You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా నియమితులైన గీతా గోపీనాథ్
హార్వర్డ్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రధాన ఆర్థికవేత్తగా నియమించారు.
ఈ విషయాన్ని ఐఎంఎఫ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆమె మౌరీ ఓస్వాల్డ్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. మౌరీ ఈ ఏడాది చివరిలో రిటైర్ కాబోతున్నారు.
కేరళలో జన్మించిన గీత ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్, మాక్రోఎకనామిక్స్‌లో పరిశోధన చేశారు. ప్రధాన ఆర్థికవేత్త పదవిని చేపట్టబోతున్న మొదటి మహిళ కూడా ఆమే.
గీతా గోపీనాథ్ నియామకం గురించి వెల్లడిస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డే.. ''ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలలో గీతా ఒకరు. ఆమె పాండిత్యం, మేధస్సు సాటిలేనివి. ఆర్థికశాస్త్రంలో ఆమెకు విస్తృతమైన అంతర్జాతీయ అనుభవం ఉంది'' అని తెలిపారు.
ఐఎంఎఫ్‌లోని ఈ పదవిలో నియుక్తులైన రెండో భారతీయురాలు గీత. ఆమెకు ముందు భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా పని చేశారు.
గత ఏడాది కేరళ ప్రభుత్వం గీతా గోపీనాథ్‌ను తమ రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా నియమించుకుంది. కేరళ సీఎం పినరయి విజయన్ ఆమెను సలహాదారుగా నియమించినపుడు ఆయన పార్టీకి చెందిన వారే కొందరు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్
గీత గ్రాడ్యుయేషన్ వరకు భారతదేశంలోనే చదువుకున్నారు. ఆమె 1992లో దిల్లీ యూనివర్సిటీకి చెందిన లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో హానర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
ఆ తర్వాత దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, 1994లో వాషింగ్టన్‌కు వెళ్లారు. 1996 నుంచి 2001 వరకు ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
ఆ తర్వాత 2001 నుంచి 2005 వరకు చికాగో యూనివర్సిటీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా పని చేశారు. 2005లో ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.
2010లో ఆమె అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2015 నుంచి ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గీతా గోపీనాథ్ అమెరికన్ ఎకనామిక్ రివ్యూ పత్రికకు సహ సంపాదకురాలిగా ఉన్నారు. ఆమె నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్‌లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ మాక్రోఎకనమిక్స్ ప్రోగ్రామ్ కోడైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గీతా అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య విధానాలు, మార్కెట్ సమస్యలపై సుమారు 40 పరిశోధనా వ్యాసాలు రాశారు.
ఇవి కూడా చదవండి:
- గాంధీజీ 150వ జయంతి: మహాత్ముడి గురించి ఆయన వారసులు ఏమంటున్నారు?
- బీబీసీ లైబ్రరీ: గ్రాఫిక్స్ లేని కాలంలో... బొమ్మలతో విజువల్ ఎఫెక్ట్స్ ఇలా చేసేవారు...
- ఇండోనేసియా భూకంపం: చర్చిలో 34 మంది విద్యార్థుల మృతదేహాలు
- ‘రొమ్ము క్యాన్సర్’పై పాట పాడిన సెరెనా విలియమ్స్
- వీగర్ ముస్లింలు: చైనా మైనారిటీ శిబిరాల్లో నిర్బంధ హింస
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)