You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సంక్షోభంలో ప్రకృతి: 10 లక్షల జీవుల మనుగడను ప్రమాదంలోకి నెట్టిన మనిషి
మానవజాతి వల్ల భూమి, సముద్రాలు, ఆకాశం అంతటా ప్రకృతి విధ్వంసానికి గురవుతోందని ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక తెలిపింది.
ప్రకృతికి విరుద్ధంగా మనిషి చేస్తున్న అనేక రకాల పనుల కారణంగా 10 లక్షల రకాల జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రకృతి విధ్వంసానికి గురవుతోంది.
పంటల దిగుబడిలో కీలకపాత్ర పోషించే తేనెటీగల నుంచి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడే అడవుల వరకు మనిషి తన మనుగడకు తోడ్పడే సహజ వనరులను నాశనం చేసుకుంటూ పోతున్నాడు.
మూడేళ్లపాటు ప్రకృతికి సంబంధించిన దాదాపు 15,000 ఆధారాలను, పత్రాలను, పరిశీలనలను అధ్యయనం చేసి ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టం సర్వీసెస్ (ఐపీబీఈఎస్) 1,800 పేజీల ఈ నివేదికను రూపొందించింది.
మనిషి చర్యల వల్ల ఎప్పుడూ భూమి విధ్వంసానికి గురవుతూనే ఉంది. అయితే, గత 50 ఏళ్లలో ఆ గాయాల తీవ్రత మరింత పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది.
1970 నుంచి ఇప్పటివరకు ప్రపంచ జనాభా రెట్టింపయ్యింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాలుగింతలు పెరిగింది. అంతర్జాతీయ వాణిజ్యం 10 రెట్లకు పైగా పెరిగింది.
పెరుగుతున్న జనాభా ప్రభావం అడవులపైనే ఎక్కువగా పడుతోంది. కూడు, గూడు, కట్టుకునే బట్ట.. లాంటి అవసరాలు పెరిగిపోతున్నాయి. దాంతో పారిశ్రామికీకరణ, వ్యవసాయం, ప్రాజెక్టుల పేరుతో ఏటా కోట్లాది ఎకరాల అడవులను ధ్వంసం చేస్తున్నారు.
1980 నుంచి 2000 వరకు దాదాపు 25 కోట్ల ఎకరాల ఉష్ణ మండల అడవులు కనుమరుగయ్యాయి. మైదాన ప్రాంతాల్లో అడవుల నిర్మూలన మరింత ప్రమాదకర స్థాయిలో ఉంది.
నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. 1992 నుంచి ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల విస్తీర్ణం రెండింతలయ్యింది.
1980తో నుంచి ప్లాస్టిక్ కాలుష్యం పదింతలు పెరిగింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 300 నుంచి 400 మిలియన్ టన్నుల వ్యర్థాలు జల వనరుల్లో కలుస్తున్నాయి. దాంతో, భూమి నీరు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కలుషితమవుతోంది.
ఇలాంటి పరిణామాల కారణంగా భూసారం 23 శాతం తగ్గిపోయింది. సముద్రాల్లోనూ ప్రకృతి విధ్వంసం తీవ్రంగా జరుగుతోంది. అనేక రకాల జలచర జీవులు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి.
మనిషి ఆహారం కోసం ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నాడు. అది అనేక జీవజాతుల మనుగడకు ప్రమాదకరంగా మారుతోంది.
మరోవైపు, చీడపీడలు, కొత్తకొత్త వ్యాధులు విజృంభించడం వల్ల కూడా అనేక జీవులు ప్రమాదంలో పడుతున్నాయి.
'ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్' అనే అంతర్జాతీయ సంస్థ అంచనా ప్రకారం, ప్రపంచంలోని ప్రతి నాలుగు జీవజాతుల్లో ఒకటి అంతరించిపోయే దశలో ఉంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భావి తరాల కోసం ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం తక్షణమే ప్రపంచవ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- ఎటు నుంచి ఏ తూటా వచ్చి ప్రాణం తీస్తుందో.. ఏ బాంబు భస్మీపటలం చేస్తుందో
- 99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు
- నమ్మకాలు-నిజాలు: పీరియడ్స్ ఆపే మాత్రలు వేసుకోవడం మంచిదా, కాదా
- కిమ్-పుతిన్: తొలిసారిగా భేటీ కానున్న ఉత్తర కొరియా, రష్యా నాయకులు
- శ్రీలంక పేలుళ్లు న్యూజిలాండ్ మసీదుల్లో దాడులకు ప్రతీకారంగా జరిగినవా?
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)