You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇంటర్నెట్ ప్రకటనలు: ఎలా మొదలయ్యాయి? ఎలా ఇబ్బంది పెడుతున్నాయి? ఇకపై ఏమవుతాయి?
ఇంటర్నెట్‌లో యాడ్‌లు చిరాకు తెప్పిస్తున్నాయా? మిమ్మల్ని ప్రమాదకర సైట్లలోకి తీసుకెళ్తున్నాయా? ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఇంటర్నెట్‌లో సమాచారాన్ని పొందేందుకు మీరు మీ జేబు నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావొచ్చు!
డిజిటల్ అడ్వర్టైజింగ్ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. వ్యాపార ప్రకటనల మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అనేక ప్రకటనలు అసలు వినియోగదారుల దృష్టికే వెళ్లడం లేదు. ఇంటర్నెట్ మౌలిక వ్యాపార నమూనానే దెబ్బతీసేలా యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.
డిజిటల్ వ్యాపార ప్రకటనల పరిశ్రమ విశ్వసనీయతను కోల్పోయిందని చాలా మంది పరిశీలకులు చెబుతున్నారు. ఈ పరిశ్రమ తనను చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించుకోలేకపోతే యూజర్లు ఇంటర్నెట్‌లో పొందే కంటెంట్‌కు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడొచ్చు.
కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణం కారణంగా సతమతమవుతున్న ఫేస్‌బుక్ ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈవో) మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఒక సంకేతం ఇచ్చారు. సోషల్ మీడియా వేదికల యూజర్లకు పూర్తిస్థాయి గోప్యత, ప్రకటనల చికాకు లేని అనుభూతి కల్పించాలంటే ఈ వేదికలను వినియోగించుకొనే వారి నుంచి సొమ్ము వసూలు చేయడమే ఏకైక మార్గం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
నాడు చేసిన తప్పులు నేడు వెంటాడుతున్నాయి
దాదాపు 20 ఏళ్ల క్రితం డిజిటల్ వ్యాపార ప్రకటనలు వచ్చిన తొలినాళ్లలో ఈ రంగంలోని వారందరం కొన్ని ప్రాథమికమైన తప్పులు చేశామని, అవే ఇప్పుడు తమను వెంటాడుతున్నాయని ఇంటిగ్రల్ యాడ్ సైన్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ నాల్ తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ వ్యాపార ప్రకటనల మదింపు సంస్థల్లో ఇది ఒకటి.
వెబ్‌సైట్‌లో పెట్టిన యాడ్‌ను యూజర్ క్లిక్ చేశాడా, కనీసం చూశాడా లేదా అనేది పట్టించుకోకుండా వెబ్‌సైట్‌లో కేవలం యాడ్ పెట్టడాన్నే 'ఇంప్రెషన్'గా పరిగణించారని, నాడు చేసిన తప్పులకు ఇదొక ఉదాహరణ అని స్కాట్ నాల్ చెప్పారు. ఇలా లెక్కించడం అర్థరహితమన్నారు. కానీ ఇదో కొలమానంగా స్థిరపడిపోయి, యాడ్లను పబ్లిష్ చేసేవాళ్లకు, థర్డ్ పార్టీ యాడ్ సర్వర్లకు చెల్లింపులు ఎలా జరపాలో నిర్ణయించడంలో కీలకమైపోయిందని తెలిపారు. యాడ్‌పై క్లిక్ చేస్తే ఉత్పత్తిని కొన్నట్లుగా భావించారని, ఇది మరో తప్పుడు ఆలోచన అని చెప్పారు. దీనివల్ల వాస్తవ విరుద్ధమైన ఆశలు బయల్దేరాయని, తప్పుడు డేటా నిక్షిప్తమైందని తెలిపారు.
'వాసి కన్నా రాశి ముఖ్యమైంది'
ఇలాంటి అపోహలను మోసగాళ్లు ఆసరాగా చేసుకొని, డిజిటల్ యాడ్‌లను ఎక్కువ మంది చూస్తున్నారని, అనుకున్నదాని కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని చెప్పి మోసాలకు పాల్పడ్డారు. ఈ విధంగా అడ్వర్టైజింగ్‌లో నాణ్యత కాకుండా సంఖ్య ముఖ్యమైపోయిందని స్కాట్ నాల్ చెప్పారు. ''యూజర్లపై కుకీలు, యాడ్లు కుమ్మరించారు. ఇది వినియోగదారులకు మంచి అనుభూతిని ఇవ్వలేదు. అదే సమయంలో, తప్పుడు కొలమానాలతో సేకరించిన డేటాను ప్రకటనదారులకు అందించారు'' అని వివరించారు.
కొత్త సమస్యలు తెచ్చిన ఆటోమేటెడ్ అడ్వర్టైజింగ్
ప్రోగ్రామటిక్(ఆటోమేటెడ్) అడ్వర్టైజింగ్ వచ్చాక కొత్త రకం సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ విధానంలో మనుషుల ప్రమేయం స్వల్పం. 'బోట్స్' సాయంతో వేల సంఖ్యలో ప్రకటనలను వెబ్‌పేజీలపైకి చేర్చేందుకు అవకాశం ఉంటుంది. మోసగాళ్లు దీనిని తమకు అనుకూలంగా మలచుకున్నారని ప్రకటనల ప్రభావాన్ని మదింపు చేసే సంస్థ 'ఫ్లాష్‌టాకింగ్' చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ నార్డోనే తెలిపారు.
తొలిసారిగా 1994లో ఇంటర్నెట్‌లో పెయిడ్ ప్రకటనలు పెట్టిన వ్యక్తి ఆయనే. వైర్డ్ పత్రికకు ఆయన వీటిని పెట్టారు. ప్రోగ్రామటిక్ అడ్వర్టైజింగ్ మార్గదర్శకుల్లో నార్డోనే ఒకరు.
అవి మనిషి మాదిరే చేస్తాయి
'బోట్లు' చాలా చురుగ్గా వ్యవహరించగలవు. మనిషి మాదిరి, ఆన్‌లైన్‌లో కనిపించే ఫాంలను నింపగలవు. పేజీలను కిందకు స్క్రాల్ చేయగలవు. దీనివల్ల వేల కొద్దీ వెబ్‌సైట్లపై ఉంచిన యాడ్‌లను యూజర్లు చూసినట్లు ఇవి భ్రమింపజేయగలవు. యూజర్ ఎన్నడూ చూడని వెబ్‌సైట్లలో ఉంచిన ప్రకటనలను కూడా యూజర్ చూసినట్లుగా ఇవి నమ్మించగలవు.
వెబ్‌సైట్ డిజైన్ లోపంతో వచ్చే సమస్యలు
వెబ్‌సైట్ డిజైన్ సరిగా లేకపోవడం లేదా వెబ్‌పేజీని యూజర్ కిందకు జరపకపోవడంవల్ల చాలా ప్రకటనలు యూజర్ దృష్టికి వెళ్లనే వెళ్లవు. డిజిటల్ వ్యాపార ప్రకటనల పరిశ్రమలో ఇదో పెద్ద సమస్య.
'ప్రపంచ ప్రకటనదారుల సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఏ)'లో సభ్యులైన సంస్థలు ఏటా సుమారు 90 వేల కోట్ల డాలర్లు ప్రకటనలపై వెచ్చిస్తున్నాయి. డిస్‌ప్లే ప్రకటనల్లో యూజర్లకు సరిగా కనిపించేవి సగంలోపేనని ఈ సమాఖ్య చెబుతోంది. డిజిటల్ ప్రకటనలపై వెచ్చించే సొమ్ములో చాలా మేర వృథా అవుతోంది.
బూటకపు యాడ్లు మరో సమస్య
యూజర్‌కు కనిపించే యాడ్లలో చాలా యాడ్లు నిజమైన యాడ్లు కూడా కావు. క్లిక్ చేసేలా ఊరించి, యూజర్‌ను ప్రమాదకర సైట్లలోకి తీసుకెళ్లే బూటకపు యాడ్లు ఎక్కువగా ఉంటాయి. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనంగా సంపాదించాలని చూసే సైట్లు, కంప్యూటర్లను దెబ్బతీసే సైట్లు ఉంటాయి.
గూగుల్ 2017లో 320 కోట్ల చెడు ప్రకటనలను తొలగించింది. 2016తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలు.
వార్తా వెబ్‌సైట్లుగా కనిపించే మార్కెటింగ్ సైట్లు, బూటకపు సైట్లు, మాల్‌వేర్ ఉన్న సైట్లకు యూజర్లను మళ్లించే యాడ్లు వీటిలో ఉన్నాయి.
యూజర్లు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడొచ్చు
డిజిటల్ ప్రకటనల వ్యవహారాలను చక్కదిద్దేందుకు ప్రకటనల పరిశ్రమ నడుం బిగించింది. బోట్‌నెట్స్, యాడ్ మోసాలకు వ్యతిరేకంగా త్వరితగతిన చర్యలు చేపడుతున్నట్లు యాడ్ టెక్నాలజీ సంస్థ 'యాడ్‌ఫామ్'లో ప్రధాన వ్యూహకర్త జోచెన్ స్క్లూజర్ చెప్పారు. ప్రస్తుతం పారదర్శకత కొరవడిందని, దీనిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పబ్లిషర్లు మోసపోకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతుండటంతో డిజిటల్ యాడ్ రెవెన్యూలో సగానికి పైగా మొబైల్ యూజర్ల నుంచే వస్తోంది. ఐదేళ్ల క్రితం ఇది కేవలం ఏడు శాతంగా ఉండేది.
మొబైల్ యూజర్ల నుంచి వచ్చే యాడ్ రెవెన్యూలో వీడియోలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ బ్యూరో(ఐబీఏ) తెలిపింది.
వ్యక్తిగత సమాచారం జోలికి రాని, వినోదాత్మకమైన డిజిటల్ ప్రకటనలను డిజిటల్ అడ్వర్టైజింగ్ పరిశ్రమ తీసుకురాలేకపోతే యూజర్లలో చాలా మంది యాడ్, కుకీ బ్లాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఆశ్రయిస్తారు. అదే జరిగితే ఇంటర్నెట్‌లో సమాచారం పొందడానికి యూజర్లు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ఇంటర్నెట్ ఓటింగ్.. తెలుసుకోవాల్సిన విషయాలు
- ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు ఎక్కడి నుంచి అందుతున్నాయి?
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్‌లో డబ్బు సంపాదించడం ఎలా?
- 'మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్లు కనిపెట్టారు!'
- డార్క్ వెబ్: డ్రగ్స్, గన్స్.. అన్నీ డోర్ డెలివరీ!
- 2జీ.. 3జీ.. 4జీ.. మరి 5జీ ఎప్పుడు?
- మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా, కాలేదా.. ఈ 7 సంకేతాలే చెబుతాయి!
- ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కరెన్సీ దొంగతనం: 34 వేల కోట్లు.. కొల్లగొట్టారు
- బ్లూ స్క్రీన్ వచ్చిందా! మరేం భయం లేదు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)