You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గూగుల్ మ్యాప్ గుర్తించిన నీటమునిగిన కారు, అందులో ఓ అస్థిపంజరం... దాని వెనుక 22 ఏళ్ళ నాటి కథ
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల లాంటానాకు చెందిన విలియం మోల్డ్ 1997 నవంబర్ ఏడో తేదీన కనిపించకుండా పోయాడు. అప్పుడు అతడి వయసు 40 సంవత్సరాలు.
అంతకుముందు రోజు రాత్రి క్లబ్‌కు వెళ్లిన విలియం తిరిగి రాలేదు. మిస్సింగ్ పర్సన్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఫలితం లేదు. ఆ తర్వాత ఈ కేసు అటకెక్కింది.
ఇరవై రెండు సంవత్సరాల తర్వాత.. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన పోలీసులకు ఓ సమాచారం అందింది.
వెలింగ్టన్‌లోని మూన్ బే సర్కిల్‌లో గల ఒక చెరువులో ఒక కారు మునిగిపోయి కనిపించిందన్నదే ఆ సమాచారం.
పోలీసులు ఆ కారుని నీటి నుంచి బయటకు తీశారు. అందులో ఒక అస్థిపంజరం కనిపించింది. దానిని పరీక్షించి అది విలియం మోల్ట్ అస్థిపంజరంగా గుర్తించారు.
నీటిలో మునిగిపోయిన ఈ కారు 22 ఏళ్ళ తర్వాత వెలుగుచూడటం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
గూగుల్ మ్యాప్స్‌లో ఓ కారు నీట మునిగి కనిపించింది. రెండు దశాబ్దాల కిందట అదృశ్యమైన విలియం.. ఆ కారులో మృతదేహంగా కనిపించాడు.
''ప్రాపర్టీ సర్వేయర్ ఒకరు గూగుల్ ఎర్త్ మీద ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నపుడు, నీటిలో మునిగివున్న ఈ కారును గుర్తించాడు'' అని చార్లీ ప్రాజెక్ట్ అనే సంస్థ పేర్కొంది. అమెరికాలో అపరిష్కృతంగా మిగిలిపోయిన కేసుల సమాచారాన్ని ఈ సంస్థ ఆన్‌లైన్ డాటాబేస్‌లో ఉంచుతోంది.
''ఈ ప్రాంతానికి సంబంధించిన గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఫొటోలో ఈ వాహనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అది కూడా 2007 సంవత్సరం నుంచీ. కానీ 2019 వరకూ ఎవరూ గుర్తించినట్టే లేదు'' అని చార్లీ ప్రాజెక్ట్ ఒక నివేదికలో వివరించింది.
చెరువులో మునిగిపోయి ఉన్న ఆ వెండి రంగు కారు ఇప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తూనే ఉంది.
విలియం మోల్డ్ కారు నడుపుతూ అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయి మునిగిపోయినట్లు కనిపిస్తోందని పామ్ బీచ్ కౌంటీ పోలీస్ కార్యాలయం బీబీసీకి వివరించింది.
అయితే, తొలుత అతడు అదృశ్యమైనపుడు చేసిన దర్యాప్తులో అతడి కారు చెరువులో మునిగిపోయిందనేందుకు ఆధారాలేవీ లేవు'' అని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల నీటి మట్టంలో మార్పులు రావటంతో ఆ కారు గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిందని చెప్పారు.
''అన్నేళ్ల కిందట ఏం జరిగిందనేది ఇప్పుడు నిర్ధారించలేం. మనకు తెలిసిందల్లా.. అతడు అప్పుడు అదృశ్యమయ్యాడని.. ఇప్పుడు అతడి ఆచూకీ దొరికిందని మాత్రమే'' అని వ్యాఖ్యానించారు.
విలియం అదృశ్యమైన రోజు అతడు రాత్రి 11 గంటల సమయంలో క్లబ్ నుంచి బయలుదేరినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి.
అప్పుడు అతడు మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపించటం లేదని, తన కారులో ఒంటరిగానే బయలుదేరాడని కూడా ఆ రికార్డులు వివరిస్తున్నాయి.
''అతడికి మద్యం పెద్దగా అలవాటు లేదు. కానీ, ఆ రోజు రాత్రి బార్‌లో కొంత మద్యం సేవించాడు. రాత్రి 9:30 గంటలకు తన గర్ల్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి తాను ఇంటికి బయలుదేరుతున్నట్ల చెప్పాడు. కానీ, అతడు ఇంటికి చేరుకోలేదు'' అని ఆ రికార్డులు పేర్కొన్నాయి.
అతడి భౌతిక అవశేషాలను కనుగొన్న విషయాన్ని అతడి గర్ల్ ఫ్రెండ్‌కు తెలియజేశారా లేదా అనేది తెలీదు.
ఇవి కూడా చదవండి:
- మియన్మార్‌లోని రోహింజ్యా ముస్లిం గ్రామాలను ధ్వంసం చేసిన ప్రభుత్వం.. వాటి స్థానంలో బ్యారక్‌లు, శిబిరాలు
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- ఆంధ్రప్రదేశ్: ఆత్మకూరు ఎందుకు వార్తల్లోకెక్కింది? ఆ ఊరిలో ఏం జరుగుతోంది...
- పాకిస్తాన్లో లీటర్ పాలు రూ. 140.. పెట్రోలు కంటే ఎక్కువ ధర.. కారణమేంటి?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
- కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద క్షిపణి పరీక్ష విజయవంతం... డీఆర్డీవోను ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)