You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జాంబియా: జైలులో పుట్టారు.. జైలులోనే పెరుగుతున్నారు
ఆఫ్రికన్ దేశమైన జాంబియాలోని జైళ్లలో అనేక మంది పసి పిల్లలు మగ్గిపోతున్నారు. వారిలో కొందరు జైలు ఊచల వెనకే పుట్టి.. అక్కడే పెరుగుతున్నారు.
మరికొందరేమో తమ తల్లులకు జైలు శిక్ష పడటం వల్ల వాళ్లు కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
వాళ్లకు చదువు లేదు. ఆట లేదు, పాట లేదు. బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు.
వాళ్లేమీ బాల నేరస్థులు కాదు. కానీ జైలు వాతావరణంలో పెరుగుతున్నందువల్ల వాళ్లు కూడా ఖైదీల్లాగే ప్రవర్తిస్తున్నారు.
అలా జైలు నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న ఆ చిన్నారులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు ఓ మహిళ.
ఆమె పేరు ఫెయిత్ కలుంగియా. 'బీబీసీ అవుట్‌లుక్ ఇన్‌స్పిరేషన్స్ 2018' పురస్కారాలకు ఆమె నామినేట్ అయ్యారు.
'లక్షల మందికి అమ్మ'
చిన్నతనం నుంచే ఓ అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలన్నది ఫెయిత్ కలుంగియా ఆశయం.
అందుకే 14 ఏళ్ల ప్రాయంలోనే ఆమె తన తల్లిదండ్రులను ఒప్పించి వీధి బాలలను దత్తత తీసుకుని వారికి చదువు చెప్పించడం ప్రారంభించారు.
2012లో మహిళా ఖైదీలకు దుస్తులు, దుప్పట్లు విరాళంగా ఇచ్చేందుకు జాంబియాలోని లుసాకా కేంద్ర కారాగారానికి ఆమె వెళ్లారు. అయితే, ఆ జైలు తలుపులు తెరవగానే లోపల పసి పిల్లలు తిరగటం చూసి షాక్ అయ్యారు.
ఆ తర్వాత వెంటనే ఫెయిత్ తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి, 'మదర్ ఆఫ్ మిలియన్స్' పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు.
జాంబియా దేశంలోని కారాగారాల్లో పెరుగుతున్న చిన్నారులకు ఈ సంస్థ చదువు చెప్పిస్తోంది.
పోషకాహారం అందిస్తోంది. ఆటలు ఆడిపిస్తోంది. వాళ్లు కూడా సాధారణ పౌరులుగా ఎదిగేందుకు సాయపడుతోంది.
ఇలా 'బీబీసీ అవుట్‌లుక్ ఇన్‌స్పిరేషన్స్ 2018' పురస్కారాలకు ఆమె నామినేట్ అయిన మిగతా వారి గురించి తెలుసుకునేందుకు ఈ లింకు క్లిక్ చేయండి.
www.bbcworldservice.com/outlookinspirations
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)