You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్: తాలిబన్ల వద్ద మూడేళ్లుగా బందీలైన ప్రొఫెసర్ల కోసం ముగ్గురు మిలిటెంట్ల విడుదలకు సిద్ధం
తాలిబన్ల వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు విదేశీయులను విడిపించేందుకు గాను ముగ్గురు తీవ్రవాదులను జైలు నుంచి విడుదల చేస్తున్నట్లు అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ చెప్పారు.
అమెరికన్ యూనివర్సటీ ఆఫ్ అప్ఘానిస్తాన్ ప్రొఫెసర్లయిన అమెరికా జాతీయుడు కెవిన్ కింగ్, ఆస్ట్రేలియాకు చెందిన తిమోతీ వీక్స్‌ను 2016లో తాలిబన్లు అపహరించారు. అప్పటి నుంచి వారు బందీలుగానే ఉన్నారు.
వారి విడుదల కోసం ఇప్పుడు హఖ్ఖానీ తీవ్రవాద సంస్థ అధిపతి అనాస్ హఖ్ఖానీ, మరో ఇద్దరు తీవ్రవాదులను అఫ్గాన్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేస్తోంది.
అయితే, ఈ బందీలు, ఖైదీల మార్పిడి ఎప్పుడు, ఎలా జరగబోతోందన్న విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా ఇంకా రాలేదు.
తాలిబన్లతో ముఖాముఖి చర్చలకు అనుకూల పరిస్థితులు ఏర్పరచడం కోసం ఈ చర్య చేపట్టినట్లు అధ్యక్షుడు ఘనీ చెప్పారు.
అయితే, ఘనీ ప్రభుత్వంతో చర్చలకు చాలాకాలంగా నిరాకరిస్తూ వస్తున్న తాలిబన్ల వైపు నుంచి తాజా పరిణామంపై ఎలాంటి తక్షణ స్పందనా రాలేదు.
కాబూల్‌లోని తమ యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో 2016 ఆగస్ట్‌లో ఆ ఇద్దరు ప్రొఫెసర్లను తాలిబన్ సాయుధులు బెదిరించి తమతో తీసుకెళ్లారు.
తమను విడిపించడానికి తాలిబన్లతో ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను అభ్యర్థిస్తూ వారిద్దరూ మాట్లాడిన వీడియోను 2017లో తాలిబన్లు విడుదల చేశారు.
బందీలుగా ఉన్న ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉందన్నది స్పష్టంగా తెలియదు.. అయితే, ఇటీవల అధ్యక్షుడు ఘనీ మాట్లాడుతూ ''టెర్రరిస్టుల వద్ద బందీలుగా ఉన్న ఆ ఇద్దరి ఆరోగ్యం క్షీణిస్తోంది'' అని చెప్పారు.
తాలిబన్ల వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించడం కోసం జైలులోని తీవ్రవాదులను విడిచిపెట్డడం క్లిష్టమైన నిర్ణయమేనని, అయితే, బందీల విడుదల కోసం ఇది ముఖ్యమైనదని ఘనీ అన్నారు.
ఖైదీల్లో ఒకరైన అనాస్ హఖ్ఖానీ జైలులో ఉండడంతో ఆయన అన్న సిరాజుద్దీన్ హఖ్ఖానీ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నారు. తాలిబిన్లకూ ఆయన కీలక నేత.
అఫ్గాన్, నాటో దళాలపై జరిగిన అనేక దాడుల వెనుక హఖ్ఖానీ గ్రూప్ హస్తం ఉంది. 2017లో కాబూల్‌లో 150 మందికి పైగా మరణించడానికి కారణమైన దాడి కూడా ఈ గ్రూప్ పనే.
'పాకిస్తాన్ మద్దతుతో తీవ్రవాదం'
తన బద్ధ శత్రువులైన భారత్, అఫ్గానిస్తాన్‌లపై వ్యతిరేకతతో పాకిస్తాన్ ఈ గ్రూప్‌కు సహకరిస్తోందన్న ఆరోపణలున్నాయి. అయితే, పాక్ ఆ ఆరోపణలను ఖండిస్తోంది.
ఈ మిలిటెంట్ గ్రూప్ అధినేత అనాస్ హఖ్ఖానీతో పాటు మరో తీవ్రవాది హఫీజ్ రషీద్ 2014లో అరెస్టయ్యారు. ఈ ఇద్దరినీ ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. వీరితో పాటు మిలిటెంట్ హాజీ మాలీ ఖాన్‌నూ విడుదల చేస్తున్నారు. ఆయన సిరాజుద్దీన్ హఖ్ఖానీకి మామ అని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది.
అమెరికాలో తాలిబన్ ప్రతినిధులతో రహస్యంగా జరగాల్సిన భేటీని ట్రంప్ రద్దు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య-రామ మందిర ఉద్యమంలో ముఖ్య పాత్రధారులు వీరే..
- 9 నెలల్లో 97 పేలుళ్లు, స్వీడన్లో ఏం జరుగుతోంది
- ట్రంప్‌పై పోటీచేయాలనే ఒత్తిడి వస్తోంది: హిల్లరీ క్లింటన్
- అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సింగపూర్ కన్సార్షియం
- మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
- యూఎస్ఎస్ గ్రేబ్యాక్: 75 ఏళ్ల తర్వాత దొరికిన రెండో ప్రపంచ యుద్ధం నాటి జలాంతర్గామి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)