You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'గ్లామర్ ప్రపంచంలో అడుగెయ్యాలంటే యవ్వనంగా కనిపించాల్సిందేనా?'
- రచయిత, నవీన్ నేగి
- హోదా, బీబీసీ ప్రతినిధి
జిగేల్‌మనే లైట్లు.. కెమెరా ఫ్లాష్‌లు.. వేదికపై ఓ అందమైన మహిళ తన తియ్యని స్వరంతో ఆకట్టుకుంటున్నారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటుతున్నాయి.
ఈ స్టేజ్ షో.. ఒక గ్లామర్ కార్యక్రమం అన్న విషయం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కానీ.. ఈ తళుకుబెళుకులను పక్కనపెడితే.. ఆ వేదిక వెనక వారి ప్రపంచం చాలా భిన్నమైనది. మిరుమిట్లు గొలిపే లైట్లు అక్కడ కానరావు, కెమెరాల ఫ్లాష్‌లు అక్కడ గుడ్డిగా మారతాయి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు వినపడవు.
కొంత వయసు దాటిన తర్వాత కూడా ఈ స్టేజీ మీద ప్రదర్శించిన అందాన్ని అలాగే నిలుపుకోవాలన్న ఒత్తిడి ఆ మహిళపై పెరుగుతుంది.
ఒకప్పుడు అందరికీ సుపరిచితమైన ముఖాలు, కాలం గడిచేకొద్దీ కనుమరుగవుతున్న పరిస్థితి చూస్తున్నాం.
2001లో జనాదరణ పొందిన హిందీ టీవీ సీరియల్ 'కుసుమ్'. అందులో ప్రధాన పాత్ర పోషించిన నౌషీన్ అలీ సర్దార్, ప్రేక్షకుల్లో 'కుసుమ్'గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఆమె వయసు 34 ఏళ్లు. త్వరలో ఆమె 'అలాద్దిన్' అనే మరో హిందీ సీరియల్‌లో కనిపించబోతున్నారు.
ఇటీవల ఈ షోకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన.. ఆమెను కొంతమంది ట్రోల్ చేయడం ప్రారంభించారు.
నౌషీన్ తన వయసును దాచిపెట్టుకునేందుకు ఫొటోలకు ఫిల్టర్స్ వాడారంటూ కొందరు కామెంట్లు పెట్టారు.
ఆ ట్రోలింగ్స్‌పై ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. "కుసుమ్ సీరియల్ ప్రసారమయ్యే సమయంలో నా వయసు 17-18 ఏళ్లే. కానీ, 29- 30 ఏళ్ల మహిళ పాత్రలో నటించాను. దాన్నిబట్టి ఇప్పుడు నేను 45- 50 ఏళ్ల మహిళనని జనాలు అనుకుని ఉంటారు. కానీ.. వాస్తవం కాదు" అన్నారు.
విరామం తీసుకుంటే ఇక కష్టమే..
గ్లామర్ ప్రపంచంలో మహిళల వయసుకి ఉండే ప్రాధాన్యత ఏంటి? అన్న ప్రశ్నకు నౌషీన్ సమాధానమిస్తూ... బాలీవుడ్ పురుషాధిక్య సినీ పరిశ్రమ. టీవీ ప్రపంచంలో మాత్రం చాలావరకు ప్రధాన పాత్రలను మహిళలే చేస్తున్నారు.
మీకు 21 ఏళ్లు ఉన్నా, 41 ఏళ్లు ఉన్నా టీవీ సీరియళ్లలో తల్లి పాత్ర దొరుకుతుంది. కుటుంబ బాధ్యతల కారణంగా విరామం తీసుకునేంత వరకూ అవకాశాలు వస్తాయి.
"విరామం తీసుకోకుండా నటన కొనసాగిస్తుంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ.. కుటుంబ బాధ్యతో లేక మరే కారణంతోనో కాస్త విరామం తీసుకుంటే మాత్రం మళ్లీ మనల్ని ప్రజలు స్వీకరించేందుకు చాలాకాలమే పడుతుంది. ఆ తర్వాత మనకు వచ్చే పాత్రలు కూడా మారిపోతాయి" అంటారు నౌషీన్.
ఆమె చెబుతున్నది టీవీ, సినిమా పరిశ్రమలకు సంబంధించిందే అయినా.. వాస్తవానికి ఇంకా కొన్ని రంగాల్లోనూ మహిళల కెరీర్ మీద వారి వయసు ప్రభావం ఉంటోంది.
భారత్‌లో 36 శాతం మంది మహిళలు విరామం తీసుకోకుండా ఉద్యోగాలు కొనసాగించడంలేదని ఫోర్బ్స్ ఇండియా పత్రిక ప్రచురించిన ఓ నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం... సెంటర్ ఫర్ టాలెంట్ ఇన్నోవేషన్ (సీటీఐ) 2012లో ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాలకు చెందిన మహిళల పని విధానంపై అధ్యయనం చేసింది.
ఈ అధ్యయనంలో భాగంగా 3,000 మంది భారతీయ మహిళలు, పురుషులను ఇంటర్వ్యూ చేశారు. 36 శాతం మంది భారతీయ మహిళలు ఉద్యోగాల్లో విరామం తీసుకుంటారని ఈ సర్వే తేల్చింది. జర్మనీ, అమెరికాలోనూ ఇలాంటి ఫలితాలే కనిపించాయి.
ఈ సర్వే తేల్చిన మరో విషయం, విరామం తీసుకున్న తర్వాత 58 శాతం మంది మహిళలు మాత్రమే ఫుల్‌టైం ఉద్యోగాలు చేస్తున్నారు.
పెళ్లైంది ఆఫర్లు తగ్గాయి
మహిళలు అందంగా, యవ్వనంగా కనిపించాలనేది టీవీ, సినిమా పరిశ్రమలలో మాత్రమే కాదు, స్టేజ్ షో యాంకర్లకు, ఎయిర్ హోస్టెస్‌లకు కూడా వర్తిస్తుంది.
"గ్లామర్ ప్రపంచంలో అమ్మాయిలపై ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలనే ఒత్తిడి ఉంటుంది. మీరు ఫిట్‌గా, ఆకట్టుకునేలా లేకపోతే త్వరలోనే మీకు తిరస్కారం ఎదురవుతుంది'' అంటారు స్టేజ్ షో యాంకర్ కృష్ణా వర్మ.
దిల్లీలో పలు కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన కృష్ణాది హరియాణా రాష్ట్రం. ప్రస్తుతం ఆమె వయసు 36 ఏళ్లు. 2009లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి.
తనకు పెళ్లైన తర్వాత అవకాశాలు తగ్గిపోయాయని ఆమె అంటున్నారు.
"పెళ్లికి ముందు చాలా బిజీగా ఉండేదాన్ని. నెలలో 20- 22 షోలు నిర్వహించేదాన్ని. కానీ.. పెళ్లి చేసుకున్న తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి" అని కృష్ణా అంటున్నారు.
నిజానికి, అందం అనేది వయసు మీద ఆధారపడి ఉండదు. కానీ, కొన్ని రంగాల్లో మహిళలకు కెరీర్ అవకాశాల విషయానికొచ్చినప్పుడు మాత్రం వయసు అనేది ముఖ్యమైన విషయంగా మారుతోంది.
షాహిద్ కపూర్ భార్యపై విమర్శలు
ఎప్పుడూ యవ్వనంగా ఎలా కనిపించాలి? లేదా వయసును ఎలా దాచిపెట్టాలి? అనే సమస్యను మార్కెట్ కూడా సొమ్ముచేసుకుంటోంది.
ఇటీవల బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ నటించిన ఓ వాణిజ్య ప్రకటన విమర్శలకు దారితీసింది. అది యాంటీ- ఏజింగ్ క్రీం ప్రకటన. అందులో తల్లి అయిన తర్వాత ఆమె చర్మంపై వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రీం సాయంతో ఆమె దాన్ని కనిపించకుండా చేసేస్తుంది.
ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో మీరా పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
23 ఏళ్లు మాత్రమే ఉన్న మీరా, యాంటీ - ఏజింగ్ క్రీం ప్రకటనలో నటించాలా? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.
మహిళల బాహ్య సౌందర్యం గురించి కొన్ని నెలల క్రితం టాలీవుడ్ నటి అక్కినేని అమల బీబీసీతో మాట్లాడుతూ.. "అందంగా, యవ్వనంగా కనిపించాలనే ఒత్తిడి కేవలం సినీ తారలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచం అంతా ఉంది. అన్ని వర్గాలలోనూ బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యత ఎక్కువగానే ఉంది. అందరికీ అందంగా కనిపించాలనే ఉత్సాహం ఉంది. ఈ ధోరణి మంచిది కాదు. ఎవరైనా తమ వయసును ఆహ్వానించాలి. ప్రపంచంలో ఏ జీవిని అయినా చూడండి. చిన్న వయసులో అవి చాలా అందంగా కనిపిస్తాయి" అన్నారు.
కొత్తవారికి ఇదో సవాలు
గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అమ్మాయిలకు అతిపెద్ద సవాల్. "ఈ రంగంలో ప్రవేశించి, తమ ప్రతిభను నిరూపించుకోవాలంటే.. వారికి ముందుగా ఉండాల్సిన మొదటి అర్హత యవ్వనంగా కనిపించడమే'' అంటారు ఈవెంట్ షో వ్యాఖ్యాత కృష్ణ.
డెహ్రాడూన్‌కు చెందిన 25 ఏళ్ల ఆయిషా ఘనీ గత అయిదేళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాల్లోనూ మోడలింగ్, ఈవెంట్ షోలు నిర్వహిస్తున్నారు. ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం తనకు బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని ఆయిషా అంటున్నారు. క్షణం కూడా తీరిక దొరకట్లేదని, స్నేహితులతో, దగ్గరి బంధువులతో మాట్లాడేందుకూ కుదరట్లేదని చెబుతున్నారు.
కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత తనకు అవకాశాలు తగ్గిపోతాయోమే అని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"అందంగా కనిపించాలన్న ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. మనం ఎలాంటి పరిస్థిలో ఉన్నా సరే, ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు కనిపించాలి. అతిపెద్ద సమస్య వయసు ప్రభావం. మరో నాలుగైదు ఏళ్లలో నేను కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పటితో ఈ గ్లామర్ ప్రపంచం నాకు దూరమవుతుందో ఏమో" అని ఆమె అంటున్నారు.
గ్లామర్ ప్రపంచం కొందరు మహిళలకు చాలా వేగంగా ఓ స్థాయి గుర్తింపు తెచ్చిపెడుతుంది, అంతే వేగంగా వారిని పాతాళానికి పడేస్తుంది కూడా.
మరి నిజంగానే మహిళల కెరీర్‌పై వయసు ప్రభావం ఉంటుందా? అని మరోసారి నౌషీన్‌ను అడిగాం.
అందుకు ఆమె నవ్వుతూ.. "1990లలో అలా జరుగుతుండేది. ఇప్పుడు కూడా వయసును పరిగణనలోకి తీసుకుంటే మనం ముందుకెళ్లేది ఎలా? మనం కాస్త పరిపక్వతతో ఆలోచించాలి. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- వాజ్‌పేయి- ‘వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం..’ అరుదైన ఆడియో ఇంటర్వ్యూ
- బ్యాగరి మహిళలు: శవాల మధ్య బతుకు పోరాటం
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- లియాండర్ పేస్: టెన్నిస్, వివాదాలు రెండిట్లోనూ చాంపియన్
- తెలంగాణలో తేళ్ల పంచమి: తేళ్లతో ఆటలు.. భక్తితో పూజలు
- అమ్మ పాలు... బాటిల్ రూ.250
- ఇమ్రాన్ ఖాన్: ‘నా ఎముకలు విరిచేసి పోలీసులకు అప్పగించాలని ఆ విద్యార్థులు ప్లాన్ చేశారు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.