కోపిష్టికి మిరపకాయ, చిన్నారికి విమానం, ధనవంతునికి బెంజ్ కారు - శవపేటికల ‘ఘన’ చరిత్ర

కర్టసీ: ఫెల్లిప్ ఆబ్రూ, హెన్రిక్ హెడ్లర్

శవపేటికల తయారీలో ఘనా దేశ ప్రజలు సృజనాత్మకత చూపెడుతున్నారు. జీవితాన్ని, కలలను కలగలిపిన నైపుణ్యంతో మరణించినవారి కోసం కార్లు, విమానాలు, ఇళ్లు.. ఇలా రకరకాల రూపాల్లో శవపేటికలు తయారుచేస్తున్నారు.

తమకు ఇష్టమైనవారికి అంతిమవీడ్కోలు పలికేందుకు ఇలాంటి శవపేటికలను వాడుతున్నారు. ఇదో గౌరవ, ప్రేమపూర్వక చిహ్నం.

ఘనా రాజధాని ఆక్రాతోపాటు కుమాసి నగరంలోని ఇలాంటి సంప్రదాయ శవపేటికలను తయారుచేసే పరిశ్రమలకు జర్నలిస్టులు ఫెల్లిప్ ఆబ్రూ, హెన్రిక్ హెడ్లర్ వెళ్లారు. అక్కడ పనిచేసే కార్పెంటర్లను కలిశారు.

ఘనాలో ఇలాంటి ఫ్యాంటసీ శవపేటికలకు ఆద్యుడు అని చెప్పే 'సెత్ కేన్ క్వీ' పేరునే ఈ కార్పెంట్ షాపులకు పెట్టుకున్నారు.

కోకోను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఘనా ఒకటి. అక్కడి గ్రామీణ ప్రజలు.. చనిపోయిన తమవారి కోసం, జాగ్రత్తగా దాచుకున్న కష్టార్జితంతో, కోకో చెక్కతో చేసే సంప్రదాయ శవపేటికలను తయారు చేయించుకుంటారు.

ఇలాంటి శవపేటికల ఖరీదు వెయ్యి డాలర్ల వరకు ఉంటాయి. కానీ అక్కడి రైతులకు ఇది తలకుమించిన భారమే. ఎందుకుంటే వారి సంపాదన రోజుకు 3డాలర్ల కంటే తక్కువే ఉంటుంది.

సాధారణంగా ఇలాంటి శవపేటికలు.. చనిపోయినవారి వృత్తిని, సామాజిక స్థాయికి గుర్తుగా వాడతారు. ఉదాహరణకు మిరపకాయ ఆకారంలోని శవపేటిక ఒకటి.

''మిరపకాయలోని ఎరుపు, దాని ఘాటు గుణం అన్నవి చనిపోయిన వ్యక్తి కోపాన్ని, మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి'' అని మేనేజర్ ఎరిక్ అడ్జతేయ్ అన్నారు.

గత 50ఏళ్లుగా ఎరిక్ ఈ వ్యాపారం చేస్తున్నారు.

మెర్సిడెజ్ బెంజ్ కారు ఆకారంలోని శవపేటిక చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ధనికుల కోసం తయారు చేస్తారు. ఈ శవపేటికకు అనుగుణంగానే స్మశానంలో గుంతను తవ్వుతారు.

''సాధారణంగా ఎక్కువమంది ఈ శవపేటికను వాడతారు. ఇది ఆ వ్యక్తి యొక్క సామాజిక స్థితికి గుర్తు'' అని శవపేటికలను తయారుచేసే స్టీవ్ అన్సా అన్నారు.

చాలామంది వీటిని కళాత్మకమైన ఫ్యాంటసీ శవపేటికలు అంటారు. కానీ స్థానికులు మాత్రం వీటిని 'అబేదూ అదేకై' అంటారు. ప్రతి ఒక్క శవపేటిక రూపానికీ ఓ అర్థం ఉంటుందని అర్థం.

వీటిలో విమాన శవపేటికలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఇవి చిన్నపిల్లల కోసం తయారుచేస్తారు.

మరణానంతర జీవితానికి సురక్షితంగా ప్రయాణం సాగుతుందన్న విశ్వాసంతో విమాన శవపేటికలను వాడుతారు. కొన్నిసార్లు ఇలాంటి శవపేటికలను తయారుచేయడానికి తోటివారు ఆర్థికసాయం కూడా చేస్తారు.

గత కొన్నేళ్లుగా ఘనాలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఈ శవపేటికలు ఆసాములకు ప్రత్యేకించినవి. ఎవరైతే విస్తృతంగా ఇళ్లు కట్టించి, ఎక్కువ ఇళ్లను అద్దెకు ఇచ్చారంటూ వారి ఆర్థిక స్థాయిని సంఘం కొనియాడుతుందో.. వారికి ఇలాంటి ఇళ్ల ఆకారంలోని శవపేటికలు సిద్ధం చేస్తారు.

''చనిపోయినవారికోసం శవపేటికలను కొనడం కుటుంబ సభ్యుల బాధ్యత. శవపేటికతోపాటు మృతుల కోసం బట్టలు, ఆహారపానీయాలను కూడా అంత్యక్రియల్లో భాగంగా కొనాల్సిందే''

''అంత్యక్రియలు గురువారం నుంచి సోమవారం వరకు జరుగుతాయి. గురువారంనాడు శవపేటిక ఆయా కుటుంబాలకు అందుతుంది. శుక్రవారంనాడు మార్చురీ నుంచి శవాన్ని తీసుకువస్తారు. ఆదివారం బంధుమిత్రులు చర్చికి వెళ్లొస్తారు. ఆరోజే అంత్యక్రియలు జరుగుతాయి. సోమవారంనాడు కుటుంబ సభ్యులందరూ కూర్చుని, అంత్యక్రియలకు ఎంతెంత ఖర్చయ్యిందీ లెక్కవేసుకుంటారు'' అని అడ్జతేయ్ అన్నారు.

పైన కనిపిస్తున్న మైక్రోఫోన్ ఆకారంలోని శవపేటికను.. మరణించిన స్థానిక గాయకుడి కోసం సిద్ధం చేస్తున్నారు.

''చనిపోయిన మనిషి కొలతలు మాకు తెలీదు కాబట్టి, వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటాం. కొన్నిసార్లు వారి ఫోటోల ఆధారంగా కొలతల్లో అంచనాకి వస్తాం'' అని కార్పెంటర్ అన్సా అన్నారు.

ఈమధ్యకాలంలో కొందరు కార్పెంటర్లు.. స్థానికంగా ఉన్న డిమాండ్‌కు తగినట్లుగా సంప్రదాయ శవపేటికల్లో మార్పులు తెస్తున్నారు.

పైన కనిపిస్తున్న పల్లకి, పల్లకిలో కూర్చున్న రాణి ఉన్న కళాకృతి శవపేటిక కోసం సిద్ధం చేసింది కాదు. అమెరికాలో జరిగిన ప్రదర్శనలో ఉంచడానికి సిద్ధం చేసింది.

20కు పైగా దేశాల్లోని కస్టమర్లు గత కొన్నేళ్లుగా ఇలాంటి శవపేటికలను కొంటున్నారు.

అమెరికా, రష్యా, దక్షిణ కొరియా, డెన్మార్క్ దేశాల్లోని ఉడ్ వర్క్ విద్యార్థులను ఈ శవపేటిక కళారీతులు ఆకర్షిస్తున్నాయి. ఈ దేశాల నుంచి విద్యార్థులు ఘనా దేశానికి వచ్చి, ఈ వ్యాపారం నేర్చుకుంటున్నారు.

ఈ శవపేటికలను తయారు చేసేందుకు స్థానిక కార్పెంటర్లు సాధారణ చేతి పనిముట్లనే వాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)