‘మోదీ అమెరికా ఎన్నికల్లో తాను ట్రంప్‌ను సమర్థిస్తున్నట్లు చెప్పలేదు.. ఆయన మాటలను వక్రీకరించకండి’

అమెరికాలోని హ్యూస్టన్‌లో కొన్ని రోజుల క్రితం జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో 'అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్' (ఈసారి ట్రంప్ ప్రభుత్వం) అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది.

అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్‌ను సమర్థిస్తున్నట్లు మోదీ ఎంతమాత్రమూ చెప్పలేదని, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించకూడదని భారత విదేశాంగ మంత్రి జయ్‌శంకర్ అన్నారు.

హ్యూస్టన్‌లో ట్రంప్‌తో కలిసి పాల్గొన్న కార్యక్రమంలోనే మోదీ 'అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్' అన్న వ్యాఖ్య చేశారు.

ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్ తరఫున ప్రచారం చేయడం ద్వారా భారత విదేశాంగ విధానాలను మోదీ ఉల్లంఘించారని ఆరోపించింది.

అయితే, ఈ అభ్యంతరాలన్నింటినీ జయ్‌శంకర్ తోసిపుచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది

''ప్రధాని మోదీ అలా అనలేదు. అమెరికాలో జరిగిన గత అధ్యక్ష ఎన్నికల్లో 'అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్' అంటూ ట్రంప్ ప్రచారం నిర్వహించిన విషయాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించారు. ఆ మాటలను వక్రీకరించడం సరి కాదు'' అని జయ్‌శంకర్ వ్యాఖ్యానించారు.

విదేశాంగ మంత్రి ఇచ్చిన ఈ వివరణపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విటర్‌లో స్పందించారు.

''మన ప్రధాని అసమర్థతను కప్పిపుచ్చినందుకు ధన్యవాదాలు జయ్‌శంకర్ జీ. ఆయన అతివినయంగా చేసిన సమర్థింపు వల్ల డెమోక్రాట్లతో (అమెరికా ప్రతిపక్ష పార్టీ) భారత్‌కు అంతరాలు పెరిగాయి.

మీ జోక్యంతో పరిస్థితి సర్దుకుంటుందని ఆశిస్తున్నా. దౌత్యం గురించి వారికి (మోదీకి) కొంచెం నేర్పించండి'' అని ట్వీట్ చేశారు.

మోదీ ఏం అన్నారు?

సెప్టెంబర్ 22న హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో డోనల్డ్ ట్రంప్‌తో కలిసి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీకి ఆహ్వానం పలుకుతూ ట్రంప్ మొదట ప్రసంగించారు. తనను తాను భారత్‌కు 'మంచి మిత్రుడి'గా వర్ణించుకున్నారు.

ఆ తర్వాత మోదీ ప్రసంగిస్తూ గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారం గురించి ప్రస్తావించారు.

''ట్రంప్‌తో భారతీయులకు మంచి బంధం ఏర్పడింది. అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడు 'అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్' అంటూ మీరు పలికిన మాటలు మాకు స్పష్టంగా అర్థమయ్యాయి'' అని అన్నారు.

అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనల్డ్ ట్రంప్ భారత సంతతి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు. అందులో 'అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అంతకుముందు 2014లో జరిగిన భారత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 'అబ్‌కీ బార్ మోదీ సర్కార్' అన్న నినాదంతో ప్రచారం నిర్వహించింది.

అయితే, ట్రంప్ తరఫున మోదీ ఎన్నికల ప్రచారం చేశారంటూ హౌడీ మోదీ కార్యక్రమం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు.

కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ కూడా వారిలో ఒకరు.

''మరో దేశపు ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదన్న భారత విదేశాంగ నీతిని మోదీ ఉల్లంఘించారు. దీర్ఘ కాలంలో వ్యూహాత్మకంగా భారత్ ప్రయోజనాలకు ఇది తీవ్ర నష్టం కలిగిస్తుంది'' అని ఆయన ట్విటర్‌లో ఆరోపించారు.

''అమెరికాలోని రెండు పార్టీలతోనూ భారత్‌కు ఒకే విధమైన బంధం ఉంది. మీరు ట్రంప్ తరఫున ప్రచారం చేసి రెండు దేశాలకు నష్టం చేస్తున్నారు. అమెరికాకు మీరు భారత ప్రధాని హోదాలో వెళ్లారు, ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా కాదు'' అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)