You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోదావరిలో మునిగిన బోటు బయటకు వస్తోందా?
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
గోదావరి నదిలో విహార యాత్రికులతో వెళ్తున్న బోటు మునిగి పదిహేను రోజులు దాటింది. ఇంతవరకు బోటు వెలికితీత ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారం రోజుల విరామం తర్వాత తాజాగా సోమవారం మళ్లీ వెలికితీత ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈసారి కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో కచ్చులూరు వద్ద ఈ పనులు ప్రారంభించారు.
సెప్టెంబర్ 15న ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బోటులో 77మంది ఉన్నారని అధికారులు లెక్కతేల్చారు.
ఇప్పటివరకు 36 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 15 మృతదేహాలు బోటులో చిక్కుకుని ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ప్రమాదానికి గురయిన తమవారి మృతదేహాలు కూడా దొరక్కపోవడంతో మృతుల బంధువులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.
బోటు మునిగిన ప్రాంతంలో గోదావరి వడి, లోతు కూడా ఎక్కువగా ఉండడంతో వెలికితీత జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతూ వచ్చారు.
ప్రస్తుతం గోదావరి నది వరద ఉద్ధృతి కొంత తగ్గడంతో ఆదివారం నుంచి పనులు ప్రారంభించారు.
రేపటికి స్పష్టత వస్తుంది: సత్యం
ఈ రోజు ఉదయం నుంచి చేసిన ప్రయత్నం ఫలిస్తుందనే ఆశతో ఉన్నామని వెలికితీత బృందానికి నేతృత్వం వహిస్తున్న సత్యం బీబీసీకి తెలిపారు.
''మొత్తం 25మంది పనులు చేస్తున్నాం. ఇనుప కేబుల్‌ను గోదావరిలో వేశాం, లంగరుకి నీటిలో ఏదో తగిలింది. బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. కొంతసేపు బలంగా ఉంది, అనంతరం వదులుగా మారింది. దాంతో అది బోటేనా కాదా అన్నది తెలియడం లేదు. రేపటికి స్పష్టత వస్తుంద''ని చెప్పారు.
అవసరమైతే సహకరిస్తాం అంటున్న స్థానికులు
బోటు బయటకి వస్తుందని నమ్ముతున్నామని స్థానికులు చెబుతున్నారు. అటు పశ్చిమగోదావరి, ఇటు తూర్పుగోదావరి జిల్లాలోని పరిసర గ్రామాలకు చెందిన అనేకమంది బోటు వెలికితీత పనుల వద్దకు వస్తున్నారు. మంటూరుకి చెందిన పల్లాల కృష్ణా రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ వెలికి తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని అనుకుంటున్నాం. ప్రమాదం జరిగినప్పుడు కొందరిని కాపాడగలిగాం. మిగిలిన మృతదేహల కోసం చేస్తున్న ప్రయత్నాలకు స్థానికంగా మాకు ఉన్న అనుభవంతో సహకారం అందిస్తామని తెలిపారు.
పంటు సహాయంతో ఐరన్ రోప్ నదిలో వేసిన బృందం, ప్రొక్లెయిన్ సహాయంతో తాడుని లాగుతున్నారు.
తొలిరోజు ప్రయత్నాలను రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షించారు. రెవెన్యూ, ఇరిగేషన్ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులు ఎవరూ కనిపించలేదు. సోమవారం చేసిన ప్రయత్నాలతో మంగళవారం నాటికి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- గోదావరిలో వరుస పడవ ప్రమాదాలు... ఎందుకిలా జరుగుతోంది? ఎవరు బాధ్యులు?
- #గ్రౌండ్‌రిపోర్ట్: ‘బోటు తలుపులు వేయడంతో ఈత వచ్చినా మునిగిపోయారు’
- ప్రెస్ రివ్యూ: గోదావరి పడవ ప్రమాదంపై యజమాని సమాధానమిదే
- కృష్ణా విషాదం: అక్కడికి రాగానే ఆగిపోతున్నారు!
- వివాదాల్లో చిక్కుకున్న అందగత్తెలు
- అణు బాంబును పేల్చింది ఇక్కడేనా?
- డెడ్‌బాడీని చంపేశారు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)