You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: 10,351 పోస్టులకు డీఎస్సీ ప్రకటన
ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ప్రకటించారు. జులై 7న డీఎస్సీ, మే 4న టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈసారి డీఎస్సీ ద్వారా 10,351 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఏపీపీఎస్సీ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
అభ్యర్థుల కోసం ఈసారి ఆన్‌లైన్ మాక్‌టెస్టులు కూడా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
జూలై 7 నుంచి ఆగస్టు 9 వరకు డీఎస్సీ దరఖాస్తుల స్వీకరిస్తారు.
ఆగస్టు 15 నుంచి హాట్‌టికెట్లను జారీ చేస్తారు. ఆగస్టు 23 నుంచి 30 వరకు పరీక్షలు ఉంటాయి.
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు ఉంటాయి.
సెప్టెంబర్ 10న ఫైనల్ కీ, సెప్టెంబర్ 15న ఫలితాలు వెలువడుతాయి. డీఎస్సీలో ఈసారి ఆరు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ టెట్ షెడ్యూల్ కూడా మంత్రి గంటా ప్రకటించారు.
మే 4న టెట్ నోటిఫికేషన్ జారీ చేసి, మే 5 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
జూన్ 3 నుంచి హాల్‌టికెట్లు జారీ చేస్తారు. జూన్ 10 నుంచి జూన్ 21 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
జూన్ 28న ఫైనల్ కీ, జూన్ 30న పరీక్ష ఫలితాలు వెల్లడిస్తారు.
డీఎస్సీ, టెట్ షెడ్యూల్ విడుదల కావడంతో కోచింగ్ సెంటర్లు అవసరం లేని సిలబస్‌నంతా విద్యార్థులపై రుద్దొద్దని మంత్రి గంటా విజ్ఞప్తి చేశారు.
వారం రోజుల్లో డీఎస్సీ, టెట్ సెలబస్ విడుదల చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ విద్యలో సంస్కరణలు
ఉద్యోగాల భర్తీతో పాటు విద్యా రంగంలో కీలక సంస్కరణలు తీసుకొస్తామని ఆయన తెలిపారు.
పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే ఇంగ్లిష్ మీడియం పాఠశాలల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
మూడేళ్ల వయసుకే పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీలో చేర్పిస్తున్నారు. ఆ తర్వాత అదే స్కూళ్లలో వారిని చదివిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అంగన్ వాడీ సెంటర్లలో ఎల్‌కేజీ, యూకేజీలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు..మంత్రి గంటా.
దాంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రైవేటు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
అన్ని హైస్కూళ్లలో డిజిటల్, వర్చువల్ క్లాస్‌రూంలు!
రాబోయే రోజుల్లో జిల్లాకు ఇద్దరు డీఈవోలను నియమిస్తామని తెలిపారు. ప్రైమరీకి ఒకరు, హైస్కూల్‌కి మరొకరు డీఈవోలు ఉంటారని అన్నారు.
అలాగే, రెవెన్యూ డివిజన్‌కి ఒక స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 6210 ప్రభుత్వ హైస్కూళ్లలో డిజిటల్, వర్చువల్ క్లాస్ రూములు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి గంటా చెప్పారు.
యూనివర్శిటీ ప్రొఫెసర్ల నియామకంపై వస్తున్న ఆరోపణపైనా మంత్రి గంటా స్పందించారు.
1985 తర్వాత తొలిసారి ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా సుమారు 1485 పోస్టులు భర్తీ చేయనున్నారు.
గతంలో కొందరు వైస్ చాన్సులర్లు రిటైర్మెంట్‌కు ముందు యూజీసీ నిబంధనలు ఉల్లంఘించి తమకిష్టం వచ్చిన వారికి పోస్టులు ఇవ్వడంతో సమస్యలు వచ్చాయని, అందుకే ఈసారి ఏపీపీఎస్సీకి ఆ బాధ్యత అప్పగించామని మంత్రి తెలిపారు.
ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్ష కేవలం స్క్రీనింగ్ టెస్ట్ కోసం మాత్రమేనని, ఆ తర్వాత యూజీసీ నిబంధనల ప్రకారమే ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తామని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.