You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెరూ: చరిత్రలో అతి పెద్ద చిన్నారుల బలి ఘటన - 140 కంకాళాలు లభ్యం
మానవ నాగరికత ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినా నేటికీ అక్కడక్కడా మనుషులను, ముఖ్యంగా చిన్న పిల్లలను బలి ఇచ్చే ఘటనల గురించి వింటుంటాం.
అయితే ఏకంగా 140 మంది చిన్నారులను ఒకేసారి బలి ఇచ్చిన ఘోర విషాదం లాటిన్ అమెరికన్ దేశమైన పెరూలో దాదాపు 550 ఏళ్ల కింద జరిగినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
పెరూ ఉత్తర తీరప్రాంతంలో లభ్యమైన కంకాళాలను బట్టి వీరందరినీ దాదాపు ఒకేసారి బలి ఇచ్చి ఉండొచ్చని పురావస్తు పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాంతం ఇప్పుడు పెరూలో ఆధునిక పట్టణంగా ఉన్న ట్రుజిల్లోకు సమీపంలో ఉంది. ప్రాచీన 'చిమూ నాగరికత'కు ఈ పట్టణం కేంద్ర బిందువు.
ఈ పరిశోధనకు నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ నుంచి నిధులు లభించాయి. నేషనల్ జియోగ్రఫిక్ వెబ్‌సైట్‌లో ఈ పరిశోధన వివరాలు వెల్లడించారు.
ఇది అస్సలు ఊహించలేదని పరిశోధకుల్లో ఒకరైన జాన్ వెరనో ఎన్‌జీసీకి చెప్పారు. "నేనే కాదు.. మరెవరూ అలా ఊహించి ఉండరు" అని అన్నారు.
ఈ ప్రాంతంలో మఇచ్చిన ఆనవాళ్లను తొలిసారిగా 2011లోనే కనిపెట్టారు. ఇది వాన్‌చెకిటో-లాస్ లామస్‌గా పేరు మోసింది.
3500 ఏళ్ల పురాతన ఆలయం పరిసరాల్లో జరిపిన తవ్వకాల్లో 40 మంది బాధితులు, 74 ఒంటెల అవశేషాలు కూడా లభించాయి.
మొత్తంగా ఈ ఘటనలో బలి ఇచ్చిన చిన్నారుల సంఖ్య 140 అని ఈ వారం ప్రకటించారు.
ఈ పిల్లలందరూ 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు వారే. వీరిలోనూ 8 నుంచి 12 ఏళ్ల వారు అధికంగా ఉన్నారని ఎన్‌జీసీ తెలిపింది.
ఈ చిన్నారులందర్నీ బలిచ్చారని బలంగా నమ్ముతున్నారు.
పిల్లల ఛాతి మధ్య ఎముక సహా ఇతర ఎముకలపై గాట్లు ఉన్నాయి.
చాలా పక్కటెముకలు ధ్వంసమై ఉన్నాయి. 'శరీరం నుంచి గుండెను తీసేశారు' అనేందుకు ఇదొక సంకేతమని భావిస్తున్నారు.
శిలా స్ఫటికంతో తయారు చేసిన ఎర్రని రంగును చిన్నారులకు పూశారు. బలి ఇచ్చే ఆచార సంప్రదాయాల్లో ఇది భాగమని చెబుతున్నారు.
ఒంటెలు కూడా ఇదే రకమైన బాధ అనుభవించాయి. ఇవన్నీ 18 నెలల వయసు లోపు ఉన్నవే. ఆండీస్ పర్వతాల దిశగా తూర్పున తల పెట్టి వీటిని సమాధి చేశారు.
"ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రజలు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. వారిని ఎందుకు బలి చేసి ఉండొచ్చు అని" మరో పరిశోధకుడు గాబ్రియల్ ప్రిటో అన్నారు.
ఈ తవ్వకాల్లో ఏదైనా క్లూ దొరకొచ్చు. ఇక్కడ వాతావరణ పొడిగా ఉంటుంది. కానీ వీరంతా బురదలో సమాధి చేయబడి ఉన్నారు. భారీ వర్షాలు వరదల వల్ల ఇది జరిగి ఉండొచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో వల్ల ఇది జరిగి ఉండొచ్చు.
అలాంటి వాతావరణ పరిస్థితుల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారి ఉండొచ్చని నేషనల్ జియోగ్రఫిక్ పేర్కొంది.
తీరప్రాంతంలో వరదలతో చిమూ ప్రజలు నిర్మించుకున్న వ్యవసాయ కాలువలు, మౌలిక వసతులు తుడిచిపెట్టుకు పోయి ఉంటాయని తెలిపింది.
క్రీస్తుశకం 1400 నుంచి 1450 మధ్యలో ఈ ఘటన జరిగిందని ఈ ప్రదేశంలో లభించిన వస్త్రాలపై ఉన్న కార్బన్‌ను పరీక్షించినప్పుడు తేలింది.
ఆ తర్వాత కొద్ది దశాబ్దాలకే చిమూ నాగరికతను ఇన్కా నాగరికత ఓడించింది. చిమూ ప్రజలు చంద్రుడిని దేవుడిగా పూజించేవారు. ఆ తర్వాత, దాదాపు 50 ఏళ్లకు స్పెయిన్ వలసవాదులు దక్షిణ అమెరికాలో అడుగుపెట్టారు. వారు ఇన్కా నాగరికతను మట్టిగరిపించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)