You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ 5 విషయాలు మీ సోషల్ మీడియా ఖాతాల్లో ఉండకూడదు.. ఉంటే ప్రమాదమే
కేవలం మీ ఫొటోల ద్వారా మీ వేల ముద్రలను సేకరిస్తారని, ఫోన్ నెంబర్ సాయంతో ఫోన్లను హ్యాక్ చేయగలరని, పుట్టిన తేదీ ఆధారంగా కూడా వ్యక్తిగత వివరాలను సేకరించగలరని మీకు తెలుసా?
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో 'యూ' అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ విడుదలైంది. సోషల్ మీడియాలో చాలామంది తరచూ పెట్టే ఫొటోలు, ఇతర సమాచారం వారికి తెలీకుండానే ఎలాంటి ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందనే విషయాలను అందులో చూపించారు.
అందుకే ఈ ఐదు అంశాలను సోషల్ మీడియాలో పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
1. వేలిముద్రలు కనిపించేలా ఫొటోలు
రెండు వేళ్లతో విక్టరీ సింబల్‌ను చూపిస్తూ ఫొటోలకు పోజులివ్వడం చాలా దేశాల్లో మామూలే. కానీ, తెలియకుండా పెట్టే ఆ పోజు కూడా మనల్ని ఇబ్బందులకు గురిచేయొచ్చు.
చూపుడు వేలు, బొటన వేలుని స్పష్టంగా కెమెరాకు చూపించడం ద్వారా ఓ వ్యక్తి గుర్తింపును తస్కరించడం చాలా సులువని జపాన్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ ఇన్‌స్టిట్యుట్ పరిశోధకుడు ఇసావో ఎషిజన్ చెబుతున్నారు.
కొత్త సాంకేతికత ఆధారంగా ఆ ఫొటోలను ఎన్‌లార్జ్ చేసి, వేళ్లను స్కాన్ చేసి వేలిముద్రలను సేకరించడం సాధ్యమే అని ఆయన అంటున్నారు. మూడు మీటర్ల దూరం నుంచి పోజిచ్చిన కొందరి వేలిముద్రలను ఆయన సేకరించి మరీ అది సాధ్యమే అని నిరూపించారు.
ఒక్కసారి అలా స్కాన్ చేయగలిగితే, ఆ వేలిముద్రలను ఎన్ని ప్రింట్స్ అయినా తీసి వాటితో ఏదైనా చేయొచ్చని ఆయన అంటున్నారు.
ఫోన్లలో అనేక యాప్స్‌కు వేలిముద్రలనే చాలామంది పాస్‌వర్డ్‌లుగా వాడుతున్నారు. ఈ పద్ధతిలో వేలిముద్రలను సేకరించి ఫోన్లను వినియోగించే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు.
2. విహారయాత్రకు వెళ్తున్నారా?
ఏదైనా విహారయాత్రకు వెళ్లేప్పుడు ఆ వివరాలను చాలామంది సోషల్ నెట్‌వర్క్‌లలో పెడుతుంటారు. దాని వల్ల వారి ఇల్లు ఖాళీగా ఉండబోతుందనే సమాచారాన్ని దొంగలకు ఇస్తున్నట్లే లెక్క.
2018లో యూకేలో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం... తాము విహారయాత్రలో ఉన్నప్పుడే తమ ఇళ్లలో దొంగతనం జరిగిందని 22శాతం మంది చెప్పారు. వాళ్లంతా కూడా తమ విహారయాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు.
ఇలా సోషల్ మీడియాలో మీరు విహార యాత్రకు సంబంధించిన ఫొటోలు పెట్టిన రోజులలో మీ ఇంట్లో దొంగతనం జరిగితే, దానికి తాము బాధ్యత వహించబోమని చెప్పే ఇన్సూరెన్సు కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. ఒక విధంగా ఆ సమయంలో జరిగిన చోరీలకు వినియోగదారుల బాధ్యత కూడా ఉందని అవి అంటున్నాయి.
అలాగే కొందరు విమానం ఎక్కేముందు తమ బోర్డింగ్ పాస్‌ను కూడా ఫొటో తీసి పెడుతుంటారు. కానీ, దాని ఆధారంగా ఎయిర్‌లైన్స్‌తో మీరు పంచుకున్న సమాచారంతో పాటు ఆ టికెట్ కొనడానికి ఉపయోగించిన క్రెడిట్ కార్డు వివరాలను కూడా తెలుసుకునే వీలుందని టెక్నాలజీ, సోషల్ మీడియా అంశాల నిపుణుడు నిల్టన్ నవారో చెప్పారు.
3. పుట్టిన తేదీ
మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ ఉంటే చాలు.. అనేక దేశాల్లో సులువుగా మీ గుర్తింపును దొంగిలించి మోసాలు చేయొచ్చు అంటున్నారు సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ అమీలియా.
'మీ వయసును ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంటారు. దాని ఆధారంగా మీరు ఎప్పుడు పుట్టారో స్పష్టంగా తెలుసుకోవచ్చు. చాలా వెబ్‌సైట్‌లకు సెక్యూరిటీ ప్రశ్న కింద మీ పుట్టిన రోజునే పెట్టి ఉంటారు. కాబట్టి, దాని ఆధారంగా మీ గుర్తింపును చోరీ చేయొచ్చు. కొన్నిసార్లు కొందరు పుట్టిన రోజునే పాస్‌వర్డ్‌లుగా పెడుతుంటారు. అది మరింత ప్రమాదకరం' అని అమీలియా సూచిస్తున్నారు.
4. వ్యక్తిగత ఫోన్ నంబర్
సెల్‌ఫోన్‌లో వ్యక్తిగత ఫొటోలు, ఈమెయిళ్లు, సోషల్ మీడియా ఎకౌంట్లు... ఇలా సమస్త వ్యక్తిగత సమాచారం ఉంటుంది. కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా ఫోన్‌ని హ్యాక్ చేసి ఆ సమాచారాన్నంత చూడొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. అందుకే బహిరంగ వేదికలపై ఫోన్ నంబర్లను ఉంచడం అంటే అనేక సమస్యలను ఆహ్వానించడమే అంటున్నారు.
'స్మార్ట్‌ఫోన్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా కొనగోలు చేస్తే, నిపుణుడైన హ్యాకర్ కేవలం ఆ ఫోన్ నంబర్ ఆధారంగా మీ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని సేకరించగలడు. అందుకే వ్యక్తిగత ఫోన్ నంబర్ కాకుండా బహిరంగంగా ఉపయోగించడానికి మరో నంబర్ ఉండాలి' అని సూచిస్తున్నారు మైటీ సెల్ అనే సైబర్ సెక్యూరిటీ పోర్టల్‌కు చెందిన జేమ్స్ రాబిన్స్.
5. పిల్లల ఫొటోలు
పిల్లల ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టడం అంటే చాలామందికి సరదా. వారి తొలి నవ్వు, తొలి అడుగు, తొలి పలుకు.. ఇలా ప్రతిదీ అందరితో పంచుకోవాలని చాలామంది అనుకుంటారు. దాన్నే షేరెంటింగ్ (షేర్, పేరెంటింగ్ కలిపితే) అని కూడా పిలుస్తున్నారు.
కానీ, అలా ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం అంటే మోసాలను ఆహ్వానించడమే అని ఆర్థిక సేవల సంస్థ బార్క్లేస్ హెచ్చరిస్తోంది. దానివల్ల మైనర్ల భవిష్యత్ ఆర్థిక భద్రతను తల్లిదండ్రులు పణంగా పెడుతున్నారని ఆ సంస్థ అంటోంది.
2030 నాటికి ఈ షేరెంటింగ్ వల్ల అమెరికాలో రకరకాల మార్గాల్లో 870 మిలియన్ డాలర్ల మేర ఆన్‌లైన్ మోసాలు జరిగే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- వారమంతా తక్కువ నిద్ర, వారాంతాల్లో ఎక్కువ నిద్ర... బ్యాలెన్స్ అవుతుందా?
- ‘నిద్ర లేచాడు.. భార్యను మరచిపోయాడు’
- అమెరికా, ఇరాన్‌ల మధ్య రాజీ కుదిర్చేంత పలుకుబడి పాకిస్తాన్‌కు ఉందా?
- ‘8 కోట్ల జనాభాలో 17 మందే పేదలు’ అంటున్న చైనా ప్రభుత్వం
- సీరియల్ రేపిస్ట్: మగాళ్ళను ట్రాప్ చేస్తాడు... లైంగిక అత్యాచారాన్ని వీడియో తీస్తాడు
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- పాకిస్తాన్లో క్షమాభిక్షలు కొనుక్కుంటున్న హంతకులు
- ఆంధ్రప్రదేశ్: ‘మహిళల్ని నమ్మించి అత్యాచారాలకు పాల్పడుతున్న కేసులు పెరిగాయి’
- సెక్స్ వర్కర్లకు విముక్తి: బలవంతంగా ‘చాకిరీ’ చేయించే విధానం రద్దు
- ఓ పదేళ్ల వయసు చిన్నారి నరహంతకుడు కాగలడా?
- ఆన్‌లైన్‌లో మీ వ్యక్తిగత డేటా చోరీ కాకుండా ఉండాలంటే ఈ 5 పనులు చేయండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)