You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనాలోని ఈ భారీ యంత్రాలు చూస్తే ఔరా అంటారు
- రచయిత, టామ్ కాల్వర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రోడ్డు.. జల మార్గాల ద్వారా యూరప్, ఆఫ్రికా దేశాలతో బలమైన రవాణా నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు చైనా బృహత్తర కార్యక్రమం చేపడుతోంది. భారీ అత్యాధునిక యంత్రాలతో నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తోంది. వాటితో తక్కువ ఖర్చుతో.. ఎక్కువ వేగంతో పనులను పూర్తి చేస్తోంది.
'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)' పేరుతో రోడ్డు, జల రవాణా మార్గాల అభివృద్ధి ప్రాజెక్టును 2013లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించారు. మొత్తం 70 దేశాల్లోని ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మందిని అనుసంధానం చేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
అందుకోసం వేల కోట్ల డాలర్లు ఖర్చు చేయనున్నారు. ఆ నిధులను బ్యాంకులు, భాగస్వామ్య దేశాలు, చైనా ప్రభుత్వం సమకూర్చుతాయి.
అయితే.. ఈ ప్రాజెక్టు పేరుతో పేద దేశాల మీద చైనా మోయలేని భారం వేస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి.
అయినప్పటికీ.. చైనాతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ ప్రాజెక్టు కింద పనులు జరుగుతూనే ఉన్నాయి. అత్యాధునిక యంత్రాలు రైల్వే లైన్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నాయి.
వంతెనల నిర్మాణం
కొండలు, లోయల్లో రైల్వే, రోడ్డు వంతెనలు నిర్మించడం చాలా కష్టమైన పని.
కానీ.. SLJ900/32 పేరుతో చైనా ఇంజినీర్లు తయారు చేసిన యంత్రం మాత్రం సులువుగా చేసేస్తుంది.
పిల్లర్లను అనుసంధానించేందుకు వేసే భారీ కాంక్రీటు వయాడక్ట్ సెగ్మెంట్లను మోసుకెళ్తుంది. తీసుకెళ్లి పిల్లర్ల మీద అమర్చుతుంది.
ఒక సెగ్మెంట్‌ను తీసుకెళ్లి అమర్చిన తర్వాత.. వెనక్కి వచ్చి మరో సెగ్మెంట్‌ను పట్టుకెళ్తుంది.
92 మీటర్ల(300 అడుగులు) పొడవుండే ఈ యంత్రానికి 64 చక్రాలు ఉన్నాయి.
టన్నుల కొద్ది బరువుండే కాంక్రీటు సెగ్మెంట్‌ను మోసుకుంటూ కూడా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.
ఖాళీగా అయితే గంటకు గరిష్ఠంగా 8 కిలోమీటర్ల దాకా వెళ్తుంది.
మొత్తంగా భారీ క్రేన్లు, ట్రక్కులు అవసరం లేకుండానే ఈ ఆధునిక యంత్రం చాలా సులువుగా పని పూర్తి చేస్తోంది.
స్థానికులు ఈ యంత్రాన్ని 'ఐరన్ మాన్‌స్టర్' అని పిలుస్తారు.
ఈ యంత్రం ఇప్పటికే పలు హై స్పీడ్ రైల్వే లైన్ల నిర్మాణంలో పనిచేసింది.
చైనాలోని ఇన్నర్ మంగోలియా నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలను అనుసంధానిస్తూ వేసిన రైల్వే లైను నిర్మాణంలోనూ ఈ యంత్రాన్ని వినియోగించారు.
సొరంగాలు తొలిచేందుకు
హాంకాంగ్ సమీపంలో ఆరు వరుసల హైవే కోసం భారీ సొరంగం తవ్వుతున్నారు.
అందుకోసం చైనా ఇంజినీర్లు భారీ టన్నెల్ బోరింగ్ మెషీన్(టీబీఎం)ను తయారు చేశారు.
15.3 మీటర్ల వెడల్పుతో సొరంగం తొలిచేలా ఈ భారీ యంత్రాన్ని చైనా రైల్వే ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంట్ గ్రూప్ సంస్థ రూపొందించింది.
గతంలో ఇలాంటి మెషీన్లను విదేశాల నుంచి తెప్పించేవారు.
ప్రస్తుతం భారత్‌లోనూ పలు చోట్ల నీటి పారుదల ప్రాజెక్టుల్లో సొరంగాల తవ్వకానికి టన్నెల్ బోరింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంటున్నారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగాన్ని కూడా టీబీఎంతోనే తవ్వుతున్నారు.
ఈ యంత్రం మట్టిని, రాళ్లను తొలుచుకుంటూ ముందుకు వెళ్తుంది. తవ్విన మట్టిని బయటికి పంపేస్తుంది.
తవ్వుకుంటూ వెళ్తూ.. సొరంగం గోడలు కూలిపోకుండా కాంక్రీటు లైనింగ్ కూడా వేస్తుంది.
100 మీటర్ల పొడవుండే ఈ యంత్రం బరువు దాదాపు 4000 టన్నులు ఉంటుంది.
రైల్వే ట్రాక్‌లు వేస్తూ..
బీఆర్ఐ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం కొన్ని వేల కిలోమీటర్ల పొడవైన రైలు, రోడ్డు మార్గాల నిర్మాణాలు జరుగుతున్నాయి.
కెన్యాలోని నైరోబి నుంచి మొంబాసా నగరాల మధ్య 480 కిలోమీటర్ల రైలు మార్గం 2017 మేలోనే పూర్తయింది. అత్యాధునిక యంత్రాల సాయంతో గడువు కంటే 18 నెలల ముందుగానే ఈ మార్గం నిర్మాణం పూర్తి చేశారు.
కెన్యాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిర్మించిన తొలి రైల్వే లైను ఇదే.
భారీ యంత్రం రైల్వే ట్రాక్ ఎలా వేస్తుందో ఇక్కడ చూడొచ్చు:
ఈ మార్గం వల్ల ప్రయాణ సమయం గతంలో బ్రిటిష్ కాలంలో వేసిన లైను కంటే దాదాపు 6 గంటలు తగ్గింది.
ఈ రైలు మార్గం నిర్మాణం కోసం 90 శాతం నిధులు చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు రుణంగా ఇచ్చింది.
చైనా వెలుపల చైనీస్ సాంకేతికత, చైనీస్ ప్రమాణాలతో పూర్తి చేసిన తొలి రైల్వే ప్రాజెక్టు ఇదే.
అత్యాధునిక చైనా యంత్రాలతో రోజుకు 700 మీటర్ల చొప్పున ట్రాక్‌ను నిర్మాణం పూర్తి చేశారు.
ఒక్కో ట్రాక్‌ను కేవలం నాలుగు నిమిషాల్లోనే అమర్చుతుంది.
దాన్ని బట్టి ఈ యంత్రాలు ఎంత వేగంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ మెషీన్ ఒకేసారి పలు పొడవాటి ట్రాక్‌లను మోసుకెళ్తుంది. వాటిని ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకుంటూ ముందుకు వెళ్తుంది.
అవన్నీ పూర్తయ్యాక.. మళ్లీ వెనక్కి వచ్చి మరిన్ని ట్రాక్‌లను తీసుకెళ్తుంది.
అవసరమైతే పాత ట్రాక్‌లను తొలగించి.. కొత్త ట్రాక్‌లను కూడా వేస్తుంది.
అయితే.. ఇది కొత్త ఆలోచన ఏమీ కాదు. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి యంత్రాలు వినియోగంలో ఉన్నాయి.
కానీ.. గతంలో కంటే వేగంగా.. తక్కువ ఖర్చుతో.. ఎక్కువ బరువును మోసుకెళ్లే యంత్రాలను చైనా తయారు చేసింది.
ఇవి కూడా చదవండి:
- ఇక్కడ శవాల్ని ఆర్నెల్ల దాకా పూడ్చరు
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- #GroundReport ప్రకాశం జిల్లా: తవ్విన కొద్దీ కన్నీరే, నీటి చుక్క జాడలేదు
- ఓజోన్ రంధ్రం పెద్దది కావడానికి చైనా కారణమా?
- ‘రాజకీయ వేత్తలకు వల వేసే రష్యా గూఢచారి’ అరెస్టు
- క్యాన్సర్‌తో చనిపోయే ముందు స్వీయ సంస్మరణ రాసిన బాలుడు.. ప్రపంచాన్ని కదిలించిన మాటలు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- ‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?
- చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)