You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అణ్వాయుధ సామర్థ్యమున్న క్షిపణిని పరీక్షించిన అమెరికా.. సైనిక ఉద్రిక్తతలను పెంచుతోందన్న రష్యా
అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఒక మధ్యశ్రేణి క్రూయిజ్ క్షిపణిని అమెరికా పరీక్షించింది.
ఇలాంటి ఆయుధాలను నిషేధించే ఒప్పందం నుంచి వైదొలగిన తర్వాత దాదాపు రెండు వారాలకే అమెరికా ఈ క్షిపణి పరీక్షను చేపట్టింది.
అమెరికా నౌకాదళం నియంత్రణలో ఉండే శాన్ నికోలస్ ఐలాండ్ నుంచి ఆగస్టు 18న యూఎస్ దీనిని పరీక్షించింది. ఈ దీవి కరోలినా రాష్ట్రం లాస్ ఏంజెలిస్ నగరానికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికా రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఉపరితలం నుంచి 500 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి, నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని వివరించింది. ఇది సంప్రదాయ ఆయుధ వ్యవస్థతో కూడినదని చెప్పింది. అంటే ఇది అణ్వస్త్ర సహిత క్షిపణి కాదని పరోక్షంగా చెప్పింది.
రష్యా స్పందిస్తూ- అమెరికా చర్య విచారకరమని వ్యాఖ్యానించింది.
అమెరికా సైనిక ఉద్రిక్తతలను పెంచుతోందని, రెచ్చగొట్టే చర్యలపై ప్రతిస్పందించంబోమని రష్యా విదేశీ వ్యవహారాలశాఖ ఉపమంత్రి సెర్గీ ర్యాబ్‌కోవ్ చెప్పారని రష్యా ప్రభుత్వ వార్తాసంస్థ 'టాస్' తెలిపింది.
ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఒప్పందం
ఈ ఒప్పందం ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటిది.
1987లో అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్ మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని 'ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్(ఐఎన్‌ఎఫ్)' అంటారు.
ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఆగస్టు 2న దీని నుంచి అమెరికా తప్పుకొంది.
ఈ ఆరోపణలను రష్యా తోసిపుచ్చుతోంది.
500 నుంచి 5,500 కిలోమీటర్ల వరకు దూరంలోని లక్ష్యాలను ఛేదించగల స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణి అణ్వస్త్ర క్షిపణులను, అణ్వస్త్రేతర క్షిపణులను ఈ ఒప్పందం నిషేధిస్తోంది. సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులకు మినహాయింపు ఉంది.
ఈ ఒప్పందం లేకపోతే అమెరికా, రష్యా, చైనా మధ్య కొత్తగా ఆయుధ పోటీ ఏర్పడవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటర్నెట్ ప్రకటనలు: ఎలా మొదలయ్యాయి? ఎలా ఇబ్బంది పెడుతున్నాయి? ఇకపై ఏమవుతాయి?
- ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా
- కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా, కాలేదా.. ఈ 7 సంకేతాలే చెబుతాయి!
- ఫేస్‌బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)