‘రాజీవ్ గాంధీ హత్య ఒక క్షమించరాని తప్పిదం’

    • రచయిత, ఎన్.రామ్, చైర్మన్, ది హిందూ గ్రూప్
    • హోదా, బీబీసీ కోసం

సామాజిక న్యాయం కరుణానిధి ఆత్మ. సుమారు 80 ఏళ్ల పాటు ఆయన సామాజిక న్యాయానికి మద్దతు పలికారు. సీఎన్ అన్నాదురై మరణానంతరం డీఎంకే అధినేతగా, మరణించేంత వరకు సుమారు 50 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు.

బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ఆయనకు పునాది అయినా, ఆయన వ్యక్తిగతంగా ఎన్నడూ బ్రాహ్మణులను వ్యతిరేకించలేదు. కేవలం వాళ్ల భావజాలాన్ని వ్యతిరేకించారు.

ఆయన నాస్తికుడు, హేతువాది. ఆయన ఎన్నడూ ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. అయితే ఆయన నిరంతరం మైనారిటీలకు మద్దతు ఇచ్చేవారు.

సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు దేశంలోని మొదటి రెండు స్థానాల్లో ఉండేది. దానికి కారణం కరుణానిధే. ఎంజీ రామచంద్రన్, జయలలితల ఆధ్వర్యంలోని ఏఐఏడీఎంకే కూడా ఆయన ఒరవడిని కొనసాగించింది. డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య అభిప్రాయభేదాలున్నా, సంక్షేమ పథకాల అమలులో మాత్రం రెండూ పోటీ పడేవి.

ఆయన వ్యక్తిగత జీవితంపై అనేక విమర్శలు ఎదురైనా, ప్రతిసారీ ఆయన రెట్టింపు శక్తితో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత అయినా ఓడిపోయారు కానీ కరుణానిధి తాను పోటీ చేసిన 13 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్నడూ ఓటమి ఎరుగరు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఆయన మాత్రం నిరంతరం సామాజిక న్యాయం వైపే ఉన్నారు.

పార్టీ, ప్రభుత్వాలలో పనితీరు

కరుణానిధిని ఎవరైనా కలవగలిగే అవకాశం ఉండేది. ఎంజీఆర్, జయలలితలతో పోలిస్తే ఈ విషయంలో ఆయన చాలా భిన్నం. నేటి రాజకీయ నాయకుల్లో కనిపించని పారదర్శకత ఆయన స్వభావంలో మనకు కనిపిస్తుంది.

పాలన విషయానికి వస్తే, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చాలా గట్టిగా ఉండేవారు. ఆయనతో కలిసి పని చేయడానికి ప్రభుత్వాధికారులు చాలా ఉత్సాహం చూపేవారు. ఏదైనా విషయంపై అవును, కాదు అని చెప్పడంలో ఆయన చాలా స్పష్టతతో ఉండేవారు.

కరుణానిధికి, జయలలితకు మధ్య వైరం ఉన్నా, కరుణానిధికి ఎంజీఆర్‌తో సమానమైన గౌరవం లభించేది. ఒకసారి ఎంజీఆర్ అనుచరుడొకరు కరుణానిధిని కలైంజర్ అనకుండా పేరు పెట్టి పిలవడంతో.. ఎంజీఆర్ అతణ్ని తన కారు నుంచి దింపేశారని చెబుతారు.

మీడియాతో జర్నలిస్టు కరుణానిధి సంబంధాలు

చివరి కొన్నేళ్లు తప్ప, ఆయన క్రమం తప్పకుండా మీడియాకు, సినిమాలకు, పత్రికలకు రాసేవారు. ఆయనలా రాసే సామర్థ్యం భారతదేశంలోని ఏ రాజకీయనాయకునికీ లేదు. పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేసిన ఆయనలాంటి వ్యక్తికి అంత అద్భుతంగా రాయగలిగే సామర్థ్యం ఉండడం ఆశ్చర్యకరం.

పార్టీ పత్రిక 'మురసోలి'కి ఆయన సంపాదకులు. తమిళ భాషపై ఆయనకు అంతులేని ప్రేమ ఉండేది. కేంద్రం రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని ఆయన వ్యతిరేకించారు. అయితే తమిళ భాషపై ఆయనకేమీ మూఢభక్తి లేదు.

జర్నలిస్టులతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. మేం ఎప్పుడైనా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తే, మా అభిప్రాయాలు తీసుకునేవారు.

ఆయన ప్రజాస్వామ్యాన్ని విశ్వసించారు. ఆయన అధికారంలో ఉన్నా మీరు ఆయనను విమర్శించవచ్చు. జయలలితలాగా ఆయన ఎన్నడూ మీడియాపై పరువునష్టం దావాలు వేయలేదు.

పార్టీ రాజకీయాలపై కరుణానిధి ప్రభావం

1969-71లో కాంగ్రెస్‌లో చీలిక వచ్చినపుడు, డీఎంకే మద్దతు ఇవ్వకపోతే ఇందిరా గాంధీ ప్రభుత్వం మనగలిగేది కాదు. ఆయన కూటమి కట్టారంటే జాతీయ రాజకీయాల్లో ఏవో చెప్పుకోదగిన పరిణామాలు సంభవించేవి.

దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు దానిని వ్యతిరేకించిన, అధికారంలో ఉన్న పార్టీ డీఎంకే ఒక్కటే. అధికారం కోసం ఆయన ఇందిరకు మద్దతు తెలిపి ఉండవచ్చు. కానీ ఆయన ప్రజాస్వామ్యాన్ని విశ్వసించి దాన్ని వ్యతిరేకించారు. ఆ సందర్భంగా అనేకమంది డీఎంకే నేతలు జైలు పాలయ్యారు. జైల్లో ఆయన కుమారుడు స్టాలిన్‌ను తీవ్రంగా కొట్టారు.

తల్చుకుంటే తర్వాత కాలంలో డీఎంకే.. ఎన్డీయేలో భాగస్వామి కాగలిగేది. కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉండాలనేదే ఆయన ఆలోచన.

ప్రస్తుతం కొంత మంది సినీనటులు రాజకీయాల్లోకి వస్తున్నా, తమిళనాడులో భవిష్యత్తులో కూడా ద్రవిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతుందని నేను భావిస్తున్నాను.

ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే డీఎంకే అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. జయలలిత మరణానంతరం ఏఐఏడీఎంకే బలహీనపడగా, డీఎంకే ఇప్పుడు సంస్థాగతంగా బలపడింది.

ఎల్‌టీటీఈ - కరుణానిధి

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) కరుణానిధి ప్రభుత్వానికన్నా ఎంజీఆర్ ప్రభుత్వం వైపే మొగ్గు చూపేది. అయితే తమిళ్ ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్ (టీఈఎల్‌ఓ) నేత సబారత్నం మరణానంతరం కరుణానిధికి ఎల్‌టీటీఈ అంటే గౌరవం పోయింది.

ఒకసారి నేను కరుణానిధితో మాట్లాడేప్పుడు, రాజీవ్ గాంధీ హత్య క్షమించరాని తప్పు అన్నారు. శ్రీలంక అంతర్యుద్ధం చివరి దశ సందర్భంగా కూడా కరుణ తాను చేయగలిగిందంతా చేశారు. అప్పుడు కూడా ఆయన ఎల్‌టీటీఈని సమర్థించలేదు.

ఒక ప్రత్యేక దేశంగా తమిళ్ ఈలంను సమర్థిస్తానని, అయితే తమిళుల రాజకీయ హక్కులు శ్రీలంక రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని అభిప్రాయపడ్డారు. అది జరగనప్పుడు మాత్రమే ఈలం ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలని భావించారు. ఇతరుల్లాగా ఆయన ఈలం విషయంలో మొండిగా లేరు. ఎల్‌టీటీఈ దురాగతాలను కూడా ఆయన సమర్థించలేదు.

సబారత్నం తన సోదరుడిలాంటి వాడని, అతణ్ని చంపేస్తారని సమాచారం అందినపుడు, ఆ పని చేయొద్దంటూ ప్రభాకరన్‌ను కోరానని కరుణ తెలిపారు.

కానీ సబారత్నాన్ని ఘోరంగా హింసించి చంపేశారని, ఆ విషయం తనకు చాలా బాధ కలిగించిందని కరుణానిధి అన్నారు.

కరుణానిధి ఎల్‌టీటీఈని గుడ్డిగా సమర్థించలేదు. ఈలం సమస్యను సమర్థించడం వేరే, ఎల్‌టీటీఈని సమర్థించడం వేరే అని ఆయనకు స్పష్టంగా తెలుసు.

ఈలం తమిళ ప్రజలకు ఎల్‌టీటీఈ ఏకైక ప్రతినిధి కాదని ఆయన విశ్వసించారు. అంతర్యుద్ధం చివరి దశలో ప్రభాకరన్‌ను ఎవరూ రక్షించలేకపోయారు. ఎందుకంటే పర్యవసానాల గురించి ప్రభాకరన్ ఎన్నడూ ఆలోచించలేదు.

ఈలం విషయంలో భారతదేశం జోక్యం చేసుకుంటుందని ప్రభాకరన్ చాలా నమ్మకంతో ఉండేవాడని నాకు ఎవరిద్వారానో తెలిసింది. అయితే దానికి సాక్ష్యాధారాలు లేవు. అందువల్ల శ్రీలంక తమిళులను, ఎల్‌టీటీఈని డీఎంకే రక్షించగలిగి ఉండేది అనడానికి సాక్ష్యం లేదు.

కరుణానిధి మృతితో తమిళనాడు రాజకీయాలలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఆయన గత ఒకటిన్నర ఏళ్లుగా మంచం మీదే ఉన్నారని అందరికీ తెలుసు. అయితే ఆయన రచనలు, అమలు చేసిన పథకాల ద్వారా ద్రవిడ భావజాల శక్తి ముందు తరాలకు అందుతూనే ఉంటుంది.

(బీబీసీ ప్రతినిధి వివేక్ ఆనంద్‌తో జరిపిన సంభాషణ ఆధారంగా)

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)