You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంక: మహిళల శరీరాకృతిపై 'అభ్యంతరకర హోర్డింగ్’.. నిరసనలతో దిగివచ్చిన జిమ్
- రచయిత, ఆయేషా పెరేరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మహిళ శరీరాకృతి ఉండాల్సిన తీరు ఇది కాదు'' అంటూ డ్రమ్ము బొమ్మను చూపుతూ శ్రీలంక రాజధాని కొలంబోలో ఒక జిమ్ హోర్డింగ్ ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
కొలంబో శివారులో 'ఓస్మో' జిమ్ గత వారం ఈ వ్యాపార ప్రకటన ఏర్పాటు చేయగా, వెంటనే నిరసనలు వ్యక్తమయ్యాయి. వ్యక్తుల శరీరాకృతిని బట్టి వారిపై వ్యాఖ్యలు చేయడం, ఎగతాళి చేయడం తగదని, ఈ ప్రకటన మహిళల పట్ల వివక్ష చూపిస్తోందని, ఇది అభ్యంతకరమంటూ సోషల్ మీడియాలో ఎంతో మంది ఖండించారు. ప్రకటన ఫొటోలను పోస్ట్ చేస్తూ, విమర్శలు చేశారు.
#BoycottOsmo హ్యాష్‌ట్యాగ్‌తో కొంత మంది ఓస్మో వ్యాయామశాలకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ప్రచారోద్యమం మొదలుపెట్టారు. ఈ ప్రకటనను తొలగించాలని, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఫేస్‌బుక్‌లో కొందరు ఓస్మోను ట్యాగ్ చేశారు.
ఈ డిమాండ్లపై ఓస్మో వ్యాయామశాల మొదట్లో స్పందించలేదు. ఈ ప్రకటన చిత్రాలతో కూడిన పోస్టును తన ఫేస్‌బుక్ పేజీలో ప్రముఖంగా కనిపించేలా పిన్ చేసి పెట్టింది. నిరసనలు తీవ్రం కావడంతో చివరకు దిగి వచ్చింది.
మహిళల పట్ల లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడే మరీసా డి సిల్వా ఈ ప్రకటనపై స్పందిస్తూ- వ్యాపార ప్రకటనల పరిశ్రమ మహిళలను ఎప్పుడూ వస్తువులుగానే పరిగణిస్తోందని, లైంగిక కోణంలోనే చూస్తోందని విమర్శించారు.
మహిళలను, వారి శరీరాలను ఈ పరిశ్రమ ఇలాంటి దృక్పథంతో చూస్తూనే కార్లు మొదలుకొని సుగంధ పరిమళాల వరకు అన్నింటి విక్రయాలను పెంచుతోందని ఆమె బీబీసీతో వ్యాఖ్యానించారు. ఓస్మో జిమ్ ప్రకటన మహిళలకు ఫలానా ఆకృతే సరైనదేనని శాసిస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు.
జిమ్ చర్యను సోషల్ మీడియాలో విమర్శిస్తున్న మరికొందరు మహిళలతో కలిసి ఈ ప్రకటనను ఉపసంహరించుకొనేలా పోరాడాలని మరీసా డి సిల్వా నిర్ణయించారు. వీరిలో ఒక మహిళ, ఓస్మో మార్కెటింగ్ మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ఈ ప్రకటనను తొలగించడానికి నిరాకరించారు. కంపెనీ 'ఆమోదం' తెలిపాకే ఈ ప్రకటన వాడామని చెప్పారు.
మరికొందరు మహిళలు ఈ అంశంపై శ్రీలంక జాతీయ విధానాలు, ఆర్థిక వ్యవహారాలశాఖ ఉపమంత్రి డాక్టర్ హర్ష డిసిల్వాను సంప్రదించారు. ఈ హోర్డింగ్ పెట్టిన ప్రాంతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొట్టె పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉంది.
కొట్టె నియోజకవర్గంలో ఇలాంటి ప్రకటనలు, చర్యలను తాను సహించబోనని హర్ష 'ట్విటర్'లో చెప్పారు. ఈ అంశంపై కొలంబో మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్‌తో మాట్లాడానని, అనుమతి లేకుండా పెట్టిన ఈ అగౌరవకర హోర్డింగ్ తొలగించాలని కమిషనర్‌కు చెప్పానని ఆయన తెలిపారు.
అనుమతి లేకుండా ఈ హోర్డింగ్ పెట్టారంటూ, కొలంబో మున్సిపల్ కౌన్సిల్ ఈ ప్రకటనను కనిపించకుండా చేసింది. ఈ ప్రకటన స్థానంలో, లింగవివక్షకు వ్యతిరేకంగా సందేశాన్ని పెట్టుకోవాలని, ఈ సందేశాన్ని రెండు రోజులపాటు ఉంచేందుకు అనుమతిస్తామని మహిళలకు మున్సిపల్ కౌన్సిల్ సూచించింది.
మరీసా డి సిల్వా సోషల్ మీడియాలో ఇతర ఉద్యమకారుల అభిప్రాయాలను సేకరించి, "లింగవివక్షకు తావు లేదు'' అనే సందేశంతో కూడిన మరో బ్యానర్‌ను ఆ ప్రకటన స్థానంలో ఏర్పాటు చేయించారు. శ్రీలంకలోని మూడు ప్రధాన భాషలైన సింహళం, తమిళం, ఇంగ్లిష్‌లలో ఈ సందేశాన్ని రాయించారు.
జిమ్ ప్రకటనను తొలగించడంపై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం విమర్శలు చేశారు. ఈ చర్య భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.
లింగ వివక్షకు వ్యతిరేకంగా పెట్టిన బ్యానర్ కూడా ఎక్కువ రోజులు లేదు. పెట్టిన మరుసటి రోజే ఎవరో తొలగించారు.
సోషల్ మీడియాలో నిరసనలు, శ్రీలంక మంత్రి వ్యాఖ్యలు తదితర పరిణామాల నేపథ్యంలో ఓస్మో వెనక్కు తగ్గింది. మహిళలు ఆ మాటకొస్తే ఏ వ్యక్తినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, తమ అడ్వర్టైజ్‌మెంట్‌ను ఉపసంహరించుకొంటున్నామని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.
''శ్రీలంకలో పురుషులతో పోలిస్తే మహిళల్లో మధుమేహం, అధిక బరువు, ఊబకాయం సమస్యలు ఎక్కువని, శారీరక శ్రమ తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక ప్రాతిపదికగానే మేం ఈ ప్రకటన రూపొందించాం'' అని ఓస్మో వివరణ ఇచ్చింది.
ఓస్మో ప్రకటన ఉదంతంపై మరీసా డి సిల్వా స్పందిస్తూ- భవిష్యత్తులోనైనా వ్యాపార ప్రకటనల పరిశ్రమ మహిళలను వస్తువులుగా చూపించే ప్రకటనలు రూపొందించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- రిపబ్లిక్ డే పరేడ్: ఆసియాన్ ఎందుకంత ప్రత్యేకం?
- క్యాన్సర్‌ను పసిగట్టే రక్తపరీక్ష!!
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- ఉత్తర కొరియాతో ఇప్పటికీ మాట్లాడే దేశాలు ఎన్ని?
- అమెరికా న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)