పక్షవాతంతో కదలలేనివాళ్లు ఈ రోబో సూట్‌తో నడవొచ్చు

    • రచయిత, జేమ్స్ గల్లాఘర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పక్షవాతంతో కదలలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మెదడు ఆజ్ఞలకు అనుగుణంగా పనిచేసే ఎక్సోస్కెలిటన్ సూట్‌తో కదలగలిగాడని ఫ్రెంచ్ పరిశోధకులు వెల్లడించారు.

ఈ సూట్ వేసుకొని తొలి అడుగు వేసినప్పుడు 'చంద్రుడి మీద అడుగుపెట్టిన తొలి వ్యక్తిలాగా అనిపించింది' అని థిబో (30) చెప్పారు.

అతని కదలికలు, ముఖ్యంగా నడవడం సరిగ్గా ఉండదు. అంతేకాకుండా ఈ రోబో సూట్‌ను ల్యాబ్‌లోనే వాడాలి.

అయితే, ఈ విధానం ఏదో ఒక రోజు రోగుల జీవితాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధకులు అంటున్నారు.

ఇది ఎలా పని చేస్తుందో ఈ ఫొటోలలో చూడొచ్చు

దీన్ని ఉపయోగించడం ఎలా ?

కళ్లద్దాల నిపుణుడిగా పని చేసే థిబో తన అసలు పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. నాలుగేళ్ల కిందట ఆయన ఒక నైట్ క్లబ్ వద్ద జరిగిన ప్రమాదంలో 15 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోయారు.

దీంతో ఆయన వెన్నెముకకు గాయమై శరీరం చచ్చుబడిపోయింది. తరువాత రెండేళ్ల పాటు ఆసుపత్రిలోనే గడిపారు.

2017లో క్లినిటెక్, గ్రెనోబుల్ వర్సిటీ నిర్వహించిన ఎక్సోస్కెలిటన్ ప్రయోగంలో పాల్గొన్నారు.

మొదట్లో ఆయన కంప్యూటర్ గేమ్‌లో వర్చువల్ క్యారెక్టర్‌ను లేదా అవతార్‌ సినిమాలో పాత్రను నియంత్రించే బ్రెయిన్ ఇంప్లాంట్స్‌ను ప్రాక్టీస్ చేశారు. తరువాత సూట్‌తో నడవడానికి ప్రయత్నించారు.

''చంద్రుడిపై తొలి అడుగు వేసిన మానవుడిలా అనిపించింది. రెండేళ్ల నుంచి నేను నడవలేదు. ఎందుకు, ఎలా నిలబడాలనేది కూడా నేను మరిచిపోయాను. నా గదిలోని చాలా మంది కంటే నేనే ఎత్తుగా ఉంటాననే విషయాన్ని కూడా మరిచిపోయాను'' అని ఆయన పేర్కొన్నారు.

''చేతులు ఎలా నియంత్రించాలో తెలుసుకునేందుకు చాలా ఎక్కువ సమయం పట్టింది. ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే, అనేక కండరాలను సమన్వయం చేసుకుంటూ కదలించాలి. ఎక్సోస్కెలిటన్‌తో నేను చేసే అత్యంత గొప్ప విషయం ఇదే'' అని థిబో చెప్పారు.

ఎక్సోస్కెలిటన్‌తో మేలెంత?

65 కేజీల బరువుండే ఈ రోబో సూట్ మనిషిని పూర్తిస్థాయిలో నడిపించలేదు. కానీ, మనిషి తన ఆలోచనలకు అనుగుణంగా బుడిబుడి అడుగులు వేసేలా చేయడంలో ఇదో గొప్ప ముందడుగుగా చెప్పొచ్చు.

థిబో ఇలా నడిచే సమయంలో జారి పడిపోకుండా ఉండేందుకు సూట్‌ను సీలింగ్‌తో బంధించి ఉంచాల్సి వస్తోంది. ఇలా నడవడం ల్యాబ్‌లోనే సాధ్యం. బయట రోబో సూట్‌తో నడిచే పరిస్థితి ఇంకా లేదు.

''సహజ నడక కంటే ఇది చాలా దూరంగా ఉంది''అని క్లినిటెక్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ప్రెసిడెంట్ అలిం లూయిస్ బెనబిడ్ బీబీసీకి చెప్పారు.

''థిబో తన చేతులను పైకి కిందకు కదిలించడానికి, మణికట్టును తిప్పడానికి ఎక్సోస్కెలిటన్‌ను ఉపయోగించడం ద్వారా నిర్దిష్ట లక్ష్యాలను తాకవలసి వచ్చినప్పుడు 71 శాతం విజయవంతంగా ఆ పని చేయగలిగారు'' అని ఆయన పేర్కొన్నారు.

పార్కిన్సన్ వ్యాధి రోగులలో మెదడు క్రీయాశీలతను పెంపొందించేలా చేసిన ప్రొఫెసర్ బెనబిడ్ బీబీసీతో మాట్లాడుతూ ''మేము సమస్యను పరిష్కరించాం. మా సిద్ధాంతం సరైనదని చూపించాం. ఎక్సోస్కెలిటన్ రోగుల్లో కదలిక తేగలమని చెప్పడానికి ఇదే రుజువు'' అని చెప్పారు.

తర్వాత అడుగు ఏమిటి?

ఈ సాంకేతికతను మరింతగా మెరుగుపరుస్తామని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు చెప్పారు.

ప్రస్తుతం కంప్యూటర్‌తో పనిచేసే ఎక్సోస్కెలిటన్‌కు మెదడు పంపే సమాచారాన్ని కొద్ది స్థాయిలోనే వారు విశ్లేషించగలుగుతున్నారు.

350 మిల్లీ సెకన్లలోపే మెదడు ఆలోచనలకు అనుగుణంగా కదలికలను తీసుకరావాలి. లేకపోతే ఈ వ్యవస్థను నియంత్రించడం కష్టమవుతుంది.

దీనర్థం ఏమిటంటే, ప్రతి ఇంప్లాంట్‌లోని 64 ఎలక్ట్రోడ్‌లలో పరిశోధకులు 32 మాత్రమే ఉపయోగిస్తున్నారు.

అందువల్ల, మెదడు నుంచి సమాచారాన్ని విశ్లేషించడానికి మరింత శక్తిమంతమైన కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది.

థిబో వస్తువులను తీయటానికి, తరలించడానికి వీలుగా ఫింగర్ కంట్రోల్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా ఉన్నాయి.

ఇప్పటికే వీల్ చైయిర్‌ను నియంత్రించే ఇంప్లాంట్స్‌ను ఆయన ఉపయోగిస్తున్నారు.

ఈ సాంకేతికతతో దుష్ఫలితాలున్నాయా?

పక్షవాతం నుంచి మనిషికి విముక్తి కల్పించకుండా కేవలం మానవ సామర్థ్యాలను పెంపొందించడానికి వీలుగా ఎక్సోస్కెలిటన్‌లపై పరిశోధించే శాస్త్రవేత్తలు ఉన్నారు. దీనిని ట్రాన్స్‌హ్యూమనిజం అని పిలుస్తారు.

సైన్యానికి కూడా ఈ సాంకేతికతను వినియోగించాలని చూస్తున్నారు.

''మేం ఈ తీవ్రమైన, తెలివ తక్కువ అనువర్తనాలవైపు వెళ్లడం లేదు'' అని ప్రొఫెసర్ బినబిడ్ స్పష్టం చేశారు.

''మేం మానవ సామర్థ్యాలను పెంచే విధానంలోకి వెళ్లడం లేదు. గాయపడిన రోగి కోలుకునేలా అతను తన పనులను మునపటిలా చేసుకునేలా చేయడమే మా పని'' అని ఆయన చెప్పారు.

ఎక్సోస్కెలిటన్ పరిశోధన వివరాలు ది లాన్సెట్ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)