You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డోనల్డ్ ట్రంప్‌తో తలపడనున్న ఆసియా 'మీమ్' కింగ్
- రచయిత, ఝావోయిన్ ఫెంగ్
- హోదా, బీబీసీ చైనా సర్వీస్, వాషింగ్టన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆండ్రూ యాంగ్ పొందుతున్న ప్రజాదరణ ఎవరూ ఊహించనిది. అమితంగా ఆరాధించే అభిమానులున్న నేతల్లో ఆయన కూడా ఒకరు.
డోనల్డ్ ట్రంప్‌కు ఎదురు నిలిచేదెవరు? అని అడిగితే ''నేనే''అంటూ డెమోక్రటిక్ అభ్యర్థి అయిన యాంగ్ వెంటనే చెబుతుంటారు. తనను తాను ''గణిత శాస్త్రంలో ప్రావీణ్యం సాధించిన ఆసియా యువకుడి''గా ఆయన పరిచయం చేసుకుంటారు.
నెలకు వెయ్యి డాలర్ల సార్వత్రిక కనీస ఆదాయం ప్రతిపాదన, ఆర్థిక వ్యవస్థ పతనం కాబోతుందని ముందుగానే ఊహించి... సిద్ధంచేసిన వ్యూహాలు, తనపై తానే వేసుకొనే చతురోక్తులు ఆయనకు విశేష ఆదరణ తెచ్చిపెట్టాయి.
ఆయన ప్రచారం మొదలుపెట్టేటప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, నేడు ఇంటర్నెట్‌లో ''యాంగ్ గాంగ్'' పేరుతో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థుల్లో ''మీమ్ కింగ్''అని గౌరవ బిరుదును కూడా ఆయనకు నెటిజన్లు ప్రదానం చేశారు.
ఎలాంటి షరతులూ లేకుండా 18ఏళ్లు పైబడిన అమెరికన్లు అందరికీ నెలకు 1000 డాలర్లు చొప్పున కనీస వేతనం ఇచ్చేందుకు ''ఫ్రీడమ్ డివిడెండ్'' పేరుతో ఆయన ఓ సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని ప్రతిపాదించారు. దీని చుట్టూనే ఆయన ప్రచారం తిరుగుతోంది. 44ఏళ్ల యాంగ్.. టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్.
వచ్చే మూడు దశాబ్దాల్లో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో దాదాపు సగం మంది అమెరికన్ల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని యాంగ్ హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాల కోతతో చుట్టుముట్టే ఇబ్బందులు, సమస్యలకు సార్వత్రిక కనీస ఆదాయ పథకం కొంతవరకు పరిష్కారం చూపగలదని ఆయన భావిస్తున్నారు. ఆచరణకు సాధ్యంకానట్లు కనిపిస్తున్న ఈ ప్రతిపాదనను చూసి చర్చా వేదికలపై ప్రత్యర్థులు నవ్వుతున్నారు. అయితే లెక్కలన్నీ చూసుకున్నాకే 'ఫ్రీడమ్ డివిడెండ్'ను తెరపైకి తెచ్చానని యాంగ్ చెబుతున్నారు.
నేషనల్ పోల్స్‌లో ఆయనకు 3 శాతానికి అటూఇటూగా మద్దతు కనిపిస్తోంది. దీంతో జాబితాలో డెమోక్రటిక్ పార్టీ అగ్ర నాయకుల కిందన ఆయన పేరుంది. అయితే కోరీ బుకర్, ఎమీ క్లోబుషార్ లాంటి అనుభవమున్న సెనేటర్ల కంటే యాంగ్ ముందున్నారు.
యాంగ్ ప్రచార నినాదం 'మేక్ అమెరికా థింక్ హార్డర్'. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలకు పొంచివున్న ముప్పుపై చర్చకు తెరతీసి తన నినాదాన్ని ఆయన సార్థకం చేసుకుంటున్నారు.
వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ర్యాలీలో వందల మంది ఆయన మద్దతుదారులు 'యాంగ్ యాంగ్' అంటూ ఉత్సాహంతో నినాదాలు చేశారు. గణిత గుర్తులు రాసిన బోర్డులనూ ప్రదర్శించారు. వీరిలో ఎక్కువ మంది శ్వేత జాతీయులు, ఆసియన్లు ఉన్నారు. మహిళల కంటే పురుషుల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది.
''ఓ రాష్ట్రం డివిడెండ్ ఇచ్చే పద్ధతిని అనుసరిస్తోంది. అక్కడ అందరికీ ఏడాదికి రెండు వేల డాలర్లు లభిస్తున్నాయి. అది ఏ రాష్ట్రం''అని ర్యాలీలో జనాలను ఉద్దేశించి యాంగ్ ప్రశ్నించారు.
''అలస్కా''అంటూ వెంటనే చాలా మంది గట్టిగా అరిచారు. అధ్యక్ష ఎన్నికలు ఇంకా తొలి దశలోనే ఉన్నప్పటికీ.. యాంగ్ వ్యాఖ్యలు ఆయన అభిమానుల నోట మార్మోగుతున్నాయి.
''ఆ పథకానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి''అని యాంగ్ అడిగిన వెంటనే.. ''చమురు''అని సమాధానం వస్తోంది.
1982 నుంచీ వార్షిక డివిడెండ్‌ను అలస్కా అందిస్తోంది. చమురు తవ్వకాలపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలో ఉండేవారికి సార్వత్రిక కనీస ఆదాయం రూపంలో ఇస్తోంది.
''21వ శతాబ్దపు చమురు ఏది''అని యాంగ్ ప్రశ్నించగా.. ''టెక్నాలజీ''అంటూ ఆయన అభిమానులు, మద్దతుదారులు ఉత్సాహంగా సమాధానం చెబుతున్నారు.
టెక్నాలజీ దిగ్గజాలపై వ్యాట్‌ను విధించడం ద్వారా అలస్కా తరహాలోనే అమెరికన్లందరికీ సార్వత్రిక కనీస ఆదాయం ఇవ్వొచ్చని హాయిగా నవ్వుతూ యాంగ్ వివరిస్తున్నారు.
ర్యాలీకి వచ్చిన వారిలో 19ఏళ్ల జేలన్ ఆడమ్స్, 18ఏళ్ల ఎమిలీ సైనోస్కి కూడా ఉన్నారు. వీరు ర్యాలీ కోసం డెలావేర్ నుంచి ఇక్కడికి వచ్చారు. యువతకు కీలకమయ్యే భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించడం వల్లే యాంగ్ వెంట నిలిచినట్లు బీబీసీకి ఎమిలీ తెలిపారు.
''ఆటోమేషన్ పతాక స్థాయికి చేరేటప్పుడు.. ఆ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సింది మేమే''అని ఆమె వివరించారు.
యాంగ్ ఆన్‌లైన్ పాపులారిటీకి సోషల్ మీడియా జనరేషన్ నుంచి వస్తున్న మద్దతూ ఓ కారణం. డెమోక్రటిక్ అభ్యర్థుల ప్రాథమిక ఎన్నికల తొలి చర్చా వేదిక అనంతరం.. అందరికంటే యాంగ్‌కే ఎక్కువ మంది ట్విటర్లో మద్దతు పలికారు.
''యాంగ్ చెప్పే మాటలను మా స్నేహితులందరూ తప్పక వినేలా చేస్తాను''అని ఆడమ్స్ వివరించారు.
యాంగ్ ఆన్‌లైన్ మద్దతుదారుల్లో కొందరు అతివాద భావజాలమున్న జాతీయవాదులూ ఉన్నారు. ఆటోమేషన్‌తో భారీగా ఉద్యోగాలపై కోత పడుతుందని యాంగ్ చేసిన వ్యాఖ్యలపై వారు ఆకర్షితులవుతున్నారు. అమెరికా శ్వేతజాతి కార్మికులకు సంఘీభావం తెలిపే నేతగా ఆయన్ను వారు పరిగణిస్తున్నారు.
జాత్యహంకారం, వివక్షలతో కూడిన వ్యాఖ్యలు కనిపించే ఆన్‌లైన్ వేదికలపై యాంగ్ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆయన విధానాలపై కొందరు ప్రముఖ శ్వేతజాతి జాతీయవాదులు బహిరంగంగానే ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే వీటిని యాంగ్ తిరస్కరిస్తున్నారు. ''నా విలువలు, ఆదర్శాలకు వారు పూర్తి వ్యతిరేకం''అని యాంగ్ అంటున్నారు.
అమెరికా భవిష్యత్తు తరాల ప్రధాన సమస్యపై దృష్టి కేంద్రీకరిస్తున్న యాంగ్ తనను తాను బయటివ్యక్తిగా చెప్పుకొంటుంటారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వెనక నిలబడిన వారి నుంచి బెర్నీ శాండెర్స్ మద్దతుదారుల వరకు, కన్జర్వేటివ్‌ల నుంచి ప్రోగ్రెసివ్ నాయకుల వరకు అందరి మద్దతునూ ఆయన కూడగడుతున్నారు.
సిలికాన్ వేలీ టెక్ వర్కర్లలో యాంగ్‌కు మంచి ఆదరణ ఉంది. యాంగ్‌కు ట్విటర్ వేదికగా టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ మద్దతు కూడా పలికారు. టెక్నాలజీతో సంభవించే పరిణామాలపై ఆయనకు లోతైన అవగాహన ఉందని, ఆయన చక్కని పరిష్కారాలు చూపగలరని టెకీలు భావిస్తున్నారు.
పెద్దగా రాజకీయ చైతన్యంలేని ఆసియా-అమెరికన్ ఓటర్ల మద్దతునూ యాంగ్ కూడగట్టారు. తైవాన్ వలసదారుల కుమారుడైన ఆయన.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన తూర్పు ఆసియా అమెరికన్ నాయకుల్లో మొదటివాడు, అత్యంత ప్రజాదరణ కలిగినవాడు.
యాంగ్ ర్యాలీకి తన ఆరేళ్ల కుమార్తెను వెంటపెట్టుకొని చైనాకు చెందిన అలీసన్ షియూ వచ్చారు. షియూతోపాటు ఆమె కుమార్తెకూ ఇది తొలి రాజకీయ సభ. ''అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాలాగ కనిపించే వ్యక్తి పోటీ చేస్తున్నాడని నా కుమార్తెకు చూపించేందుకు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చాను''అని బీబీసీ న్యూస్‌తో షియూ వివరించారు.
''రాజకీయాల్లో మరింత మంది ఆసియా అమెరికన్లు పాలుపంచుకొనేందుకు యాంగ్ ప్రచారం తోడ్పడుతుంది''అని న్యూజెర్సీలోని చైనీస్ అమెరికా నాయకుడు యాంగ్‌షావో ఝాంగ్ వివరించారు. ''ఇకపై విదేశీయులమనే శాశ్వత భావన వారిలో తొలగిపోతుంది''అని అన్నారు.
అయితే, కొన్నిసార్లు తనపై తాను వేసుకొనే యాంగ్ జోక్‌లు, చతుర్లు ఆసియాలోని స్టీరియోటైప్‌లకు మద్దతు పలుకుతున్నట్లు కనిపిస్తున్నాయి.
''నేను ఆసియా వాసిని. అందుకే నాకు చాలా మంది వైద్యులు తెలుసు''అని హూస్టన్‌లో జరిగిన డెమోక్రటిక్ అధ్యక్ష ప్రాథమిక ఎన్నికల చర్చా కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. దీంతో జాత్యహంకార వ్యాఖ్యల వివాదానికి ఆయన కేంద్ర బిందువుగా మారారు.
మరోవైపు యాంగ్ గురించి ప్రస్తావిస్తూ చైనీస్ యాసలో స్టాండప్ కమేడియన్ షేన్ గిల్స్ చతుర్లు విసరడంతో వివాదం చెలరేగింది. ఆ సమయంలో మందలింపు కంటే క్షమించేందుకే యాంగ్ మొగ్గుచూపారు. దీంతో ఆసియా అమెరికన్ ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు.
ఆసియావాసులు, నల్లజాతీయులపై విద్వేష వ్యాఖ్యల విషయంలో అమెరికన్లు ఎలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారో పోల్చినందుకూ యాంగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
అంతర్జాతీయ రాజకీయ చిక్కుప్రశ్నలనూ యాంగ్ ఇప్పుడు దాటుకు రావాల్సి ఉంటుంది. డెమోక్రటిక్ నేతల తొలి ప్రాథమిక ఎన్నికల చర్చల్లో ఆయనకు ఎదురైన రెండు ప్రశ్నల్లో చైనాతో వాణిజ్యం కూడా ఒకటి. వాణిజ్య యుద్ధంతో అమెరికా జేబుకు చిల్లు పడుతుందని ఆయన భావిస్తున్నారు.
వేరుసెనగ పంట పొలాల్లో తన తండ్రి పెరిగారని ఇటీవల జరిగిన చర్చలో యాంగ్ తెలిపారు. అయితే తైవాన్ పేరును నేరుగా ఆయన ప్రస్తావించలేదు. ఈ ద్వీప దేశాన్ని చాలా మంది చైనావాసులు తమ తిరుగుబాటు ప్రాంతంగా భావిస్తుంటారు.
రాజకీయ వివాదాలతో చైనీస్ అమెరికా మద్దతుదారులు దూరం కాకుండా ఉండేందుకు ఆయన ఇలాంటి అస్పష్ట వ్యాఖ్యలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే తన మాండరిన్ భాష అంత బాగోదని యాంగ్ చెబుతున్నప్పటికీ.. చైనా మీడియా ఆయన ప్రసంగాలు, చర్చా వేదికలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.
అమెరికా రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు యాంగ్ చేరుకుంటారో లేదో వేచిచూడాలి. అయితే ప్రచార పర్వంలో విపరీతంగా నవ్వులు పూయిస్తున్న, చతుర్లు విసురుతున్న నాయకుడు మాత్రం ఆయనే కావొచ్చు. డాన్స్ చేస్తూ, బాస్కెట్ బాల్ ఆడుతూ, జనాల మధ్య తిరుగుతున్న దృశ్యాలను తరచూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
జనాలతో కలిసి ఆయన తిరుగుతున్న వీడియోకు ట్విటర్‌లో 35,000 లైక్‌లు వచ్చాయి. ''ఓ రాజకీయ నాయకుడు ఇలా మద్దతుదారులతో కలిసి ఉల్లాసంగా గడపడం చూస్తుంటే చాలా సరదాగా అనిపిస్తోంది''అని ఓ ట్విటర్ వినియోగదారుడు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)