ఉత్తర కొరియా: ఆకలితో అలమటిస్తున్న ఈ దేశాన్ని ఆదుకుంటున్నది ఎవరు?

    • రచయిత, రియాలిటీ చెక్ బృందం
    • హోదా, బీబీసీ న్యూస్

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారి ఈ వారం ఉత్తర కొరియా పర్యటనకు వెళ్తున్నారు. కొరియో ద్వీపకల్పంలో నెలకొన్న రాజకీయ పరమైన ఉద్రిక్తలపై ఇరు దేశాల అధినేతలు చర్చిస్తారని చైనా అధికారిక మీడియా తెలిపింది.

ఉత్తర కొరియాతో బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్న దేశాల్లో అత్యంత కీలకమైనది చైనా.

ప్రస్తుతం ఎన్నడూ లేనంత స్థాయిలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటోంది ఉత్తర కొరియా. పంటలు పండక తీవ్రమైన ఆహార కొరతతో ఇక్కడి ప్రజలు అలమటిస్తున్నారని ఇటీవలే ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

మరి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఉత్తర కొరియాకు ఎవరు సాయం అందిస్తున్నారు? ఆ సాయం మీద ఆంక్షల ప్రభావం ఎలా ఉంది?

గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరవు ఉత్తర కొరియోలో ఉందని ఆ దే అధికారిక మీడియా తెలిపింది. కరవు కారణంగా దేశంలోని కోటి మంది (దేశ జనాభాలో 40 శాతం మంది)కి పైగా ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

ఒక్కో వ్యక్తి రోజుకు కేవలం 300 గ్రాముల ఆహారంతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఐరాస అంచనా వేసింది.

1990లలోనూ ఉత్తర కొరియాలో తీవ్రమైన కరవుతో కొన్ని వేల మంది మరణించారని చెబుతారు.

సాయం ఎవరు చేస్తున్నారు?

ఉత్తర కొరియాకు ఆపన్న హస్తం అందిస్తున్న దేశాల్లో చైనా ముందుంది. అయితే, ఆ సాయం ఎంత భారీగా ఉందన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే, చైనా ఉత్తర కొరియాకు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి.

ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం, 2012లో 2,40,074 టన్నుల ఆహార పదార్థాలను చైనా పంపించింది. అది ఆ ఏడాది యూరోపియన్ కమిషన్ ఉత్తర కొరియాకు పంపిన సాయం కంటే 80 రెట్లు అధికం.

2016లో ఉత్తర కొరియాలో వరదలు ముంచెత్తినప్పుడు మానవతా సాయంగా చైనా మూడ మిలియన్ డాలర్ల (రూ. 20,83,72,500) విరాళంగా ఇచ్చింది.

2014లో విడుదలైన అమెరికా కాంగ్రెస్‌‌ నివేదిక ప్రకారం, ఉత్తర కొరియాకు అత్యధికంగా ఆహార పదార్థాలను సాయంగా పంపుతున్న దేశం చైనా. అయితే, ఆ సాయం ఎంత అన్నది బయటకు తెలిపే వ్యవస్థ లేదు.

మిగతా దేశాలు మానవతా సాయాన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా, రెడ్‌ క్రాస్ సంస్థ ద్వారా ఉత్తర కొరియాకు పంపుతాయి.

ప్రస్తుత కరవు నేపథ్యంలో ఆ దేశానికి 120 మిలియన్ డాలర్లు (సుమారు రూ.834 కోట్లు) సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఐక్యరాజ్య సమితి కోరింది.

వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా 50,000 టన్నుల బియ్యం పంపుతున్నట్లు తాజాగా దక్షిణ కొరియా ప్రకటించింది. దానికి అదనంగా 8 మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్లు కూడా తెలిపింది.

నాలుగు మిలియన్ డాలర్ల నిధులతో పాటు, 4,000 టన్నుల గోధుమలు పంపినట్లు రష్యా తెలిపింది.

ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తికి స్విట్జర్లాండ్, స్వీడన్, కెనడా, నార్వే, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐర్లాండ్ దేశాలు కూడా స్పందించాయి.

ఆంక్షల ప్రభావం

ఉత్తర కొరియా మీద ఉన్న అంతర్జాతీయ ఆంక్షల ప్రభావం మానవతా సాయం మీద ఉండదు.

కానీ, "2016 నుంచి చమురు, సహజవాయువు ఉత్పత్తులపై ఆంక్షలు విధించడం కారణంగా వ్యవసాయం మీద తీవ్ర ప్రభావం పడింది. ఎరువులు, పురుగుల మందుల్లో చమురు ఆధారిత ముడిపదార్థాలను వినియోగిస్తారు. ఆ ముడి పదార్థాలు లేని ఎరువులను వాడితే దిగుబడులు పెద్దగా రావు" అని లండన్‌‌లోని స్కూల్ ఆఫ్ ఒరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ హాజెల్ స్మిత్ అంటున్నారు.

ఉత్తర కొరియా దౌత్యపరమైన సంబంధాలు క్షీణించడంతో గడచిన దశాబ్ద కాలంలో ఆ దేశానికి అందే సాయంపై ప్రభావం పడింది.

2012 తర్వాత ఆ దేశానికి అందుతున్న సాయం భారీగా తగ్గుతూ వస్తోందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

ఆ ప్రభావం 2015 తర్వాత ఉత్తర కొరియాకు విదేశాల నుంచి వెళ్లే ఆహార పదార్థాలపై కూడా పడింది.

దక్షిణ కొరియా నుంచి గత దశాబ్ద కాలంగా సాయం భారీగా తగ్గిపోయింది.

ఆరేళ్ల తర్వాత 2017లో ఉత్తర కొరియా తీవ్రమైన వరదలతో సతమతమైనప్పుడు అమెరికా మిలియన్ డాలర్ల సాయం అందించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)