ఈ శతాబ్దపు సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజే.. చూడ్డానికి సిద్ధంకండి

మునుపెన్నడూ చూడనంతటి ప్రత్యేకమైన చంద్ర గ్రహణాన్ని శుక్రవారం అర్ధరాత్రి దాటాక చూడబోతున్నాం. జులై 27, 2018న ఇది ఏర్పడుతోంది.

ఈ శతాబ్దంలో ఇదే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్ర గ్రహణమని నాసా చెబుతోంది.

మొత్తం గంటా నలభై మూడు నిమిషాల పాటు ఇది ఉంటుంది.

అసలు సంపూర్ణ చంద్ర గ్రహణం అంటే ఏమిటి?

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అంటే.. సూర్యచంద్రుల మధ్య భూమి ఉండడం వల్ల సూర్యరశ్మి చంద్రుడిపై పడక అది భూమిపై ఉన్నవారికి కనిపించకుండా పోవడమే చంద్ర గ్రహణం.

ఇంకోమాటలో చెప్పాలంటే భూమి చుట్టూ నిత్యం పరిభ్రమించే చంద్రుడు భూమి నీడలోంచి వెళ్లినప్పుడు ఇలా జరుగుతుంది.

జులై 27న ఏర్పడుతున్న చంద్రగ్రహణ వివిధ దశల్లో మొత్తంగా 3 గంటల 55 నిమిషాల పాటు ఉంటుంది. అందులో 1.43 గంటల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

బ్లడ్ మూన్ అని ఎందుకంటారు?

సూర్య రశ్మి భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత రంగులు దేనికవి విడిపోతాయి. వాటిలో అధిక తరంగదైర్ఘ్యం ఉండే ఎరుపు, నారింజ రంగులు మాత్రం ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. చంద్రగ్రహణం రోజున

భూఛాయలోకి ప్రవేశిస్తున్నప్పుడు, దాన్నుంచి బయటపడుతున్నప్పుడు.. ఆ తరువాత చంద్రుడిపైకి ఈ రెండు రంగులే ఎక్కువగా ప్రసరిస్తాయి. అందుకే ఆ రోజు చందమామ సాధారణ రోజుల కంటే ఎర్రగా కనిపిస్తుంది. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు.

ఏఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది?

ఈ చంద్ర గ్రహణాన్ని ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లోని దాదాపు అన్ని ప్రాంతాలవారూ వీక్షించే అవకాశం ఉంది.

దీన్ని వీక్షించడానికి ప్రత్యేకంగా టెలిస్కోప్ వంటివేమీ అవసరం లేదు. అయితే, మంచి బైనాక్యులర్స్ ఉంటే మరింత స్పష్టంగా చూడొచ్చు.

తూర్పు ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి ఇది బాగా కనిపిస్తుంది.

ఉత్తర, మధ్య అమెరికా ప్రాంతాలవారు ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం లేదు.

దక్షిణ అమెరికా వాసులు పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడగలరు.

బ్రిటన్‌లో గ్రహణం ఆరంభాన్ని చూసే అవకాశం లేదు. అక్కడ చంద్రోదయానికి ముందే గ్రహణం మొదలవుతుండడంతో వీక్షించలేరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)