You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘రసాయన ఆయుధాలు వాడితే మళ్లీ దాడి చేస్తాం’.. సిరియాకు ట్రంప్ హెచ్చరిక
మళ్లీ రసాయన దాడులకు పాల్పడితే మరోమారు దాడులు చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని సిరియా ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సిరియా మిత్రదేశం రష్యా శనివారం ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది.
సిరియాలోని డ్యూమాలో ఏప్రిల్ 8న జరిగిన అనుమానిత రసాయన దాడికి ప్రతిగా శనివారం తెల్లవారుజామున అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు సిరియాలోని మూడు ప్రాంతాలపై వైమానిక, క్షిపణి దాడులు చేశాయి.
అయితే, తాము ఎలాంటి రసాయనాలు వాడలేదని, తమపై వచ్చిన ఆరోపణలన్నీ ప్రత్యర్థులు అల్లిన కట్టుకథలని సిరియా కొట్టిపారేసింది.
గత ఏడేళ్ల సిరియా పౌర యుద్ధంలో అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు జరిపిన ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నారు.
భద్రతా మండలి అత్యవసర సమావేశం
సిరియాపై శనివారం తెల్లవారుజామున పాశ్చాత్య దేశాలు జరిపిన వైమానిక దాడులను ఖండించేందుకుగాను శనివారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా వాడివేడి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
డ్యుమా సంఘటనపై 'రసాయన ఆయుధాల నిషేధ సంస్థ(ఓపీసీడబ్ల్యూ)' విచారణ ఫలితాల కోసం ఎదురుచూడకుండానే చర్యలు తీసుకోవటం ‘‘విద్వేషపూరిత నిరాశావాదం’’ అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యల్ని రాయబారి వస్సిలీ నెబెంజియా చదివి వినిపించారు.
రసాయన దాడి అంటూ అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న డ్యుమా దాడిపై నిజ నిర్థారణ జరిపేందుకు ఓపీసీడబ్ల్యు ఒక బృందాన్ని సిరియాకు పంపించింది. ఆ బృందం రాజధాని డమాస్కస్‌కు చేరుకుంది. త్వరలో డ్యుమాలో పర్యటించనుంది.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ‘అంతర్జాతీయ చట్టాన్ని బాహాటంగా నిర్లక్ష్యం చేస్తున్నా’యని, ‘దౌర్జన్యాలకు పాల్పడుతు’న్నాయని నెబెంజియా ఆరోపించారు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ‘అబద్ధాలకోరులు’: సిరియా
దీనిపై అమెరికా రాయబారి నిక్కీ హేలీ స్పందిస్తూ.. దాడులు ‘‘న్యాయబద్ధమైనవి, చట్టబద్ధమైనవి, సమంజసమైనవి’’ అని చెప్పారు.
‘‘నేను ఈరోజు ఉదయం అధ్యక్షుడితో మాట్లాడాను. ‘ఒకవేళ సిరియా ప్రభుత్వం మళ్లీ ఈ విషవాయువు వాడితే, అమెరికా ప్రభుత్వం (దాడులు చేసేందుకు) సంసిద్ధం’ అన్నారు’’ అని నిక్కీ హేలీ వివరించారు.
అమెరికా, దాని మిత్రపక్షాలు రాయబార పరంగా వరుస అవకాశాలు కల్పించామని, అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానాలను రష్యా వీటో చేసుకుంటూ వెళ్లిందని హేలీ తెలిపారు.
సిరియా రాయబారి బషర్ జాఫరి స్పందిస్తూ.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ‘‘అబద్ధాలకోరులు, వినాశనకారులు, కపటనాటక సూత్రధారులు’’ అని, ‘(ఇతర దేశాల పాలనలో) జోక్యం చేసుకోవాలన్న, వలసవాద విధానాలను సాధించుకునేందుకు ఐక్యరాజ్య సమితిని వాడుకుంటున్నారని ఆరోపించారు.
15 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మండలిలో చైనా, బొలీవియాలు రష్యా తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)