ఉరే సరి: నిర్భయ కేసులో రివ్యూ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు

నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను తగ్గించాలంటూ నిందితులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను అమలు చేయాలని తీర్పు చెప్పింది.

నిందితులు క్షమించారని తప్పు చేశారని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది.

2012 డిసెంబర్ 16న దేశ రాజధాని దిల్లీలో కదులుతున్న బస్సులో 23ఏళ్ల యువతిపై ఆరుగురు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమెతో పాటు ఉన్న స్నేహితుడిని కొట్టి, యువతిపై దుర్మార్గానికి ఒడిగట్టిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

తీవ్రంగా గాయపడిన నిర్భయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబరు 29న చనిపోయింది.

ఈ కేసు దర్యాప్తు చేసిన దిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించారు. మూడేళ్ల శిక్ష అనంతరం ఆయన విడుదలయ్యాడు.

విచారణ సమయంలో నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ 2013 మార్చి 11న పోలీస్‌ కస్టడీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

క్యురేటివ్ పిటిషన్‌కు అవకాశం

అనంతరం 2013 సెప్టెంబరు 13న ట్రయల్ కోర్టు మిగతా నలుగురు.. అక్షయ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్‌లను దోషులుగా తేల్చడంతో పాటు మరణ శిక్ష విధించింది.

దీనిపై వారు దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా 2014 మార్చి 13న దిల్లీ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.

అనంతరం వారు అదే ఏడాది సుప్రీంను ఆశ్రయించారు. 2017 మే 5న సుప్రీం కోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది.

సుప్రీం తీర్పును సవాలు చేస్తూ దోషుల్లో ముగ్గురు పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, ముఖేశ్‌లు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని అభ్యర్థించారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ భానుమతిల ధర్మాసనం ఈ రివ్యూ పిటిషన్‌ను విచారణకు చేపట్టింది. అంతకుముందు విధించిన ఉరి శిక్షనే సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.

అయితే క్యురేటివ్‌ పిటిషన్‌ వేసేందుకు వారికి అవకాశం కల్పించింది.

కాగా దోషుల్లో అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనప్పటికీ ఇదే తీర్పు ఆయనకూ వర్తిస్తుంది.

‘ఆరేళ్లయినా దేశం మారలేదు.. చాలా బాధగా ఉంది’

కోర్టు తీర్పు అనంతరం నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ''సుప్రీంకోర్టు మాకు రెండోసారి న్యాయం చేసింది. కానీ, ఇప్పటికీ పరిస్థితులు మారకపోవడం, ప్రతి రోజూ అత్యాచార ఘటనలు జరుగుతుండడం నా హృదయాన్ని బాధిస్తోంది'' అన్నారు.

కాగా దోషుల్లో ముకేశ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తీర్పుపై స్పందిస్తూ న్యాయం జరగలేదన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజల, మీడియా, రాజకీయ నేతల ఒత్తిడి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)