You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోహింజ్యా సంక్షోభం: జైలు శిక్ష రాయిటర్స్ జర్నలిస్టుల అపీలును తిరస్కరించిన మయన్మార్ కోర్టు
ప్రభుత్వ రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో జైల్లో ఉన్న ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టుల అభ్యర్థనను మయన్మార్ కోర్టు తిరస్కరించింది.
వా లోన్, క్యా సోయే వూ అనే ఇద్దరు రాయిటర్స్ రిపోర్టర్లకు మయన్మార్ కోర్టు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. దీనిపై ప్రపంచంలోని చాలా దేశాలు నిరసన వ్యక్తం చేశాయి.
మయన్మార్‌లో రోహింజ్యాల మీద సైనికచర్య జరిగిన 2017లో 10 మంది ముస్లిం రోహింజ్యాలను భద్రతా దళాలు హత మార్చిన సంఘటనను ఆ విలేకరులు బయట పెట్టారు.
అయితే, వారికి 'తగిన శిక్ష' పడిందని, వారు నిర్దోషులను ప్రతివాదులు నిరూపించలేకపోయారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
పోలీసు అధికారులు ఇచ్చిన అధికారిక పత్రాలు తీసుకుని వెళ్తుండగా వారిద్దరూ ఆరెస్ట్ అయ్యారు. అధికారులే తమను అలా ఇరికించారని, తాము నిర్దోషులమని వారు మొదటి నుంచీ చెబుతున్నారు.
అరెస్టయిన సమయంలో వారు రోహింజ్యాల సామూహిక మారణకాండ గురించి పరిశోధిస్తున్నారు. ఆ సమయంలో లక్షలాది రోహింజ్యాలు మయన్మార్ (బర్మా)లోని రఖైన్ రాష్ట్రంలో తమ మీద జరుగుతున్న హింసాత్మక దాడుల నుంచి తప్పించుకునేందుకు బంగ్లాదేశ్ లోకి పారిపోయారు.
ఐక్యరాజ్యసమితి రోహింజ్యాలపై దాడులను తీవ్రంగా ఖండించింది. రోహింజ్యాల మారణహోమానికి సంబంధించి మయన్మార్ ఉన్నత సైనికాధికారులను విచారించాలని డిమాండ్ చేసింది. రోహింజ్యాలపై హింసను ఆపడంలో మయన్మార్ నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన అంగ్ శాన్ సూకీ విఫలమయ్యారని కూడా వ్యాఖ్యానించింది.
రోహింజ్యాల మీద జరిగిన అనేక మారణకాండలలో ఒక సంఘటనను మాత్రమే అది జరిగినట్లు బర్మా ప్రభుత్వం అంగీకరించింది. ఆ విలేకరులు కూడా ఆ సంఘటననే పరిశోధిస్తున్నారు. సాయుధ చొరబాటుదార్లను లక్ష్యంగా చేసుకునే సైనిక చర్యలు చేపట్టామని చెప్పిన మయన్మార్ ప్రభుత్వం, అప్పటివరకూ తమ సైనికులు చట్ట విరుద్ధంగా ఏ ఒక్కరినీ చంపలేదని చెబుతూ వచ్చింది.
తమ జర్నలిస్టుల విజ్ఞప్తిని మరోసారి తోసిపుచ్చడం ద్వారా కోర్టు మరోసారి తమకు అన్యాయం చేసిందని రాయిటర్స్ చీఫ్ ఎడిటర్ స్టీఫెన్ జె. ఆడ్లర్ అన్నారు.
"రిపోర్టింగ్ నేరం కాదు. ఈ విషయంలో మయన్మార్ ప్రభుత్వం తన తప్పు దిద్దుకోనంతవరకు ఆ దేశంలో పత్రికా స్వేచ్ఛ లేనట్లే" అని ఆడ్లర్ అన్నారు.
ఇప్పుడు ఆ ఇద్దరు రిపోర్టర్‌లు మయన్మార్ సుప్రీం కోర్టులో అపీలు చేసుకోవాలి. అందుకు మరో ఆరు నెలల సమయం పడుతుంది.
ఇప్పటికే, వాళ్ళు ఏడాదికి పైగా జైల్లో ఉన్నారు.