You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సౌదీ అరేబియా: విదేశీ పర్యటకులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైన అరబ్ దేశం
ఆర్థికవ్యవస్థ మొత్తం చమురుపైనే ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడేందుకు గాను సౌదీ అరేబియా పర్యటక ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఇందుకోసం విదేశీ పర్యటకులు తమ దేశంలో పర్యటించే అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది.
తొలి విడతలో 49 దేశాల పర్యటకులకు మాత్రమే వీసాలు జారీ చేయనుంది. తమ దేశంలో ఉండే కఠినమైన వస్త్రధారణ నిబంధనలను కూడా మహిళా పర్యటకుల కోసం కొంత సడలించింది.
ఈ నిర్ణయం తమ దేశానికి చరిత్రాత్మకమని సౌదీ అరేబియా పర్యటక మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ అన్నారు. యాత్రికులు, వ్యాపారులు, ప్రవాస కార్మికులకు మాత్రమే ప్రస్తుతం సౌదీ వీసాలు ఇస్తారు.
పర్యటక రంగంలో విదేశీ పెట్టుబడులపైనా ఆ దేశం ఆశలు పెట్టుకుంది. 2030 నాటికి పర్యటక ఆదాయం 3 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాలని కోరుకుంటోంది.
అందం చూడవయా..
''మా దేశ పర్యటనకు వచ్చే యాత్రికులు ఆశ్చర్యపోవడం ఖాయం. అయిదు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, కట్టిపడేసే ప్రకృతి అందాలు, ఉత్తేజాన్నందించే స్థానిక సంస్కృతి వంటివన్నీ పర్యటకులకు కనువిందు చేస్తాయ''ని ఖతీబ్ చెప్పారు.
విదేశాల నుంచి పర్యటనకు వచ్చే మహిళలు సౌదీ మహిళల మాదిరిగా ఒళ్లంతా కప్పుకొనేలాంటి దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని, అయితే, సభ్యమైన దుస్తులు ధరించడం మాత్రం అవసరమని ఆయన చెప్పారు.
ఒంటరి మహిళలు పర్యటనకు రాకూడదన్న నిబంధనలు కూడా ఏమీ లేవని చెప్పారు.
మా సంస్కృతిని గౌరవిస్తేనే
''మా సంస్కృతి ప్రత్యేకం. దాన్ని మా అతిథులు, స్నేహితులు కూడా మా సంస్కృతిని గౌరవిస్తారన్న నమ్మకం ఉంది. ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాం.. దుస్తులు మాత్రం సభ్యమైనవి వేసుకోవాల'న్నారాయన.
ముస్లిమేతరులు మక్కా, మదీనాలు సందర్శించడానికి వీలు లేదని.. అలాగే మద్యం కూడా నిషిద్ధమని తెలిపారు.
ఇటీవల తమ చమురు కేంద్రాలపై జరిగిన దాడులకు భయపడి పర్యటకులు రారన్న అనుమానాలు తమకు లేవన్నారు.
‘మీకే భయం లేదు’
''ప్రపంచంలోని భద్రమైన నగరాల్లో సౌదీ నగరాలూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దాడులు మాపై ప్రభావం చూపిస్తాయనుకోం'' అన్నారాయన.
పర్యటకానికి తెర తీస్తూ తీసుకున్న ఈ నిర్ణయం క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సంస్కరణల్లో భాగమని... సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థపై పూర్తిగా చమురుపైనే ఆధారపడే పరిస్థితిని మార్చడానికి ఈ సంస్కరణలు చేపడుతున్నారని తెలిపారు.
జమాల్ ఖషోగ్జీ హత్యతో...
కొత్త పర్యటక విధానంలో భాగంగా 2030 నాటికి దేశీయ, విదేశీ పర్యటకుల సంఖ్య 10 కోట్లకు పెరగాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు, పర్యటక రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పనా లక్ష్యంగా పెట్టుకుంది.
గత ఏడాది జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య, ఇటీవల మహిళా హక్కుల కార్యకర్తలపై దాడుల వంటి కారణాలతో సౌదీ అరేబియా అప్రతిష్ఠ మూటగట్టుకుంది.
మరోవైపు సౌదీ 2017లోనే భారీ పర్యటక ప్రాజెక్ట్ ప్రకటించింది. ఎర్ర సముద్రంలోని 50 దీవులను పర్యటక రిసార్టులుగా మార్చాలన్నది ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం. అందులో భాగంగానే రియాద్ సమీపంలోని క్విదియా దీవిలో పనులు మొదలయ్యాయి.
బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్ ఫ్రాంక్ గార్డనర్ విశ్లేషణ..
సౌదీ అరేబియా పర్యటకానికి తెర తీయడం ఇదే తొలిసారి కాదు. 2000 సంవత్సరంలో అసిర్ ప్రావిన్స్‌లోని పర్వతాల్లో పర్యటకుల కోసం పారా గ్లైడింగ్, రాక్ క్లైంబింగ్ నిర్వహించేలా ఫ్రాన్స్ శిక్షకులను నియమించుకుంది.
కానీ, 9/11 దాడుల తరువాత అన్నీ పక్కనపెట్టేసింది. ఆ దాడుల్లో 15 మంది సౌదీ దేశస్థుల ప్రమేయముంది.
అయితే, దేశీయ, ఆధ్యాత్మిక పర్యటకం ఎలాంటి ఢోకా లేకుండా సాగింది. హజ్ యాత్ర కోసం ఏటా 30 లక్షల మంది వస్తున్నారిక్కడికి.
సౌదీలో బాగా వేడిగా ఉండే, పొడి వాతావరణానికి దూరంగా అసిర్ పర్వతసానువుల్లోకి కానీ, ఎర్ర సముద్ర తీరానికి కానీ వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ.. అక్కడ కూడా కాక్ టైల్ వంటివి ఆశించొద్దు. ఎందుకంటే అది సౌదీ అరేబియా.
ఇవి కూడా చదవండి:
- 'సౌదీ చమురు క్షేత్రాలపై ఇరానే దాడులు చేసిందనడానికి ఈ శకలాలే నిదర్శనం'
- సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?
- సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులతో పెరిగిన ఆయిల్ ధరలు.. మీపై ప్రభావం పడుతుందా?
- సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
- జమాల్ ఖషోగ్జీ 'బలి ఇవ్వాల్సిన జంతువు' - హత్యకు ముందు రికార్డింగ్ వివరాలు ప్రచురించిన టర్కీ పత్రిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)