You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
నీరవ్ మోదీని లండన్‌లో అరెస్ట్ చేశారు. భారత్ విజ్ఞప్తి మేరకు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు లండన్ పోలీసులు చెప్పారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన వేల కోట్ల రూపాయల కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు.
అతని అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఏం జరగబోతోంది? నీరవ్‌ని భారత్‌కు తీసుకురావడం సాధ్యమేనా? PNB కుంభకోణం అసలెలా జరిగింది?
నీరవ్ మోదీ ఎవరు?
నీరవ్ మోదీ ఒక వజ్రాల వ్యాపారి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి.
2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతను భారత్ నుంచి లండన్ వెళ్లారు.
నీరవ్ మోదీని తమకు అప్పగించాలని గతంలో భారత్ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది.
ఇటీవల ది టెలిగ్రాఫ్ పత్రిక జర్నలిస్టులు లండన్ వీధుల్లో నీరవ్ మోదీని ఇంటర్వ్యూ చేశారు.
లండన్‌లో సుమారు 73కోట్ల ఖరీదైన త్రీ బెడ్‌రూం అపార్టుమెంట్‌లో ఉంటున్నారని, మళ్లీ కొత్తగా వజ్రాల వ్యాపారం చేస్తున్నారని ది టెలిగ్రాఫ్ కథనం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో నీరవ్ మోదీని రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆయన్ను త్వరలోనే బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేస్తారని ఈడీ సమాచారం ఇచ్చినట్టు పీటీఐ సహా ప్రముఖ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆ తరువాత పరిణామాల్లో భాగంగా బుధవారం ఆయన్ను అరెస్టు చేసినట్టు బ్రిటన్ పోలీసులు వెల్లడించారు. అనంతరం నీరవ్ మోదీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైంది.
ఈనెల 29 వరకు పోలీసు కస్టడీకి తరలించారు.
భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ
నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలంటే చాలా ప్రక్రియ ఉంటుంది.
అరెస్ట్ చేసిన నీరవ్ మోదీని మొదట కోర్టులో హాజరుపరుస్తారు. అతన్ని భారత్‌కు అప్పగించాలా.. వద్దా అనే దానిపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత బ్రిటన్ హోంశాఖ కూడా అంగీకరించాల్సి ఉంటుంది.
ఒకవేళ భారత్‌కి అప్పగించాలని కోర్టు తీర్పు ఇస్తే.. దానిపై నీరవ్ మోదీ అప్పీలు చేసుకోవచ్చు. ఇందుకోసం కొంత గడువు కూడా ఇస్తారు. కోర్టు, బ్రిటన్ ప్రభుత్వం అంగీకరిస్తే నీరవ్ మోదీని భారత్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు వచ్చింది ఒకే ఒక్కరు
భారత్-బ్రిటన్ మధ్య 1992లో నేరస్థుల అప్పగింత ఒప్పందం జరిగింది. ఇది 1993 నుంచి అమల్లోకి వచ్చింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ ఒకే ఒక వ్యక్తిని బ్రిటన్ నుంచి రప్పించగలిగింది.
అతని పేరు సమీర్‌భాయ్ వినుభాయ్ పటేల్. అతనిపై 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఉన్నాయి.
నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం తనను భారత్‌కు అప్పగించడాన్ని సమీర్‌భాయ్ వ్యతిరేకించలేదు. పైగా నేరాన్ని అంగీకరించాడు. దాంతో భారత్‌కి తీసుకురావడం సులభమైంది.
విజయ్ మాల్యా పరిస్థితి?
ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా కూడా బ్రిటన్‌లోనే ఉన్నారు. ఆయన్ను అప్పగించాలని కూడా ఇది వరకే భారత్ విజ్ఞప్తి చేసింది.
దీనికి అక్కడి కోర్టు, బ్రిటన్ హోంశాఖ కూడా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై విజయ్ మాల్యా అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు.
పీఎన్‌బీ కుంభకోణం ఎలా జరిగింది?
సీబీఐ చెబుతున్న వివరాల ప్రకారం.. నీరవ్ మోదీ ముంబయిలోని PNB బ్యాంకును సంప్రదించారు.
ముడి వజ్రాల దిగుమతి కోసం రుణం కావాలని అడిగారు. విదేశాల్లో చెల్లింపుల కోసం బ్యాంకు ఆయనకు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ - LOU ఇచ్చింది. అంటే విదేశాల్లో ముడి వజ్రాలు సరఫరా చేసే వారికి డబ్బులు చెల్లించేందుకు బ్యాంకు అంగీకరించింది.
కానీ PNB అధికారులు నకిలీ LOUలు జారీ చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులకు అనుమానం రాలేదు. దాంతో నిధులు విడుదల చేశాయి. ఆ తర్వాత PNB అధికారులు ఇంటర్ బ్యాంకింగ్ మెసెజింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు.
దీన్ని గుర్తించకుండా విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులు PNBకి రుణం ఇచ్చేశాయి. ఆ తర్వాత ముడి వజ్రాలు సరఫరా చేసిన వారి అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. దాంతో నీరవ్ మోదీ ముడి వజ్రాలు పొందారు.
పాత రుణాలకు కూడా కొందరు PNB అధికారులు కొత్తగా LOUలు ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్న నీరవ్ మోదీ రుణాలు చెల్లించలేదు. కొత్తగా వచ్చిన అధికారులు భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ కుంభకోణం 2011 నుంచి 2018 మధ్య కాలంలో జరిగింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)