మరణించారు.

గుజరాత్‌లో 8,903 పాజిటివ్ కేసులు నమోదు కాగా 537 మంది ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో 8,718 మందికి వైరస్ సోకగా 61 మంది మృతి చెందారు.

దిల్లీలో 7,639 కేసులు నమోదు కాగా 86 మంది చనిపోయారు.

తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితి

* ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం ఉదయం 10 గంటల సమయానికి 2137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1142 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 47 మంది చనిపోయారు. ఇంకా 948 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

* తెలంగాణలో మంగళవారం రాత్రి నాటికి మొత్తం 1326 కేసులు నమోదు కాగా 32 మంది చనిపోయారు. 822 మందికి నయమై డిశ్చార్జ్ కాగా 472 యాక్టివ్ కేసులున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)