You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూఎన్‌డీపీ 'సౌహార్ద రాయబారి' పద్మాలక్ష్మి: ''పేదరికం తగ్గిందిగానీ అసమానతలు తొలగిపోవడం లేదు''
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూన్‌డీపీ) సౌహార్ద రాయబారి(గుడ్‌విల్ అంబాసిడర్)గా భారత సంతతికి చెందిన అమెరికా రచయిత, నటి, మోడల్, టీవీ ప్రయోక్త పద్మాలక్ష్మి నియమితులయ్యారు.
సౌహార్ద రాయబారిగా పద్మాలక్ష్మి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీల)సాధనకు మద్దతు కూడగడతారని యూఎన్‌డీపీ తెలిపింది. అసమానతలు, వివక్షలను పారదోలడంపై, నిరాదరణకుగురైన వారికి సాధికారత కల్పించడంపై ఆమె ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పింది.
ప్రపంచంలో మహిళలు, బాలికలు అత్యంత తీవ్రమైన వివక్షను, కష్టాలను ఎదుర్కొంటున్నారని అమెరికాలోని న్యూయార్క్‌లో యూఎన్‌డీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పద్మాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అసమానతలు పేద దేశాల ప్రజలపైనే కాదు సంపన్న దేశాల ప్రజలపైనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తాయనే వాస్తవాన్ని సౌహార్ద రాయబారిగా అందరి దృష్టికీ తీసుకెళ్తానని ఆమె చెప్పారు.
'పేదరికం తగ్గినా అసమానతలు తొలగడం లేదు'
''చాలా దేశాలు పేదరికాన్ని బాగా తగ్గించాయి. కానీ అసమానతలు మాత్రం తొలగిపోవడం లేదు. లింగ వివక్ష, వయసును బట్టి చూపే వివక్ష, జాతిని బట్టి చూపే వివక్ష వల్ల అసమానతలు ఇంకా తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితులు మహిళలపై, మైనారిటీలపై చాలా ప్రభావం చూపిస్తాయి'' అని పద్మాలక్ష్మి విచారం వ్యక్తంచేశారు.
మార్చి 8 మహిళా దినోత్సవం నేపథ్యంలో ఒక్క రోజు ముందు గురువారం పద్మాలక్ష్మి నియామకం జరిగింది. ఈ నియామకంపై ఆమె ట్విటర్‌లో స్పందిస్తూ- ఇది తనకు లభించిన గొప్ప గౌరవమని చెప్పారు.
ఇప్పుడు 48 ఏళ్ళున్న పద్మాలక్ష్మి 16 ఏళ్ల వయసులో తాను అత్యాచారానికి గురయ్యానని గత ఏడాది సెప్టెంబరులో వెల్లడించారు. కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో బాయ్‌ఫ్రెండే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అప్పట్లో సుప్రీంకోర్టుకు నామినేట్ చేసిన జడ్జి బ్రెట్ కేవెనాపై ఇద్దరు మహిళలు అత్యాచార ఆరోపణలు చేయడం సంచలనంగా మారిన సమయంలో ద న్యూయార్క్ టైమ్స్ పత్రికలో రాసిన వ్యాసంలో పద్మాలక్ష్మి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఏళ్ల కిందటే అత్యాచారం జరిగితే ఇప్పటివరకు ఆ విషయం ఎందుకు చెప్పలేదని ఆరోపణలు చేస్తున్న వారిని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. ''ఆ ఇద్దరు మహిళలూ ఇంతకాలం ఆ విషయం ఎందుకు చెప్పలేదో నేను అర్థం చేసుకోగలను. 32 ఏళ్లుగా నేనూ అలాగే మౌనంగా ఉన్నాను కదా'' అని ఆమె తన వ్యాసంలో రాశారు.
తన పొరపాటు వల్లే లైంగిక దాడికి గురైనట్లు భావించేదానినని, మహిళలు తమపై జరిగే లైంగిక దాడుల గురించి బయట ప్రపంచానికి ఎందుకు చెప్పరో కూడా తనకు ఆ తరువాతే అర్థమైందని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- రోడ్డు మీద వదిలేసిన పాపకు అర్ధరాత్రి వెళ్లి పాలిచ్చిన కానిస్టేబుల్
- మహిళలకు పురుషులతో సమానంగా ఆర్థిక హక్కులు అందిస్తున్న దేశాలెన్ని...
- Ind Vs Aus: వన్డేల్లో 500వ విజయం సాధించిన భారత జట్టు
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- 'ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశం మంచిదే... కానీ, మోదీ ఎలా ఉన్నారంటే...' - పర్వేజ్ ముషారఫ్‌తో బీబీసీ ఇంటర్వ్యూ
- Fact Check: జవాన్ల కుటుంబాలకు 110 కోట్లు విరాళం ఇస్తానన్న ముర్తాజా అలీ మాటల్లో నిజమెంత...
- మసూద్ అజర్‌ను జమ్మూ జైలు నుంచి కాందహార్‌కు ఎలా తీసుకువచ్చారు...
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)