కశ్మీర్: చంగ్పా తెగల జీవన శైలిలో వచ్చిన మార్పులు పష్మీనా వూల్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయా?

బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నెవి కశ్మీర్ లోయలో నివసించే చంగ్పా సంచార జాతుల జీవన శైలిని తన చిత్రాల్లో బంధించారు. వీరు ఊలు దుస్తుల తయారీలో వాడే పష్మీనాని ఉత్పత్తి చేస్తారు.

ఆండ్రూ నెవి, గడ్డ కట్టే చలిలో లద్దాఖ్‌లో చంగ్పా తెగ ప్రజలతో కలిసి రెండు వారాలు గడిపారు.

ఆయన అక్కడ జీవన శైలిని చిత్రించే ఫొటోలు తీయడంతో పాటు పష్మీనా ఊలు చరిత్రని, చంగ్పా ప్రజల మనుగడకి, ఆచారాలకు పొంచి ఉన్న ముప్పుని కూడా అర్ధం చేసుకునే ప్రయత్నం చేశారు.

"14000 అడుగుల ఎత్తులో, మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు పడిపోయే వాతావరణంలో, విస్తారమైన మంచులో ఎక్కడైనా జీవం ఉదంటే అది ఛాంగ్తాంగ్ పీఠభూమి మాత్రమే" అని ఆయన అన్నారు.

హిమాలయాలు, కారకోరం పర్వత శ్రేణుల మధ్యలో నెలకొన్న ఈ పీఠభూమి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటి. ఇది ఓ వైవిధ్యమైన గొర్రె జాతులకు ఆవాసం. వీటినే చంగ్రా లేదా పష్మీనా గొర్రెలు అంటారు.

ఎత్తైన ప్రాంతం, గడ్డ కట్టే ఉష్ణోగ్రతలు, తీవ్రమైన చలిగాలులు ఈ ప్రాంతంలో గొర్రెల తోలును కప్పే మృదువైన జుత్తు పెరగడానికి దోహదం చేస్తాయి.

ఈ చర్మపు దారాలు 8 నుంచి 10 మైక్రాన్‌ల వెడల్పు ఉండి, మనుషుల జుత్తు కన్నా 10రెట్లు మృదువుగా, సాధారణ గొర్రెల ఊలు కన్నా 8 రెట్లు వెచ్చగా ఉంటుంది.

ఈ ఖరీదైన ఊలు ప్రపంచమంతటా పష్మీనా‌గా ఎంతో పేరు పొందింది.

కొన్ని శతాబ్దాలుగా చంగ్పా సంచార జాతి ప్రజలు తమ పెంపుడు గొర్రెలు, మేకలు, జడలబర్రెలతో కలిసి మేత దొరికే ప్రాంతాలకు ప్రతి సంవత్సరం వలస మార్గాల్లో ప్రయాణిస్తూనే ఉన్నారు.

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, చైనా నుంచి దిగుమతి అయ్యే నకిలీ పష్మీనా ఉత్పత్తుల వలన వీరి జీవన శైలికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

వీరికి కూడా విద్య, సౌకర్యవంతమైన జీవితం గడపడానికి కావల్సిన పరిస్థితులు కావాలనే కోరిక ఉంది.

వాతావరణ మార్పులు పష్మీనా ఉత్పత్తికి పెద్ద ముప్పని సంచార జాతి ప్రజలు, శాస్త్రవేత్తలు కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు.

ఛాంగ్తాంగ్ పీఠభూమి‌లో సాధారణంగా జనవరి ఫిబ్రవరి నెలల్లో అధిక మంచు కురుస్తుంది.

గత కొన్ని సంవత్సరాలుగా నవంబర్ నుంచే మంచు కురవడం ఎక్కువైంది.

దీంతో వీరు తమ పెంపుడు జంతువులు చలి బారిన పడి చనిపోకుండా తగిన ఆహార గ్రాసాన్ని ముందుగానే నిల్వ చేసుకుని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చలి కాలంలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పష్మీనా వూలు నాణ్యత, ఉత్పత్తి పరిమాణం తగ్గిపోతున్నాయి.

కాష్‌మీర్ వూలు చాలా ఖరీదైనది. వసంత రుతువులో చంగ్పాలు ఈ గొర్రెల జుత్తు పెరిగేందుకు వీలుగా బాగా దువ్వుతారు. తర్వాత మంచి వూలుని వాటి చర్మం నుంచి జాగ్రత్తగా చేతితో వేరు చేస్తారు.

చేతితో ఆ వూలుని తొలగించాక, దానిని శుభ్రం చేసి చేతితోనే నేతకి సిద్ధం చేస్తారు. ఆ తర్వాత దానిని కావల్సినట్లు నేత నేయవచ్చు. అయితే అది చాలా కష్టంతో కూడుకున్న పని.

చెక్క మగ్గాలపై నేత నేసే వీళ్లు కొన్ని నెలల నుంచి సంవత్సర కాలం పాటు పని చేస్తేనే ఆ వూలు ఒక అందమైన కళాకృతిగా రూపాంతరం చెందుతుంది. ఇది ప్రపంచం అంతటా ఎగుమతి అవుతుంది. దీని ఖరీదు సుమారు 13000 వేల రూపాయల నుంచి 1,30,000 రూపాయల వరకు ఉంటుంది.

గత దశాబ్దకాలంగా ఈ ప్రాంతంలో చేపట్టిన పరిరక్షణకు చర్యల కారణంగా ఇక్కడ మంచు చిరుతల జనాభా పెరుగుతోంది. కానీ, ఇది చంగ్పా ప్రజలను భయపెడుతున్న మరో సమస్యగా మారింది.

పష్మీనా ఉత్పత్తి చేసే గొర్రెలకి ముప్పు వాటిల్లితే వాటిపైనే ఆధారపడిన మూడు లక్షల మంది కశ్మీరీ ప్రజల జీవనాధారానికి ముప్పు వాటిల్లుతుంది.

ఇది చంగ్పా తెగ ప్రజలు అంతరించిపోవడానికి కూడా దారి తీయవచ్చు.

వీరిలో చాలా మంది టిబెటన్ బౌద్ధాన్ని అనుసరిస్తారు. వారు అనేక ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.