You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్: కాబూల్ పెళ్లి వేడుకలో మానవ బాంబు విధ్వంసం, 63 మంది మృతి
అఫ్గాన్ రాజధాని కాబుల్ నగరంలోని వెడ్డింగ్ హాలులో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 63 మంది మృతి చెందారు. 180 మందికి పైగా గాయపడ్డారు.
పెళ్ళి వేడుకలు జరుగుతుండగా హాలులోకి వచ్చిన మానవబాంబు తనను తాను పేల్చుకున్నాడని, ఘటనా స్థలంలో మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి చెప్పారు.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.40 గంటలకు ఈ పేలుడు సంభవించింది. షియా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కాబూల్ పశ్చిమ ప్రాంతంలో జరిగిన ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు.
తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్ వంటి సున్నీ ముస్లిం మిలిటెంట్ సంస్థలు అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాలలోని షియా హజారా మైనారిటీలపై వరసగా దాడులకు పాల్పడుతున్నాయి.
పది రోజుల కిందట కాబూల్‌లోని ఒక పోలీస్ స్టేషన్ వెలుపల భారీ బాంబు దాడి జరిగింది. ఆ ఘటనలో 14 మంది చనిపోయారు. దాదాపు 150 మంది గాయపడ్డారు.
ఆ దాడి తమ పనే అని తాలిబాన్ ప్రకటించుకుంది.
శుక్రవారం నాడు పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరానికి దగ్గర్లోని ఒక మసీదులో జరిగిన బాంబు పేలుడులో తాలిబన్ నాయకుడు హిబతుల్లా అఖుండ్‌జాదా సోదరుడు ఒకరు చనిపోయాడు.
ఇంతవరకూ ఏ సంస్థ కూడా ఆ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.
ఆరోజు హిబతుల్లా అఖుండ్‌జాదా మసీదుకు వస్తారని భావించి, అతడినే లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి జరిగి ఉండవచ్చని అఫ్గాన్ ఇంటలిజెన్స్ వర్గాలు బీబీసీకి తెలిపాయి.
తాలిబాన్లు, అఫ్గానిస్తాన్‌లో వేలాది సైనికులను మోహరించిన అమెరికా త్వరలో శాంతి ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో దేశంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.
మనకు ఏం తెలుస్తోంది?
హోం శాఖ ప్రతినిధి నస్రత్ రహిమికి శనివారం జరిగిన బాంబు పేలుడులో ప్రాణనష్టం జరిగిందని ధ్రువీకరించారు. కానీ ఇంకా ఘటన గురించి పూర్తి వివరాలు రాలేదన్నారు.
అఫ్గాన్ వివాహవేడుకలకు తరచూ వందలాది అతిథులు హాజరవుతారు. పురుషులు తరచూ మహిళలు, పిల్లలకు వేరుగా భారీ ఫంక్షన్ హాళ్లలో ఉండే ఉంటారు.
ఈ వివాహానికి వచ్చిన మహమ్మద్ ఫర్హాగ్ అనే అతిథి మహిళలు విభాగంలో ఉన్నప్పుడు "పురుషులు ఉన్న హాల్లో భారీ పేలుడు శబ్దం విన్నానని, బయట అందరూ అరవడం, ఏడవడం వినిపించిందని" చెప్పారు.
"దాదాపు 20 నిమిషాలు ఆ హాల్లో పొగ నిండిపోయింది. అక్కడ ఉన్న మగవాళ్లందరూ గాయపడ్డారు. వారిలో కొంతమంది చనిపోయారు. పేలుడు జరిగి రెండు గంటలవుతున్నా..హాల్ నుంచి మృతదేహాలను తరలిస్తూనే ఉన్నారు" అని చెప్పారు.
శాంతి చర్చల పురోగతి ఎలా ఉంది?
తాలిబన్లు, అమెరికా ప్రతినిధుల మధ్య కతార్ రాజధాని దోహాలో శాంతి చర్చలు నడుస్తున్నాయి. రెండు పక్షాలవారూ చర్చల్లో పురోగతి వచ్చిందని చెబుతున్నారు.
శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా "వీలైతే రెండు పక్షాలూ ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నట్లు" ట్వీట్ చేశారు.
ఈ ఒప్పందంలో భాగంగా మిలిటెంటు దళాలు అమెరికాపై దాడులు చేసేందుకు ఆఫ్గానిస్తాన్‌ను ఉపయోగించవని తాలిబన్లు గ్యారంటీ ఇస్తే, దానికి బదులు అమెరికా తమ దళాలను అక్కడి నుంచి ఉపసంహరిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- 'ఫుడ్ అనేది ఒక పోర్న్ అయితే... నేను పోర్న్ స్టార్‌ని'
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)