పాకిస్తాన్‌లో ‘అఖండ భారత్’ బ్యానర్లు.. ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు?

    • రచయిత, షాహ‌్‌జాద్ మాలిక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్ నుంచి

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌ నగరంలో పలుచోట్ల శివసేన సందేశాలతో కూడిన బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ల మీద శివసేన ఎంపీ ఇచ్చిన సందేశాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా ఇస్లామాబాద్‌లోని రెడ్‌జోన్ ప్రాంతంలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత రహదారి మధ్యలో స్తంభాలకు ఈ బ్యానర్లు దర్శనమిచ్చాయి.

ఈ విషయాన్ని ఇస్లామాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ సీరియస్‌గా తీసుకున్నారు. బ్యానర్లను తొలగించడం ఎందుకు ఆలస్యమయ్యిందో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మున్సిపల్ డైరెక్టర్‌‌కు నోటీసులు జారీ చేశారు.

"నేడు జమ్మూకశ్మీర్‌ను తీసుకున్నాం, రేపు బలూచిస్తాన్‌ను, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తీసుకుంటాం. అఖండ హిందుస్థాన్ కలను ప్రధానమంత్రి సాకారం చేస్తారని నాకు విశ్వాసం ఉంది" అంటూ శివసేన ఎంపీ చేసిన ప్రకటన ఆ బ్యానర్ల మీద రాసి ఉంది.

మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్యానర్లు ఏర్పాటు చేశారని రెడ్‌జోన్ ఇన్‌స్పెక్టర్ అస్జాద్ మొహమ్మద్ చెప్పారు. తమకు సమాచారం అందిన వెంటనే ఆ పోస్టర్లను తొలగించామని ఆయన తెలిపారు.

బ్యానర్లను పోలీసులు తొలగిస్తుండగా స్థానిక పాత్రికేయులు పోటోలు తీశారు. అయితే, ఫొటోలు తీయొద్దంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.

సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్‌ ఎస్‌హెచ్ఓ వివరాల ప్రకారం, ఆ బ్యాన‌ర్లను ఏర్పాటు చేసిన వారిని అరెస్టు చేసేందుకు రెడ్ జోన్‌లో ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సేకరించారు.

ఈ బ్యానర్లు కనిపించిన ఈ ప్రాంతం ఐబీ సివిలియన్ ఇంటెలిజెన్స్( ఇంటెలిజెన్స్ బ్యూరో), ఐఎస్ఐ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఉంది.

బ్యానర్లు కనిపించిన రెడ్ జోన్ దగ్గర వివిధ దేశాల ఏంబసీలతోపాటు విదేశాంగ కార్యాలయం, ఇతర భవనాలు ఉన్నాయని మాజీ పోలీసు అధికారి అక్బర్ హయాత్ చెప్పారు. దాంతో ఆ ప్రాంతంలోని పోలీసులు, ఇతర సంస్థల పనితీరుపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఇస్లామాబాద్‌లో ఏవైనా బ్యానర్లు ఏర్పాటు చేయాలంటే, క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇస్లామాబాద్‌(సీడీఏ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ, ఈ బ్యానర్లకు తాము అనుమతి ఇవ్వలేదని, అనుమతి కోసం తమ దగ్గరకు ఎవరూ రాలేదని సీడీఏ అధికారులు చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేకతను లేదా మతవిద్వేషాలను రెచ్చగొట్టే బ్యానర్లు ఏర్పాటు చేయడంపై నిషేధం ఉండడంతో ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు.

బూమరాంగ్ అయిన బ్యానర్ వివాదం

వాస్తవానికి ‘అఖండ భారత్ రియల్ టెర్రర్’ అన్న నినాదం, ఖాకీ నిక్కరు, తెల్ల చొక్కా వేసుకున్న సంఘ్ సేవక్‌ను పోలిన వ్యక్తి కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమచేతిలో కాషాయ జండాను పట్టుకుని నిలబడ్డ ఫొటోను ఈ బ్యానర్‌మీద ముద్రించారు. దానికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యనతో కూడిన ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్‌ను జతచేశారు. దీనికి మహా భారత్.. ఎ స్టెప్ ఫార్వర్డ్ (మహా భారత్.. ఒక అడుగు ముందుకు) అని క్యాప్షన్ జత చేశారు.

దీన్ని బట్టి అఖండ భారత్ అనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆలోచనపై వ్యంగ్యంగా ఈ బ్యానర్ తయారు చేసినట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)