You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చలికి గడ్డ కట్టుకుని చనిపోయిన పసిబిడ్డ
రష్యాలో తల్లిదండ్రులు బాల్కనీలో వదిలిపెట్టిన ఏడు నెలల పసిబిడ్డ చలికి గడ్డకట్టుకొని చనిపోయాడని అధికారులు చెప్పారు.
బాల్కనీలోనైతే తాజా గాలిలో హాయిగా నిద్రపోతాడని అతడిని ఒక బగ్గీలో అక్కడ ఉంచారని స్థానిక మీడియా తెలిపింది. అతడు ఐదు గంటలపాటు మైనస్ ఏడు డిగ్రీల చలిలో ఉన్నాడు.
తూర్పు రష్యాలో ఖబరోవ్స్క్ ప్రాంతంలోని నికోలయెవ్స్క్-అన్-అముర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. శిశువు మరణంపై రష్యా అధికారులు క్రిమినల్ దర్యాప్తు మొదలుపెట్టారు.
చిన్నపిల్లలను ఒంటరిగా బయట వదలిపెట్టవద్దని ఈ ఘటన తర్వాత ఈ ప్రాంత ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. పిల్లలు ఎక్కడ, ఎవరితో ఉన్నారనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఎవరైనా చిన్నారి ప్రమాదకర పరిస్థితుల్లో కనిపిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోవద్దని కోరింది. చలికాలంలో ఎవరైనా చిన్నారి వీధిలో తప్పిపోయినా, గాయపడినా తీవ్రమైన చలి బారిన పడే అవకాశముందని హెచ్చరించింది.
పిల్లల క్షేమం పట్ల తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లలు బాధితులుగా మారడం ఖబరోవ్స్క్ ప్రాంతంలో పెరుగుతోందని ఆరోగ్యశాఖ పేర్కొంది.
హైపోథెర్మియా వల్లే శిశువు చనిపోయాడని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని రష్యా వార్తా వెబ్‌సైట్ లెంటా చెప్పింది. శరీరంలో వేడి పుట్టేదాని కన్నా వేగంగా వేడిని కోల్పోయే సమస్యను హైపోథెర్మియా అంటారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరస్థాయికి పడిపోతుంది. గుండె, నాడీవ్యవస్థ, ఇతర కీలక అవయవాల పనితీరు దెబ్బతింటుంది.
తీవ్రమైన చలి వల్ల లేదా తక్కువ ఉష్ణోగ్రతలో సుదీర్ఘ సమయం గడపడం వల్ల ఈ సమస్య రావొచ్చు. వృద్ధులు, ఏడాదిలోపు పిల్లలకు దీని ముప్పు ఎక్కువ.
ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే దేశాల్లో పిల్లలను నిద్రపుచ్చటం కోసం బయటకు తీసుకెళ్లడం అసాధారణమేమీ కాదు.
ఆరుబయట, చలికాలమైనా సరే, తాజా గాలిలో నిద్రపుచ్చితే దగ్గు, జలుబు నివారించవచ్చనే భావన ఉంది.
ఫిన్‌లాండ్, నార్వే లాంటి నోర్డిక్ దేశాల్లోనూ ఆరుబయట అయితే పిల్లలు బాగా నిద్రపోతారని, ఎక్కువసేపు నిద్రపోతారని తల్లిదండ్రులు నమ్ముతారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో వందల మంది చిన్నారులకు హెచ్.ఐ.వీ ఎలా సోకింది...
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- ఎన్ఆర్సీ: పౌరసత్వం చట్రంలో నలిగిపోతున్న అసోం చిన్నారులు
- ఇరాన్ ప్రతిదాడి: ఇరాక్‌లో అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు... మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్
- జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడి: భారతదేశం తన యువతరాన్ని దెబ్బతీస్తోందా...
- జేఎన్‌యూ వద్ద దీపిక పదుకోణె... క్యాంపస్ ఘటనలపై ఆందోళన
- ఇరాన్ అణుబాంబును ఎంత కాలంలో తయారు చేయగలదు...
- 'రాజధాని కోసం ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చాం... ఇప్పుడు పిల్లా పెద్దా అంతా రోడ్డున పడ్డాం'
- చదివింది కెమికల్ ఇంజినీరింగ్.. చేస్తున్నది బూట్లు తుడిచే పని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)