కరోనావైరస్: ప్రాణాలు తీసుకున్న న్యూయార్క్ డాక్టర్

అమెరికాలో కరోనావైరస్‌పై యుద్ధంలో ముందుండి పోరాడిన న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మన్‌హటన్‌లోని న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ అలెన్ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగంలో మెడికల్ డైరక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ లోర్నా బ్రీన్ ఒంటి మీద గాయాలతో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

''ఆమె తన విధుల నిర్వర్తించడానికి ప్రయత్నించింది. కానీ చివరికవే ఆమె ప్రాణాలు తీశాయి'' అని ఆమె తండ్రి డాక్టర్ ఫిలిప్ బ్రీన్ 'న్యూయార్క్ టైమ్స్'కు చెప్పారు.

అమెరికాలో 63వేలమందికి పైగా కరోనా వైరస్‌తో మృతి చెందగా ఒక్క న్యూయార్క్ సిటీలోనే 18,000 మంది చనిపోయారు.

తన కూతురికి మానసిక సమస్యలేవీ లేవని ఆమె తండ్రి డాక్టర్ బ్రీన్ అన్నారు. వర్జీనియాలో చార్లోట్స్ విల్లేలో ఆమె తన కుటుంబంతో కలిసి నివసిస్తోందని, అక్కడే ఆమె చనిపోయిందని తండ్రి వెల్లడించారు.

"డాక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా లోర్నా బ్రీన్ కరోనావైరస్ బారినపడింది. చికిత్స తీసుకుని, పది రోజుల తర్వాత కోలుకోవడంతో మళ్లీ విధులకు హాజరైంది" అని ఆమె తండ్రి తెలిపారు.

ఆమెను చార్లొట్స్ విల్లేలోని తన ఇంటికి తీసుకొచ్చే విషయంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకముందే ఆసుపత్రి సిబ్బంది ఆమెను ఇంటికి పంపారని తండ్రి డాక్టర్ బ్రీన్ చెప్పారు.

చివరిసారిగా తనతో మాట్లాడినప్పుడు ఆమె ఎంతో వేదనలో ఉన్నట్లు అనిపించిందని, అంబులెన్స్‌ల నుంచి దింపేలోపే కోవిడ్-19 రోగులు ఎలా చనిపోతున్నారో తనకు వివరించిందని డాక్టర్ బ్రీన్ చెప్పారు.

మన్‌హటన్‌లో 200 పడకల ఆసుపత్రిలో డజన్ల కొద్దీ కరోనావైరస్ రోగులు చికిత్స పొందుతున్నారు.

''కరోనావైరస్‌పై పోరాటంలో ఆమె ముందు వరసలో నిలిచారు. ఆమె చేసిన సేవలకు తగిన గుర్తింపు ఇవ్వండి. ఆమె కూడా అందరిలాగే మరణించింది'' అని న్యూయార్క్ టైమ్స్‌తో డాక్టర్ బ్రీన్ వ్యాఖ్యానించారు.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక చెప్పినదాని ప్రకారం, డాక్టర్ లోర్నా బ్రీన్ క్రైస్తవ మతాచారాలను నిష్ఠగా పాటించేవారు. కుటుంబం అంటే ఆమెకు ఎంతో ప్రేమ. స్కీయింగ్‌లో మంచి అనుభవమున్న ఆమెకు సల్సా డాన్స్ అంటే ఎంతో ఇష్టం. వారానికోసారి ఆమె వృద్ధాశ్రమంలో స్వచ్ఛంద సేవ చేసేవారు.

అత్యవసర సేవల విభాగంలాంటి ఒక కష్టతరమైన విధులు నిర్వహించేచోట డాక్టర్ బ్రీన్ ఒక యోధురాలిగా పనిచేసి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ ఆసుపత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది.

చార్లోట్స్ విల్లే పోలీసులు కూడా ఆమెను ఒక యోధురాలిగా మీడియా ప్రకటనలో కీర్తించారు.

ఏప్రిల్ 26న తమకు కాల్ రాగానే డాక్టర్ లోర్నా బ్రీన్‌ను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లామని, తనకు తానుగా చేసుకున్న గాయాల కారణంగా ఆమె మరణించారని పోలీసులు వెల్లడించారు.

మొదటిసారి ఈ వ్యాధికి గురైనవారు, ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్నవారు ఈ మహమ్మారి వల్ల తలెత్తే మానసిక, శారీరక ఒత్తిళ్లను తట్టుకోలేరని పోలీస్ చీఫ్ రాషల్ బ్రెక్నీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆమె అన్నారు.

''ఈ విభాగంలో పని చేసేవారు సాధారణంగానే ఒత్తిడిలో ఉంటారు. కరోనావైరస్ కారణంగా ఈ ఒత్తిడి మరింత పెరిగింది'' అని బ్రెక్నీ అన్నారు.

అమెరికాలో 10.7 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్క న్యూయార్క్ సిటీలోనే మూడింట ఒకవంతు కేసులు రికార్డయ్యాయి.

అమెరికాలో 80 లక్షలకుపైగా జనాభాతో అత్యంత జనసమ్మర్ధం ఉన్న న్యూయార్క్ నగరంలో 24.7శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు ర్యాండమ్ యాంటీ-బాడీ టెస్టుల్లో తేలిందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువామో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)