You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గర్భస్థ శిశువుల చేతుల్లో తొండల మాదిరి కండరాలు... పుట్టిన తరువాత ఏమై పోతున్నాయి...
- రచయిత, మిషెల్లీ రాబర్ట్స్
- హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్
గర్భస్థ శిశువుల చేతుల్లో తొండల మాదిరి బలమైన కండరాలు ఉంటాయని, శిశువు తల్లి గర్భం నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టేలోగా ఆ కండరాల్లో చాలావరకు అదృశ్యమవుతాయని మెడికల్ స్కానింగుల్లో బయటపడింది.
పిండం దశలో ఉన్నప్పుడు మానవ శరీరంలో ఆ కండరాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఆ తర్వాత ఎందుకు అదృశ్యమవుతున్నాయి? అన్న విషయంలో స్పష్టత లేదు.
అది బొటనవేళ్లలో బలమైన కండరాలు తయారయ్యే దశ అయ్యుండవచ్చు అని జీవశాస్త్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా కండరాలతో పోల్చితే, బొటనవేళ్ల కండరాలు చాలా దృఢంగా ఉంటాయి.
అప్పుడప్పుడు, కొంతమంది చిన్నారులతో పాటు, పెద్దవారికీ అదనపు వేళ్లు, కండరాలు కనిపిస్తుంటాయి. పుట్టుకతో వచ్చే అలాంటి అరుదైన లోపాలను సవరించేందుకు తాజా పరిశీలనలు ఉపయోగపడే అవకాశం ఉంటుందని జీవశాస్త్రజ్ఞులు అంటున్నారు.
"మన బొటనవేళ్లకు వెళ్లే చాలా కండరాలు అలాగే ఉండిపోతాయి. వాటి కదలికలు పరిమితంగా ఉంటాయి. ఇతర వేళ్లకు వెళ్లే కండరాలను మనం చాలా కోల్పోయాం. ఎందుకంటే, బొటనవేలు మినహా ఇతర వేళ్లకు ఆ కండరాల అవసరం పెద్దగా ఉండదు" అని అమెరికాలోని హోవార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనా ప్రతాల ముఖ్య రచయిత డాక్టర్ రుయ్ డియోగో అన్నారు.
"ఆ కండరాలతో కూడిన పొర మిగతా వేళ్ల నుంచి తొలగిపోతుంది, బొటనవేళ్ల మీద మాత్రం అలాగే ఉండిపోతుంది" అని ఆయన చెప్పారు.
అనవసర శరీర భాగాలా?
"మానవుల్లోని ఇతర అవశేషాల కంటే, ఈ కండరాల నిర్మాణం స్కానింగ్‌లో చాలా అద్భుతంగా కనిపిస్తోంది. అపెండిక్స్ గడ్డలు, జ్ఞాన దంతాలు, అనుత్రికాస్థి (వెన్నుపూసలు కలిసి ఏర్పడే త్రికోణాకారపు చిన్న ఎముక) లాంటి వాటికంటే కూడా ఈ కండరాలు పిండం దశలోనే ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి" అని డియోగో వివరించారు.
"మానవ పరిణామ క్రమంలో 250 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే వయోజనుల్లో ఇలాంటి కండరాలు కనుమరుగయ్యాయి" అని డాక్టర్ డియోగో చెప్పారు.
"ఇలాంటి కండరాలు వయోజన క్షీరదాల్లో, ఎలుకల్లో, కుక్కల్లో... వేటిలోనూ లేవు" అని ఆయన అన్నారు.
"మనకు మానవ జాతి కంటే చేపలు, కప్పలు, కోళ్లు, ఎలుకల పిండాల అభివృద్ధి గురించే ఎక్కువ అవగాహన ఉంది. ఇకనుంచి, మానవ పిండం అభివృద్ధి గురించి మరింత నిశితంగా అధ్యయనం చేసేందుకు తాజా పరిశీలనలు ఎంతగానో దోహదపడతాయి" అని ఆయన చెప్పారు.
"ఈ పరిశోధనలు మానవ అభివృద్ధిపై లోతైన విషయాలను వెల్లడించాయి. అలాగే, పలు ప్రశ్నలను కూడా లేవనెత్తాయి" అని అమెరికాలోని మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో కోతి, మానవ పరిణామ క్రమంపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ సర్జియో అల్మాసిజా అన్నారు.
"మానవ పిండం ఎదుగుతున్న క్రమంలో కొత్తగా ఎలాంటి భాగాలు ఏర్పడుతున్నాయి? ఏవి అదృశ్యమవుతున్నాయి? అన్న విషయాలను స్పష్టంగా పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది ఈ పరిశోధన ఉపయోగపడుతుంది" అని సర్జియో అభిప్రాయపడ్డారు.
"మానవ పిండం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో ప్రతి దశనూ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇంకా కొత్తగా ఏ విషయాలు తెలుస్తాయి? కొన్ని నిర్మాణాలు ఎలా అదృశ్యమవుతున్నాయి? అన్న విషయాలను తెలుసుకోవచ్చు. కానీ, ఎందుకోసం ఆ కండరాలు అలా మారుతున్నాయి? అన్నదే ఇప్పుడు నా ముఖ్యమైన ప్రశ్న" అని ఆయన అన్నారు.
మానవ శరీరంలోని ఇతర భాగాలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు మరింత లోతుగా పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పాదాల గురించి పరిశోధనలు చేశారు. శిశువు తల్లి గర్భంలో పెరిగేటప్పుడు పాదాలలోనూ కొన్ని అదనపు కండరాలు అభివృద్ధి చెంది, తర్వాత అదృశ్యమవుతాయని గుర్తించారు.
కోతులకు, ఏప్‌లకు ఇప్పటికీ ఈ కండరాలు ఉన్నాయి. చెట్ల మీదికి, గోడల పైకి పాకేందుకు, వస్తువుల ఆకృతిని మార్చేందుకు ఆ కండరాలను ఉపయోగిస్తాయి.
"మనకు ఆ కండరాల అవసరం లేదు కాబట్టి, వాటిని కోల్పోయాం" అని డాక్టర్ డియోగో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ రహస్య పరిశోధన: మతం పేరుతో బాలికల లైంగిక దోపిడీ...మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- ఎమర్జెన్సీ: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
- రష్యా అమ్మాయిలు తమ శరీరం మీద ముడతలు, చారలు, మచ్చలను గర్వంగా ప్రదర్శిస్తున్నారు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)