You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాలాన్ని అరగంట ముందుకు జరిపిన ఉత్తరకొరియా
ఉత్తర కొరియా తన కాలాన్ని దక్షిణ కొరియా కాలమండలానికి అనుగుణంగా మార్చుకుంది. గతవారం ఉభయ కొరియాల మధ్య జరిగిన సదస్సు అనంతరం ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం రాత్రి 11.30 నిమిషాలకు ఉత్తరకొరియా తమ కాలాన్ని అరగంట ముందుకు జరిపి అర్ధరాత్రి పన్నెండు గంటలుగా మార్చుకుంది.
ఇలా కాలాన్ని సవరించడం కొరియా ఏకీకరణ దిశగా జరిగిన కీలక చర్య అని ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది.
ఇప్పటివరకు ప్యాంగ్యాంగ్ సమయం దక్షిణ కొరియా, జపాన్‌లకన్నా అరగంట వెనుక ఉంది.
కొరియా ద్వీపకల్పం జపాన్ పాలన కింద ఉన్నపుడు టోక్యో కాలానికి అనుగుణంగా సమయాన్ని మార్చారు. అయితే 2015లో ఉత్తర కొరియా తన కాలాన్ని వెనక్కి జరుపుకుంది.
ఇటీవల ఉభయ కొరియాల నేతలూ సమావేశమైన డీమిలిటరైజ్డ్ జోన్ పాన్‌మున్‌జోమ్‌లో రెండు గడియారాలు ఒక దాని పక్క ఒకటి ఉన్నాయి. ఇవి రెండూ ఉత్తర, దక్షిణ కొరియాల సమయాన్ని సూచిస్తాయి.
ఇరువురు నేతల చర్చల అనంతరం దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ''ఆ రెండు గడియారాలను చూసి కిమ్ చాలా బాధపడ్డారు'' అని ట్వీట్ చేసింది.
ఇంకా ఏయే దేశాలు తమ కాలాన్ని మార్చుకున్నాయి?
2007లో వెనెజువెలా మాజీ నేత హ్యూగో ఛావెజ్ తమ గడియారాలను అరగంట వెనక్కి జరిపారు. దీని వల్ల ప్రజలకు మరింత ఎక్కువ పగటి సమయం అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.
అయితే తన బద్ధశత్రువు అయిన అమెరికా కాలాన్ని అనుసరించడం ఇష్టం లేకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తారు.
కానీ 2016లో ఆయన తదనంతర నాయకుడు నికోలస్ మాదురో, విద్యుత్ డిమాండ్‌ను తగ్గించడానికి పాత కాలమానాన్నే అనుసరించాలని నిర్ణయించారు.
2011లో సమోవా, టోకెలావ్‌లు తమ వాణిజ్యావసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ డేట్ లైన్‌ను దాటి ఏకంగా ఒక రోజు ముందుకు జరిగాయి.
ఇంకా ఇతర విచిత్రమైన కాలమానాలు ఉన్నాయా?
కెనడాకు చెందిన న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రావిన్స్‌లో కాలం ఇతర అట్లాంటిక్ ప్రావిన్స్‌లతో పోలిస్తే అరగంట తేడా ఉంటుంది.
భారతదేశం కాలం పాకిస్తాన్ కన్నా అరగంట ముందు, నేపాల్ కన్నా 15 నిమిషాలు వెనుక ఉంది.
పశ్చిమ ఆస్ట్రేలియా, దక్షిణ ఆస్ట్రేలియాలు తమ సరిహద్దుల వద్ద 90 నిమిషాల తేడాను అనుసరిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే ఉన్న యుక్లా పట్టణానికి తనదైన కాలమానం ఉంది. ఇది పశ్చిమ ఆస్ట్రేలియాకన్నా 45 నిమిషాలు ముందు, దక్షిణ ఆస్ట్రేలియాకన్నా 45 నిమిషాలు వెనుక ఉంటుంది.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)