You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అవీచీ: 18 ఏళ్లకు డీజే అయ్యాడు.. పదేళ్లు ప్రపంచాన్ని ఊపేశాడు
ప్రపంచ టాప్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్(ఈడీఎం) స్టార్లలో ఒకరైన స్వీడన్‌కు చెందిన డీజే అవీచీ ఒమన్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 28 ఏళ్లు.
18 ఏళ్ల ప్రాయంలో ఆయన కెరీర్ ప్రారంభించారు.
దశాబ్ద కాలం పాటు ప్రపంచ టాప్ 10 డ్యాన్స్ మ్యూజిక్ స్టార్స్ జాబితాలో ఆయన పేరు మారుమోగింది.
అవీచీ అసలు పేరు టిమ్ బర్గ్‌లింగ్.
ప్రముఖ అమెరికన్ గాయని మడొన్నాతో పాటు, కోల్డ్‌ప్లే వంటి ప్రముఖ రాక్ బ్యాండ్‌లతో కలిసి కూడా ఆయన పనిచేశారు.
"టిమ్ బర్గ్‌లింగ్‌ని కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నాం. ఆయన కుటుంబానికి తీరని లోటు ఇది, ఈ కష్టకాలంలో ఆ కుటుంబ గోప్యతను గౌరవించాలని అందరినీ కోరుతున్నాం" అని అవీచీ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే అతని మరణానికి కారణం ఏమిటన్న విషయం మాత్రం వారు వెల్లడించలేదు. ఏ విషయమూ బయటికి చెప్పబోమని అన్నారు.
కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2014లో గాల్‌బ్లాడర్‌కి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు.
అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్రమైన పాంక్రియాటైటిస్ సహా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండేవారు.
దాంతో 2016లో రిటైర్మెంట్ ప్రకటించారు.
"నేను చాలా అదృష్టవంతుడిని. ప్రపంచమంతా తిరిగి ప్రదర్శనలు ఇచ్చాను. ఇప్పుడు ఓ సాధారణ వ్యక్తిగా గడిపేందుకు సమయం దొరికింది" అని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన అన్నారు.
2017లో మళ్లీ పునరాగమనం చేస్తున్నట్టు ప్రకటించి ఓ మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేశారు.
ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందే టాప్ ఎలక్ట్రానిక్ ఆల్బమ్‌గా బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డుకు అది నామినేట్ అయింది.
"కష్టపడి పనిచేస్తే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని నాకు 16 ఏళ్ల వయసున్నప్పుడు మా నాన్న అన్నారు. అప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాను. నేను మరణించాక ఈ లోకం నన్ను నేను సంపాదించిన డబ్బు ద్వారా గుర్తుంచుకోకూడదు. నేను సాధించిన కీర్తి ద్వారానే గుర్తుండిపోవాలని అనుకున్నా"
"సంగీతం సృష్టించడమే నా జీవితం, నేను పుట్టిందే దానికోసమని అనుకుంటాను" అని అవీచీ ఓ సందర్భంలో చెప్పారు.
అవీచీ ప్రస్థానం
- 2008లో కెరీర్ ప్రారంభించారు.
- దశాబ్దం పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చి అభిమానులను సంపాదించుకున్నారు.
- ఒక్క రాత్రి కార్యక్రమానికి అవీచీ దాదాపు రూ.1.6 కోట్లు(250,000 డాలర్లు) దాకా తీసుకునేవారన్న అంచనా ఉంది.
- ఆయన కార్యక్రమాలకు స్పాటిఫైలో 1100 కోట్ల వ్యూస్ వచ్చాయి.
- ప్రపంచవ్యాప్తంగా తిరిగి ప్రదర్శనలు ఇచ్చిన తొలి ఈడీఎం డీజే ఈయనే.
- రెండుసార్లు గ్రామీ అవార్డ్స్‌కి నామినేట్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)