You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెజాన్ అలెక్సా ఇకపై ఇంట్లోనే కాదు, మీ వెంట ఎక్కడికైనా వచ్చేందుకు మరింత స్మార్ట్‌గా రెడీ అవుతోంది
- రచయిత, జేన్ వేక్‌ఫీల్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రోహిత్ ప్రసాద్ ఇంట్లో అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్ అలెక్సాతో నడిచే 17 స్పీకర్లు ఉన్నాయి. అయినా, అవి సరిపోవని అంటున్నారాయన.
అలెక్సా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి రోహిత్ ప్రసాద్ చీఫ్ సైంటిస్ట్.
‘‘నా టెక్నాలజీని నేనే పరీక్షిస్తా. అలెక్సా అని పిలిస్తే, వాటిలో సరైన స్పీకర్ స్పందిస్తుందా? లేదా? అన్నది గమనిస్తుంటా’’ అని రోహిత్ అంటున్నారు.
జనాలకు అలెక్సాను మరింత దగ్గర చేసేందుకు తాము వేస్తున్న ప్రణాళికల గురించి ఆయన బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
అలెక్సాను మరింత స్మార్ట్‌గా, నిత్యం వినియోగదారుల వెంట ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు ప్రసాద్ చెప్పారు. అంటే, ఇంటి గడప దాటి, అలెక్సా వినియోగదారుల వెంట రాబోతోంది. వాణిజ్య వర్గాల్లో దీన్ని యూబిక్విటస్ యాంబియెంట్ కంప్యూటింగ్ అంటుంటారు. ఈ మార్కెట్‌ను ఒడిసిపట్టుకోవాలని అమెజాన్ సంస్థ ఆశిస్తోంది.
అమెరికాలో కారు స్పీకర్లతో అనుసంధానమై పనిచేసే అమెజాన్ ఎకో సిస్టమ్ అమ్మకాలు ఇప్పటికే మొదలయ్యాయి.
అయితే, నడిచేటప్పుడూ వినియోగదారుల వెంట అలెక్సా ఉండేలా దాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు ప్రసాద్ చెప్పారు.
ఇందుకోసం కాంటెక్స్టువల్ రీజనింగ్ అంటే సందర్భోచిత విశ్లేషణను మెరుగుపరచాల్సి ఉంటుందని చెబుతున్నారు.
‘‘మీరు ఒక స్టోర్‌కు వెళ్లారనుకుందాం. ‘టమాటలు ఎక్కడున్నాయి’ అని అడిగితే, అలెక్సా మీరు స్టోర్‌లో ఉన్న విషయం అర్థం చేసుకుని.. అక్కడ టమాటలు ఎక్కడున్నాయో చూపించాలి. ఏదైనా హోటల్‌లో మీరు ఉన్నప్పుడు, స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు తెరిచి ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారనుకోండి. ఆ హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్ వివరాలు మాత్రమే చెప్పాలి, బయట స్విమ్మింగ్ పూల్స్‌వి కాదు’’ అంటూ కాంటెక్స్టువల్ రీజనింగ్ గురించి ప్రసాద్ వివరించారు.
ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అమెజాన్ అలెక్సాతో పనిచేసే ఇయర్‌బడ్స్‌ను పరీక్షిస్తోంది. గ్లాసెస్, రింగ్స్ వంటి ధరించగలిగే పరికరాలతోనూ అలెక్సాను అనుసంధానించి పరీక్షిస్తోంది.
వినియోగదారులను అలెక్సా ఎంతగా ఆకట్టుకోగలిగితే, వాళ్లు అంతగా దానితో మాట్లాడతారు. అలెక్సాను మెరుగుపరిచేలా అల్గారిథమ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రసాద్ బృందానికి మరింత సమాచారం దొరుకుతుంది.
ప్రతి వారం వినియోగదారుల నుంచి వచ్చే ‘వందల మిలియన్ల’ అభ్యర్థనలకు పరికరాలు స్పందిస్తూ సేవలందిస్తున్నాయని ప్రసాద్ అంటున్నారు.
అలెక్సాకు ఇప్పుడు లక్షకు పైగా నైపుణ్యాలున్నాయని, దాదాపు 9,500 బ్రాండ్లకు చెందిన స్మార్ట్ పరికరాలతో అనుసంధానమై పనిచేయగలదని ఆయన వివరించారు.
ప్రస్తుతానికి ఈ వ్యాపారంలో అమెజాన్‌దే పైచేయిగా కనిపిస్తోంది.
మార్కెట్ రీసెర్చ్ సంస్థ కానలిస్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత త్రైమాసికంలో గూగుల్ స్పీకర్స్ కన్నా అమెజాన్ స్మార్ట్ స్పీకర్స్ మూడు రెట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. గూగుల్ విక్రయాల్లో పెరుగుదల ఆగిపోగా, అమెజాన్ అమ్మకాల్లో మాత్రం వృద్ధి నమోదవుతోంది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మిళితమై ఉండటం వల్ల గూగుల్ వర్చువల్ అసిస్టెంట్ ఫోన్ల ద్వారా ఇప్పటికే చాలా మంది చేతుల్లోకి వచ్చేసింది.
కానీ , మెరుగైన వర్చువల్ అసిస్టెంట్‌ను అందించే రేసులో తాము వేగంగా సాగుతున్నామని ప్రసాద్ అంటున్నారు.
2014తో పోలిస్తే వర్చవల్ అసిస్టెంట్ పరికారల తప్పిదాల (ఎర్రర్) సగటు నాలుగు రెట్లు తగ్గిందని ఆయన చెబుతున్నారు.
నాలుగు ప్రధాన టాస్క్‌లను నిర్వహించడంలో సామర్థ్యం ఆధారంగా ఈ తప్పిదాల రేటును లెక్కగడుతారు. ఆ టాస్క్‌లు..
- అలెక్సా, అమెజాన్, ఎకో, కంప్యూటర్.. ఇలా ఏదో ఒక పదం పలికితే అలెక్సా యాక్టివ్ అవుతుంది. ఇలాంటి పదాలను ట్రిగ్గర్ వర్డ్ అంటారు. ఈ ట్రిగ్గర్ వర్డ్‌కు స్పందించడం
- వినియోగదారులు మాటలను గుర్తించి, వాటిని ప్రాసెసింగ్ కోసం టెక్స్ట్‌గా మార్చుకోవడం
- భాషను అర్థం చేసుకుని, సందర్భాన్ని బట్టి భిన్న రకాలుగా పలికే పదాలను వాక్యాలుగా మార్చుకోవడం
- టెక్స్ట్ సమాచారాన్ని అలెక్సా గొంతుతో మాటలుగా వినిపించడం
సహజంగా అలెక్సాకు ఉండే గొంతును కాకుండా వేరే గొంతులను ఎంచుకునే అవకాశం వినియోగదారులకు అమెజాన్ ఇవ్వనుంది. హాలీవుడ్ నటుడు శామ్యూల్ ఎల్.జాక్సన్ గొంతు కూడా ఈ జాబితాలో ఉంది.
అయితే, అలెక్సాకు సహజంగా ఉండే గొంతు మహిళది. దీన్ని మార్చే అవకాశం ఉందా? అలెక్సా అలెక్స్‌గా మారొచ్చా?
ఈ చర్చ తరచూ జరిగేదే అని ప్రసాద్ అంటున్నారు.
‘‘ఇది లింగానికి సంబంధించిన అంశం కాదు. గొంతు, పదాల ఎంపిక ప్రధానం. వినియోగదారులతో బాగా కలిసిపోయినట్లుండే వ్యక్తిత్వాన్ని మేం అలెక్సాకు ఇవ్వాలనుకున్నాం. ఒకవేళ అలెక్సా మరో లింగంలో తెస్తే, ట్రిగ్గర్ వర్డ్ ఏం పెట్టాలా అన్నది కూడా మేం ఆలోచించాల్సి ఉంటుంది. వ్యక్తిత్వం, లింగం అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు లింగం మార్చితే, దాని వ్యక్తిత్వం కూడా మార్చాలి’’ అని ఆయన చెప్పారు.
అలెక్సా విషయంలో నిపుణులు ఎంత శ్రమిస్తున్నా, అప్పుడప్పుడు కొన్ని ‘వైఫల్యాలు’ తప్పట్లేదు.
గత ఏడాది అలెక్సా స్పీకర్లలో కొన్నింటి నుంచి ఉన్నపళంగా భయపెట్టేలా నవ్వు వినిపిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. యాసలను అర్థం చేసుకోవడంలో అలెక్సా పొరపాటుపడుతున్న సందర్భాలు ఉన్నాయి.
‘‘అలెక్సా సామర్థ్యాలు రెండేళ్లలో బాగా మెరుగుపడి ఉండొచ్చు. కానీ, ఇలాంటి వర్చువల్ అసిస్టెంట్లపై జనాలు కూడా ఎప్పటికప్పుడు అంచనాలు విపరీతంగా పెంచుకుంటుంటారు’’ అని సీసీఎస్ ఇన్‌సైట్ అనే పరిశోధక సంస్థకు చెందిన మార్టిన్ గార్నర్ అన్నారు.
ఇలాంటి వర్చువల్ అసిస్టెంట్ల విషయంలో విశ్వసనీయతకు సంబంధించిన కోణం కూడా ఉంది. తమ మాటలు వినడానికి ఎదురుచూసే మైక్రోఫోన్లను నిత్యం చుట్టూ ఉండనివ్వాలా? వద్దా? అని వినియోగదారులు నిర్ణయం తీసుకోవాలి.
అమెజాన్‌ను వారు విశ్వసించాల్సి ఉంటుంది. కానీ, ఇటీవల ఆ సంస్థ వినియోగదారుల మాటల రికార్డింగులను విశ్లేషించే పనిని తృతీయ పక్షానికి అప్పగిస్తున్నట్లు బయటపడింది. తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు అమెజాన్ ఈ విశ్లేషణలు చేయిస్తోంది.
వినియోగదారులు కావాలనుకుంటే ఈ రికార్డింగ్ ప్రక్రియకు దూరంగా ఉండొచ్చని ప్రసాద్ అంటున్నారు.
‘‘ఆ విశ్లేషణలను ఆపలేం. అల్గొరిథమ్‌లను మెరుగుపరచడంలో అవి కీలకం. కానీ, ఒక్క వాయిస్ కమాండ్‌తో రికార్డ్ అయిన వాటిని వినియోగదారులు తొలగించొచ్చు’’ అని అన్నారు.
అయితే, ఈ ఆప్షన్ బాగా వెతికితేగానీ దొరకడం లేదని వినియోగదారులు అంటున్నారు.
గోప్యత కోరుకుంటూ చాలా మంది అలెక్సాకు దూరంగా ఉండవచ్చు.
కానీ, పక్కవారు ఆ పరికరాలు వినియోగిస్తుంటే, వారి మాటలు కూడా రికార్డ్ అవుతాయి.
‘‘అలెక్సా అని ట్రిగ్గర్ వర్డ్ పలికే వరకూ ఆ పరికరాలేవీ మీ మాటలను వినవు. ఈ విషయంలో అలెక్సా పారదర్శకంగా ఉంటుంది. క్లౌడ్‌కు సమాచారం చేరే సమయంలో నీలి రంగు లైట్ వెలుగుతూ కనిపిస్తుంది’’ అని ప్రసాద్ అన్నారు.
అన్ని పరికరాలతోనూ అలెక్సా అనుసంధానమయ్యాక, ఇలాంటి పారదర్శకత కొనసాగుతుందా అన్నది అసలు ప్రశ్న.
ఇవి కూడా చదవండి
- మొబైల్ డేటా రేట్లు పెంచనున్న రిలయన్స్ జియో.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల బాటలోనే..
- జీపీఎస్ పనిచేయటం ఆగిపోతే ప్రపంచం ఏమైపోతుంది?
- World Toilet Day: కడుక్కోవడమా? తుడుచుకోవడమా? ప్రపంచాన్ని విభజించే ప్రశ్న
- పాస్‌వర్డ్‌లతో భద్రత లేదా? బయోమెట్రిక్స్ సురక్షితమేనా?
- హిట్లర్ ఇంట్లో పోలీస్ స్టేషన్
- విజయవాడలో స్విగ్గీ సర్వీస్ ఎందుకు ఆగిపోయింది...
- పెగాసస్ ఎటాక్: వాట్సాప్‌ను తీసేస్తే మీ ఫోన్ సేఫ్ అనుకోవచ్చా?
- యోని గురించి మీరు తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)