పోప్ ఫ్రాన్సిస్: మరణశిక్ష ఆమోదనీయం కాదు.. చర్చి బోధనల్లో మార్పు

మరణశిక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదనీయం కాదని.. దీనిని వ్యతిరేకించాలని పోప్ ఫ్రాన్సిస్ స్పష్టంచేసినట్లు వాటికన్ వెల్లడించింది. ఈ మేరకు క్యాథలిక్ మత బోధనలను పోప్ మార్చినట్లు తెలిపింది.

క్యాథలిక్ మత బోధనల సారాంశమైన ‘కాథెచిసమ్ ఆఫ్ ద చర్చ్’ (చర్చి ప్రశ్నోత్తర గ్రంథం) గతంలో.. కొన్ని ఉదంతాల్లో మరణ శిక్షను ఉపయోగించవచ్చునని పేర్కొంది.

ఇప్పుడది.. ‘‘మరణశిక్ష ఆమోదనీయం కాదు. ఎందుకంటే అది ఒక వ్యక్తి అనుల్లంఘనీయత, గౌరవం మీద దాడి చేయటమే’’ అని చెప్తోంది.

పోప్ ఫ్రాన్సిస్ ఇంతకుముందు పలుమార్లు మరణశిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆధునిక ఆలోచనలకు అనుగుణంగా మారగల మత బోధనల్లో.. మరణశిక్ష విషయంలో చర్చి వైఖరి ఒకటని ఆయన గత అక్టోబర్‌లో పేర్కొన్నారు.

చర్చి ప్రశ్నోత్తరాల గ్రంథ పాఠాన్ని మొదట 1992 అక్టోబర్‌లో పోప్ జాన్ పాల్ - 2 నిర్ణయించారు.

‘‘కొన్ని నేరాల తీవ్రతకు తగ్గట్టుగా మరణ శిక్ష విధించటం తగినది. ఇది తీవ్రమైన చర్యే అయినా సామూహిక హితాన్ని కాపాడటానికి ఆమోదనీయమైనది’’ అని ఈ బోధనలు ఇంతకుముందు చెప్పాయి.

అయితే.. ఇప్పుడు మారిన పాఠం.. ‘‘చాలా తీవ్రమైన నేరాలు చేసినప్పటికీ ఒక వ్యక్తి గౌరవం అంతమైపోదనే అవగాహన పెరుగుతోంది’’ అని చెప్తోంది.

‘‘ఇప్పుడున్న మరింత ప్రభావవంతమైన నిర్బంధ పద్ధతులు పౌరులకు రక్షణ కల్పిస్తాయి.. దోషులకు ప్రాయశ్చిత్తానికి అవకాశం లేకుండా చేయవు’’ అని కూడా పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా మరణశిక్షను రద్దు చేయటం కోసం చర్చి ఇప్పుడు కృతనిశ్చయంతో కృషి చేస్తుందని వాటికన్ ఒక ప్రకటనలో తెలిపింది.

చారిత్రకంగా చూస్తే.. మరణశిక్షను చర్చి వ్యతిరేకించిన సందర్భాలు అరుదు. సార్వజనీనమైన జీవన హక్కును మరణశిక్ష ఉల్లంఘించదని 1952లో పోప్ పయస్-12 పేర్కొన్నారు.

మరణశిక్ష విధించటం కన్నా సాధ్యమైన ప్రతిచోటా నిర్బంధానికే ప్రాధాన్యం ఇవ్వాలని పోప్ జాన్ పాల్-2 వాదించారు. పోప్ బెనెడిక్ట్ - 16 అవకముందు జోసెఫ్ రాట్జింగర్.. మరణశిక్ష ఆమోదనీయమేనని రాశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)