మీ కంప్యూటర్ సిస్టమ్‌లో బ్లూ స్క్రీన్ వచ్చిందా! ఇలా చేయండి!

"బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్" - బీఎస్‌వోడీ అని సింపుల్‌గా పిలుచుకునే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఎర్రర్. దాదాపు ప్రపంచంలో కంప్యూటర్ వినియోగదారులందరినీ ఏదో ఒక సమయంలో ఇది ఇబ్బంది పెట్టే ఉంటుంది.

కంప్యూటర్ స్క్రీన్‌పైన బీఎస్‌వోడీ ఎర్రర్ వస్తే... ఏం జరిగిందో, ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో ఏమీ అర్థంకాదు.

సాధారణంగా,

"A problem has been found and Windows has been shut down to prevent damage to the computer. The problem appears to be caused by the following file ( filename ) " .

అనే ఓ మెస్సేజ్ వచ్చి సిస్టమ్ మళ్లీ మళ్లీ రీస్టార్ట్ అవుతుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.

ఇది కేవలం కంప్యూటర్లలో మాత్రమే కాదు... విండోస్ ఓఎస్‌తో పని చేసే ఇతర గ్యాడ్జెట్లు, ఏటీఎం మెషీన్లలో కూడా ఈ సమస్య తలెత్తుతూనే ఉంటుంది.

ఇటీవల విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల చేసిన అప్‌డేట్‌తో ఈ సమస్య మరింత ఎక్కువైందంటూ వినియోగదారులు ఆన్‌లైన్ ఫోరాల్లో గగ్గోలు పెడుతున్నారు.

దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారంగా మరో అప్‌డేట్‌ని అందిస్తామని ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా అక్టోబరు 10న విడుదలైన అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోకపోతే.. ఇకపై కూడా దాన్ని డౌన్‌లోడ్ చేయవద్దని సూచించింది.

విండోస్ 10 అప్‌డేట్‌తో సమస్య ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. గత డిసెంబరులో విడుదలైన ప్యాచ్ కారణంగా కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైంది.

మళ్లీ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో విడుదల చేసిన ప్యాచ్ కారణంగా వెబ్ కెమెరాలలో సమస్యలు తలెత్తాయి.

మరి బీఎస్‌వోడీ సమస్య వస్తే ఏం చేయాలి?

సేఫ్ మోడ్

కంప్యూటర్ని ‘సేఫ్‌మోడ్‌’లో స్టార్ట్ చేయాలి. కంప్యూటర్ రీస్టార్ట్ అవుతున్నప్పుడు కీబోర్డుపై ఉన్న F8 కీ నొక్కడం ద్వారా సేఫ్‌మోడ్ ఆప్షన్ చూడవచ్చు.

వైరస్ స్కాన్

మీ సిస్టమ్‌లో తప్పనిసరిగా అప్‌డేటెడ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉండాలి. దానితో కంప్యూటర్ మొత్తాన్ని ఓసారి స్కాన్ చేయండి. ఏమైనా వైరస్‌లు, మాల్‌వేర్లు ఉంటే వాటిని తొలగించండి.

విండోస్ రిపెయిర్

విండోస్ సాఫ్ట్‌వేర్ డిస్క్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్‌ని రిపెయిర్ చేయండి. దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు. మీ డేటా మొత్తం అలాగే ఉంటుంది.

రీస్టోర్

‘స్టార్ట్ మెనూ’లోని ‘సిస్టమ్ రీస్టోర్’ ఆప్షన్ ఉపయోగించండి. మీ కంప్యూటర్ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పని చేసిన ఓ తేదీని ఎంచుకుని 'రీస్టోర్' చేయండి.

విండోస్ రీఇన్‌స్టలేషన్

ఒకవేళ ఇవేమీ పనిచేయకపోతే... ఇక చివరి పరిష్కారం... విండోస్ రీఇన్‌స్టలేషన్. ఇలాంటి పరిస్థితే వస్తే, డిస్క్ మొత్తాన్ని ఫార్మాట్ చేయడం ఉత్తమం.

కానీ ముందుగా మీకు అవసరమైన డేటా మొత్తాన్ని బ్యాక్‌అప్ చేసుకోవడం మర్చిపోవద్దు.

సంబంధిత కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)