సింగపూర్ డైరీ: ట్రంప్-కిమ్ సదస్సుపై ‘మినీ ఇండియా’ ఏమనుకుంటోంది?

    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, సింగపూర్ నుంచి

'లిటిల్ ఇండియా'.. పేరుకు తగ్గట్లే అది సింగపూర్‌లో మినీ భారతదేశంలాంటిది. కేవలం రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన లిటిల్ ఇండియా - భారతీయులు ఒక విదేశీ గడ్డపై స్థిరపడిన ప్రాంతం.

లిటిల్ ఇండియాలో వేలాది మంది భారతీయులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలు కనిపిస్తాయి. భారతీయ మార్కెట్లలో లభించే అన్ని వస్తువులూ అక్కడ దొరుకుతాయి. లిటిల్ ఇండియాలో తమిళనాడు నుంచి వచ్చి స్థిరపడిన వారి జనాభా ఎక్కువది.

15 ఏళ్ల క్రితం భారతదేశం నుంచి సింగపూర్‌కు వచ్చి స్థిరపడిన ప్రకాశ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. 2 చదరపు కిలోమీటర్ల పరిధిలో సుమారు 300 రెస్టారెంట్లు ఉన్నాయని ప్రకాశ్ తెలిపారు. అంత తక్కువ స్థలంలో అన్ని రెస్టారెంట్లు మీకు ఎక్కడా కనిపించవని ఆయన అంటారు.

మొత్తం సింగపూర్ జనాభాలో లిటిల్ ఇండియాలోనే 7 శాతం జనాభా ఉన్నారు.

లిటిల్ ఇండియాలో దారికి రెండువైపులా ఉన్న దుకాణాలపై కొన్నిచోట్ల తమిళంలో రాసి ఉండడం కూడా కనిపిస్తుంది. సింగపూర్‌లో చైనీయులు, మాలేల తర్వాత ఎక్కువ జనసంఖ్య తమిళులదే. 20వ శతాబ్దంలో సింగపూర్ ఒక రిపబ్లిక్‌గా ఏర్పడుతున్న సమయంలో వీళ్లంతా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. వీళ్లంతా ఇక్కడ సుఖసంతోషాలతో ఉంటూ ఆర్థికంగా మంచి ఉన్నతస్థితిలో ఉన్నారు.

సింగపూర్ అధికారిక భాషల్లో తమిళం కూడా ఒకటి. సింగపూర్ కేబినెట్‌లో పలువురు భారత సంతతికి చెందిన తమిళులు ఉన్నారు. వారిలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ ముఖ్యులు.

లిటిల్ ఇండియాలో జనాభాపరంగా తమిళుల తర్వాత స్థానం తెలుగు, పంజాబీలది.

ఆదివారాలు లిటిల్ ఇండియా దిల్లీలోని లాజ్‌పత్ నగర్‌లాగా కనిపిస్తుంది. షాపింగ్ మాల్స్, దుకాణాలన్నీ కస్టమర్లతో నిండిపోయి కనిపిస్తాయి. అక్కడ ఉన్న కొన్ని రెస్టారెంట్లలో తినాలంటే, కొన్ని గంటలపాటు క్యూలో వేచి చూడాల్సి ఉంటుంది.

లిటిల్ ఇండియాలో ఉంటున్న వారు సింగ్‌పూర్‌లోని ఇతర సమూహాలతో కూడా సంబంధాలు ఉండేలా చూసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు.

సింగ్‌పూర్‌ కేబినెట్‌లో చాలా మంది భారత సంతతికి చెందిన వారున్నా, లిటిల్ ఇండియాలో ఉండేవారికి రాజకీయాల్లో ఆసక్తి చాలా తక్కువ. చాలా మంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మంగళవారం జరగనున్న చరిత్రాత్మక సదస్సుపై తమకు ఆసక్తి లేదని తెలిపారు.

ట్రంప్-కిమ్‌ల సదస్సుపై సాధారణ ప్రజలకు కూడా పెద్దగా ఆసక్తి లేనట్లు నాకు కనిపించింది. సింగపూర్ ఎకనామిక్ సెంటర్‌కు లిటిల్ ఇండియా నుంచి పది నిమిషాల ప్రయాణం. అక్కడ ఆకాశాన్నంటే భవనాలలో ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకుల కార్యాలయాలు ఉన్నాయి.

ప్రస్తుతం సింగపూర్‌లో భారీ భద్రత కనిపిస్తోంది. కొంత మందితో మాట్లాడినప్పుడు నాకు వాళ్లు ఈ సదస్సు గురించి చాలా గర్విస్తున్నట్లు తెలిపారు.

ప్రజల ఆసక్తి ఎలా ఉన్నా, ప్రభుత్వం మాత్రం ఈ సదస్సు కోసం భారీ ఏర్పాట్లే చేసినట్లు నాకు కనిపించింది. నగరంలో ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 2,500మంది జర్నలిస్టులు ఈ సదస్సును కవర్ చేసేందుకు వచ్చినట్లు మీడియా సెంటర్ డైరెక్టర్ తెలిపారు.

అమెరికా అధ్యక్షునితో భేటీ అవుతున్న మొట్టమొదటి ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్. ఇద్దరు నేతలూ మంగళవారం సాయంత్రం సాంటోసా ద్వీపంలో సమావేశం కానున్నారు.

ఉత్తర కొరియా అణ్వాయుధాలు, క్షిపణులను పూర్తిగా విడనాడాలని అమెరికా కోరుతోంది. 1952లో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, ఇంతవరకు శాంతి ఒప్పందం కుదరలేదు. ఈ శాంతి ఒప్పందంపై కూడా అమెరికా, ఉత్తరకొరియా నేతలు చర్చించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)