You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎన్నికల ఫలితాలపై ఘర్షణల్లో ఆరుగురి మృతి, 200మందికి గాయాలు
ఇండోనేసియా అధ్యక్షుడిగా జోకో విడోడో తిరిగి ఎన్నిక కావడంపై ఆ దేశవ్యాప్తంగా తలెత్తిన ఆందోళనలు, ఘర్షణల్లో ఆరుగురు మృతిచెందారు, 200 మంది గాయపడ్డారు. ఆస్పత్రుల నుంచి వస్తున్న నివేదికల ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వీరి మరణాలకు కారణాలేంటనే దానిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
దీనికి పోలీసులే బాధ్యులని ప్రజలు భావించవద్దని నేషనల్ పోలీస్ చీఫ్ టిటో కర్నావియన్ కోరారు. వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని ప్రాంతాల్లో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. పోలీసులు ఆయుధాలను ఉపయోగిస్తూ, ప్రజలను సంయమనంతో ఉండమని కోరుతున్నారనే ఆరోపణలను టిటో ఖండించారు.
"కొందరికి బుల్లెట్ గాయాలున్నాయి, కొందరికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి, కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది" అని మంగళవారం రాత్రి ఆరుగురు మరణించారనే సమాచారంపై వ్యాఖ్యానిస్తూ టిటో అన్నారు.
ఆందోళనలన్నీ ఓ ప్రణాళిక ప్రకారం జరిగినవేనని, అప్పటికప్పుడు చెలరేగినవి కాదని అధికారులు అంటున్నారు. కొందరి రెచ్చగొట్టే చర్యలే ఈ ఆందోళనల్లో చెలరేగిన హింసకు కారణమని వారు భావిస్తున్నారు.
నిరసనకారుల్లో చాలామంది జకార్తా బయట నుంచి వచ్చినవారే అని పోలీస్ అధికారి ముహమ్మద్ ఇక్బాల్ తెలిపారు.
ఘర్షణలు ఎలా మొదలయ్యాయి?
మంగళవారం శాంతియుతంగా ప్రారంభమైన నిరసన ప్రదర్శనలో పోలీసులపై మందుగుండు సామగ్రిని విసరడం, కార్లను తగలబెట్టడంతో ఉన్నట్లుండి హింసాత్మకంగా మారాయి.
అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో చిరకాల ప్రత్యర్థి ప్రబోవో సుబియాంటోపై విడోడో విజయం సాధించారనే సంకేతాలు రాగానే నిరసనలు ప్రారంభమయ్యాయి.
అధ్యక్ష ఎన్నికల్లో 55.5శాతం ఓట్లతో విడోడో విజయం సాధించారని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఇదంతా మోసమని ప్రత్యర్థి ప్రబోవో చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది.
2014 ఎన్నికల్లో కూడా విడోడో చేతిలో ప్రబోవో ఓటమిని ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 17న జరిగిన అధ్యక్ష ఎన్నికల కోసం 19 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును కలిగిఉన్నారు.
మంగళవారం నాడు అధికారిక ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రబోవోకు మద్దతుగా ఎన్నికల పర్యవేక్షణ భవనం ముందు వేలాదిమంది గుమిగూడారు. వారంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరడంతో వారంతా జకార్తాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారని 'బీబీసీ ఇండోనేసియా' తెలిపింది.
నగరంలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలను స్థానిక టీవీ చానల్లు ప్రసారం చేశాయి. హింసకు దారితీసే పరిస్థితులుండటంతో 30 వేలకు పైగా బలగాలను ముందుజాగ్రత్తగా జకార్తాలో మోహరించారు.
సోషల్ మీడియాపై కొన్ని ప్రాంతాల్లో నిషేధం విధిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి విరాంటో బుధవారం నాడు ప్రకటించారు. వదంతులు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిషేధమని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి.
- ఓట్లు లెక్కిస్తూ 272 మంది ఎన్నికల సిబ్బంది మృతి
- ఇండోనేసియా ఎలక్షన్స్: అధ్యక్ష ఎన్నికల నుంచి... స్థానిక సంస్థల వరకు.. అంతా ఆరు గంటల్లోనే
- యానాంలో ఫ్రాన్స్ ఎన్నికల సందడి... ఓటు వేసేందుకు సిద్ధమవుతున్న ఫ్రెంచి పౌరులు
- చంద్రబాబు నాయుడు మరో హరికిషన్ సింగ్ సూర్జిత్ అవుతారా?
- ఎన్నికలు 2019: VVPAT వల్ల ఈసారి ఆలస్యం కానున్న ఎన్నికల ఫలితాలు
- రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే అంతిమ పోరాటమా...
- స్ట్రాంగ్ రూముల్లో ఉండాల్సిన ఈవీఎంలు రోడ్లపై ఎలా దొరుకుతున్నాయి?
- ‘యుద్ధం వస్తే ఇక మీ దేశం అంతమైనట్లే.. ఇంకెప్పుడూ అమెరికాను బెదిరించొద్దు’ : డోనల్డ్ ట్రంప్
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- స్కూలు నుంచి ఇంటికెళ్లాలంటే.. రెండు విమానాలు మారాలి, 5 రోజులు కొండలు ఎక్కాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)