ఎల్‌టీటీఈ ప్రభాకరన్: హీరోనా... విలనా?

తమిళ్ టైగర్స్ నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించి నేటికి సరిగ్గా పదేళ్లు. అనుచరుల దృష్టిలో ఆయన తమిళుల దాస్యపు సంకెళ్లను తెంచేందుకు పోరాడిన స్వాతంత్ర్య ఉద్యమకారుడైతే, ప్రత్యర్థుల కోణంలో మాత్రం మనుషుల ప్రాణాలంటే లెక్కలేని ఓ ఉన్మాద నాయకుడు.

ప్రభాకరన్ నాయకత్వంలో తమిళ్ టైగర్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రేరేపితమైన, క్రమశిక్షణ కలిగిన గెరిల్లా దళాల్లో ఒకటిగా అవతరించింది.

కానీ, 2009లో ఆ సంస్థ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. శ్రీలంక సైన్యం చేతుల్లో వరుస పరాజయాలు చవిచూసింది. నాయకుడు ప్రభాకరన్‌ను కోల్పోయింది. శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో తమిళుల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేయాలన్న కల నెరవేరకుండానే తమ ప్రస్థానాన్ని ముగించింది.

శ్రీలంక ఉత్తర తీర పట్టణం వెలెవట్టితురైలో 1957 నవంబర్ 26న ప్రభాకరన్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులకు మొత్తం నలుగురు సంతానం. ప్రభాకరన్ అందరి కన్నా చిన్నవారు.

ప్రభాకరన్ విద్యార్థిగా ఉన్నప్పుడు బాగా బిడియస్తుడని, పుస్తకాల పురుగని ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. శ్రీలంకలో మెజార్టీ వర్గమైన సింహళీయులు తమిళులపై చూపుతున్న వివక్షపై ఆగ్రహంతో ఆయన ఉద్యమాల్లో భాగమయ్యారని వివరిస్తుంటారు.

భారత స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్‌ల నుంచి తాను స్ఫూర్తి పొందానని ప్రభాకరన్ చెప్పేవారు.

అలెగ్జాండర్ ద గ్రేట్, నెపోలియన్ జీవితాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని, వారి జీవితాలపై ఎన్నో పుస్తకాలు చదివానని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

1973 లేదా 1974లో తమిళ్ న్యూ టైగర్స్‌ను ప్రభాకరన్ స్థాపించారని చెబుతారు. తేదీ గురించి స్పష్టత లేదు.

వలస పాలన ముగిసిన తర్వాత శ్రీలంకలో తమిళ ప్రజలపై సాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తిన సంఘాలు, సంస్థల్లో అది కూడా ఒకటి.

1975లో జాఫ్నా నగర మేయర్ హత్యకు గురయ్యారు. గుడికి వెళ్తున్న సమయంలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆయనకు తూటా తగిలింది. ఈ హత్య కేసులో ప్రభాకరన్‌ నిందితుడిగా ఉన్నారు. అంతకుముందు ఏడాది జాఫ్నాలో పోలీసులు జనాల గుంపుపై జరిపిన ఓ దాడిలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగానే జాఫ్నా మేయర్ హత్య జరిగిందని చెబుతారు.

మరో సంవత్సరం గడిచాక ప్రభాకరన్ బృందం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)గా పేరు మార్చుకుంది. ఈ సంస్థే తమిళ్ టైగర్స్‌గా ప్రాచుర్యం పొందింది.

దాదాపు పది వేల మంది సైన్యంతో బలీయమైన శక్తిగా తమిళ్ టైగర్స్ అవతరించింది. మహిళలు, చిన్నారులు కూడా ఈ దళంలో సభ్యులుగా ఉండేవారు.

ప్రవాస తమిళుల నుంచి వచ్చే నిధులతో ఎల్‌టీటీఈ ఆయుధ సంపత్తి సమృద్ధిగా ఉండేది. భారత్‌లో ఉన్న సానుభూతిపరుల నుంచి కూడా ఆ సంస్థకు నిధులు అందేవని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

సంఖ్యాబలంలో శ్రీలంక సైన్యం కన్నా ఎల్‌టీటీఈ ఎప్పుడూ వెనుకే ఉండేది. అందుకే, ప్రభాకరన్ గెరిల్లా పోరాట శైలిని అనుసరించారు.

చావుకు వెనుకాడని సైన్యం

చావుకు వెనుకాడని సైన్యాన్ని ప్రభాకరన్ తయారుచేసుకున్నారు.

ఆత్మాహుతి బాంబు పేలుళ్ల ద్వారా దాడులకు పాల్పడటాన్ని ఎల్‌టీటీఈనే మొదలుపెట్టింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని కూడా ఈ దాడులు జరిగేవి.

ప్రత్యర్థులకు దొరికినప్పుడు వెంటనే ప్రాణాలు తీసుకునేందుకు ప్రభాకరన్ మెడలో ఓ సైనేడ్ క్యాప్సుల్‌ను ధరించేవారు. ప్రభాకరన్ అనుచరులు చాలా మంది ఈ పద్ధతిని పాటించారు.

1991లో మద్రాస్ (చెన్నై)కి సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలో ప్రభాకరన్ పాత్ర ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి. 1980ల్లో భారత పీస్ కీపింగ్ దళాలను శ్రీలంకకు పంపించినందుకు రాజీవ్ గాంధీపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభాకరన్ వ్యక్తిగతంగా ఈ దాడికి ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

భారత్‌లోని ఓ కోర్టు ప్రభాకరన్‌పై డెత్ వారెంటు కూడా జారీ చేసింది. 'టెర్రరిజం, హత్య, వ్యవస్థీకృత నేరాల' కింద ఆయనపై ఇంటర్‌పోల్ కూడా 'వాంటెడ్' నోటీసులు ఇచ్చింది. చాలా దేశాలు ఎల్‌టీటీఈని 'ఉగ్రవాద' సంస్థగా గుర్తించాయి.

ప్రభాకరన్ జీవితాంతం రహస్యంగానే గడిపారు. తనను అరెస్టు లేదా అంతం చేసే అవకాశాలు ఉండటంతో అడవుల్లో దాక్కొని ఎవరికీ చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా కదలికలు సాగించేవారు.

2002లో ప్రభాకరన్ ఓ అరుదైన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు రాజీవ్ గాంధీ హత్య గురించి ఎదురైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అయితే దాన్నొక 'విషాధ ఘటన'గా వర్ణించారు.

తమిళుల స్వీయ నిర్ణయాధికార డిమాండ్‌ గురించి పదేపదే ప్రస్తావించారు. దాన్ని సాధించే పోరాటంలో ప్రాణాలు వదిలేందుకు కూడా తాను సిద్ధపడి ఉన్నానని ప్రకటించారు.

1996లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కొలంబోపై ఎల్‌టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడింది. విధ్వంసక పదార్థాలను నింపిన లారీ బ్యాంకు గేట్లను బద్దలుకొట్టుకొంటూ లోపలికి వచ్చి పేలిపోయింది. ఈ ఘటనలో 90 మందికి పైగా చనిపోయారు. 1,400 మంది దాకా గాయపడ్డారు.

ఎల్‌టీటీఈ చరిత్రలోనే అత్యధిక మందిని బలితీసుకున్న దాడి ఇదే. మృతుల్లో చాలా మంది సాధారణ పౌరులే. కొందరు విదేశీయులు కూడా బాధితుల్లో ఉన్నారు.

ఈ దాడికి సంబంధించి ప్రభాకరన్‌ను అరెస్టు చేయాలని 2002లో శ్రీలంకలోని ఓ కోర్టు ఆదేశించింది. ఆయనకు 200 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

2006లో ఎల్‌టీటీఈతో చివరగా శ్రీలంక శాంతి చర్చలు జరిపింది. అవి విఫలమవడంతో శ్రీలంక సైన్యం టైగర్స్‌కు పట్టున్న ప్రాంతాలపై పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.

టైగర్స్ పాలనాపరమైన రాజధాని కిల్లినోచ్చిని 2009 ఆరంభంలో శ్రీలంక ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రభాకరన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దేశం విడిచి పారిపోయినట్లు వదంతులు కూడా వచ్చాయి.

90వ దశకం చివర్లో, 2000 సంవత్సరం ఆరంభంలో ఎల్‌టీటీఈ ప్రాబల్యం అత్యధికంగా ఉండేది. ఆ దశలో దాదాపు శ్రీలంకలో మూడో వంతు భూభాగం ఆ సంస్థ నియంత్రణలోనే ఉండేది.

అయితే, తనకు దక్కిన ఈ అధికారంతో తమిళుల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేయాలన్న కలను సాకారం చేయడంలో ప్రభాకరన్ విఫలమయ్యారు.

లక్ష్య సాధన కోసం చివరి వరకూ ప్రభాకర్ పట్టుదలతోనే ఉన్నారు. ప్రత్యేక రాజ్యం డిమాండ్‌ను తాను గనక పక్కనపెడితే తనను కాల్చివేయాలని సొంత మనుషులనే ఆదేశించానని ఆయన ఓ సారి చెప్పారు.

ప్రభాకరన్‌ చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఆయన కుమారుడు చార్లెస్‌ కాల్పుల్లో చనిపోయినట్లు శ్రీలంక సైన్యం పేర్కొంది.

ప్రభాకరన్ భార్య మతివతని ఎరంబు, కుమార్తె దువరాగా, మరో కుమారుడు బాలచంద్రన్ కూడా చనిపోయారని వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)