జవాన్ల కుటుంబాలకు 110 కోట్లు విరాళం ఇస్తానన్న ముర్తాజా అలీ మాటల్లో నిజమెంత: Fact Check

    • రచయిత, ప్రశాంత్ చాహల్
    • హోదా, బీబీసీ ఫ్యాక్ట్ చెక్ టీమ్

ముంబయిలో నివసించే ముర్తాజా అలీ చేసిన ఒక పెద్ద ప్రకటన... ఆయన పేరును సోషల్ మీడియాలో మారుమోగేలా చేసింది.

ఆయన తన సంపాదన నుంచి 110 కోట్ల రూపాయలు ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇవ్వబోతున్నానని చెప్పారు.

అంధులైన ముర్తాజా అలీ ఈ డబ్బును దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారత జవాన్ల కుటుంబాలకు సాయం అందించడానికి ఉపయోగించాలని కోరుతున్నారు.

సోషల్ మీడియాలో ఆయన ఈ ప్రకటన ఆధారంగా చాలా వార్తలు షేర్ అవుతున్నాయి. చాలా పెద్ద మీడియా సంస్థలు కూడా ఆయన మాటలను వార్తలుగా చూపిస్తున్నాయి. జనం కూడా ముర్తాజా అలీ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

దానితోపాటు భారత రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో ముర్తాజా అలీ ఉన్న ఒక ఫొటో కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

కానీ, తనను తాను ఒక సామాన్య ఇన్వెంటర్ అంటే ఆవిష్కర్తగా చెప్పుకునే ముర్తాజా అలీ ఇంత భారీ స్థాయిలో డబ్బును ఎలా విరాళంగా ఇవ్వగలరని చాలామందిలో ఆసక్తి రేపింది.

దీనికి జవాబుగా ముర్తాజా అలీ బీబీసీతో "ఈ డబ్బు ఎలా వచ్చిందో, నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముంది. నేను స్వేచ్ఛగా నా పాన్ కార్డ్, అవసరమైన మిగతా పత్రాలతోపాటు ఈ డబ్బు ప్రధానికి ఇవ్వబోతున్నాను" అన్నారు.

ముర్తాజా అలీ గురించి ప్రచురించిన వార్తలను పరిశీలిస్తే వాటిలో ఒకే సమాచారం లభిస్తోంది. ఆయన కోటా పట్టణానికి చెందినవారు. 2015లో ముంబై వచ్చారు. బాల్యం నుంచీ ఆయనకు చూపు లేదు. మొదట ఆయనకు ఆటోమొబైల్ బిజినెస్ ఉండేది. తర్వాత ఆయన ఆవిష్కర్త అయ్యారు. ప్రస్తుతం ఆయన 'ఫ్యూయల్ బర్న్ టెక్నాలజీ' మీద పనిచేస్తున్నారు. ఆయన 110 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తానని ఆఫర్ చేశారు.

"పుల్వామా దాడి తర్వాత ఫిబ్రవరి 25న డొనేషన్ ఆఫర్ చేస్తూ ఆ సమాచారం మీడియాకు ఇచ్చానని" ముర్తాజా అలీ చెబుతున్నారు.

"ప్రభుత్వం తన టెక్నాలజీని ఉపయోగించి ఉంటే పుల్వామాలో చనిపోయిన 40 మందికి పైగా జవాన్లు ఇప్పుడు ప్రాణాలతో ఉండేవారని" ఆయన బీబీసీతో చెప్పారు.

కానీ, తన వాదనలకు సంబంధించి బీబీసీ అడిగిన చాలా ప్రశ్నలకు ముర్తాజా సమాధానం ఇవ్వలేకపోయారు.

దానితోపాటు ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఆయన వాదనలపై ప్రశ్నలు సంధించింది.

బీబీసీ ప్రశ్నలకు సమాధానాలు లేవు

ఒక పెద్ద కంపెనీతో కలిసి ఫ్యూయల్ బర్న్ టెక్నాలజీ తయారు చేశానని ముర్తాజా చెబుతున్నారు. కానీ, ఆ కంపెనీ భారత్‌దా లేక విదేశీ కంపెనీనా? దాని పేరేంటి? ఏ స్థాయిది? అనే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

ఆయన పనిచేశానని చెబుతున్న టెక్నాలజీకి సంబంధించిన వర్క్ షాప్ ఎక్కడుంది? ఈ ప్రశ్నకు బదులుగా ఆయన, "టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ పూర్తయిపోయాయి. మూడేళ్ల నుంచి మేం ప్రభుత్వంతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాం" అని చెప్పారు. కానీ, వర్క్ షాప్ ఎక్కడుందో మాత్రం చెప్పలేదు.

"చాలా దూరం నుంచే ఒక కారులో ఎంత సామాను ఉంది, ఎలాంటి సామాను ఉంది అనే విషయం మా టెక్నాలజీతో చెప్పవచ్చు" అని ముర్తాజా అంటున్నారు.

"ఏడాది క్రితం ఈ టెక్నాలజీని అడగడానికి ఒక గల్ఫ్ దేశం నుంచి కొంతమంది తన దగ్గరికి వచ్చారని, వారు దానికోసం లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని" ముర్తాజా చెబుతున్నారు.

మరి ఆయన ఆ టెక్నాలజీని కెమేరా ముందు ప్రదర్శించగలరా? అలా చేయలేకపోవడానికి ఎన్నో సాంకేతిక కారణాలున్నాయని ఆయన చెప్పారు. అలా చూపించడం కుదురదన్నారు.

"2018 అక్టోబర్ 25న నేను స్టాంప్ పేపర్లపై ఈ టెక్నాలజీని ప్రధాన మంత్రి పేరున ట్రాన్స్‌ఫర్ చేసేశాను. అందుకే గోప్యత కారణాల వల్ల ఈ టెక్నాలజీని మొదట భారత ప్రభుత్వానికి చూపాలని అనుకుంటునట్లు" ముర్తాజా తెలిపారు.

ఈ టెక్నాలజీ చేతులు మారినట్లు మీరు పత్రాలు చూపించగలరా? అంటే, ఆయన దానికి కూడా నిరాకరించారు.

పేపర్లు లేవు, డబ్బు రాలేదు

అంతా మాట్లాడిన ముర్తాజా చివర్లో, "నేను వారిని ఎప్పుడు కలుసుకోవాలి, ఆ డబ్బును ఎప్పుడు ప్రధానికి ఇవ్వాలి, ఆ విరాళాన్ని సైనికుల కుటుంబాలకు ఎలా చేర్చాలి అన్నది ప్రభుత్వం మీదే ఉంది" అన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం గురించి ఆయన చేసిన వాదనల్లో నిజాలు తెలుసుకోడానికి మేం పీఎంఓతో కూడా మాట్లాడాం.

ప్రధానమంత్రి కార్యాలయంలోని ఒక సీనియర్ అధికారి "ముర్తాజా అలీ డొనేషన్ ఆఫర్ మెయిల్ పీఎంఓకు పంపించారు. ఆయన ప్రధానమంత్రిని కలవడానికి సమయం కోరారు. ఆయన ఆ డొనేషన్ చెక్‌ను స్వయంగా ప్రధానికి ఇవ్వాలని అనుకుంటున్నారు" అని చెప్పారు.

"ఆఫీస్ ప్రొటోకాల్ దృష్ట్యా ప్రధాని అపాయింట్‌మెంట్ సెక్షన్ ఆయనను ఫండ్ సెక్షన్‌తో మాట్లాడమని చెప్పారు. అక్కడ ఆయన ఎలాంటి షరతులు లేకుండానే డొనేషన్ ఇవ్వవచ్చు" అన్నారు.

ఫండ్ విభాగం( పీఎంఓ)లో డిప్యూటీ కార్యదర్శి అగ్ని కుమార్ దాస్ బీబీసీతో, "ఫోన్‌లో ముర్తాజా 110 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తానని మాట్లాడారు. ఆయన తన ఏదో రీసెర్చ్ పత్రాలు కూడా మాకు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. మేం ఆయనతో పీఎంఓకు వచ్చి మీ పత్రాలు జమ చేయండి అని చెప్పాం. కానీ పత్రాలు రాలేదు, డబ్బులూ రాలేదు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)