You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిరియా ‘రసాయన దాడి’: మూడో ప్రపంచ యుద్ధం రానుందా?
సిరియాలో రసాయన దాడులు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా దూకుడు పెంచింది. ఈ దాడులకు త్వరలో గట్టి జవాబిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
తమకు చాలా మార్గాలున్నాయని ట్రంప్ అంటున్నారు. అయితే.. ఆ మార్గాలేంటి?
రాయబారం
మొదటిది దౌత్యమార్గం అనుకోవచ్చు. కానీ, ఇందులో చాలా సమస్యలున్నాయి.
సిరియాతో పాటు రష్యా, ఇరాన్‌లపై కూడా అమెరికా ఆంక్షలు విధించవచ్చు. అయితే, రష్యా కూడా వెనక్కి తగ్గడం లేదు. సిరియాలో రసాయనిక దాడులపై దర్యాప్తునకు అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని అమెరికా అన్నప్పుడు.. రష్యా దానికి అడ్డుపడింది. సిరియాలోని డౌమలో రసాయనిక దాడులు జరిగినట్లు తమ పరిశోధనలో తేలిందని అమెరికా చెబుతోంటే.. తమ పరిశోధనలో రసాయనిక దాడులు జరగలేదని తేలిందంటూ రష్యా కొట్టిపారేసింది.
ఎటువంటి ఆరోపణలను అంగీకరించేందుకు రష్యా సిద్ధంగా లేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కానీ డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ఆరోపణలు చేసేందుకు వెనుకాడరని అందరికీ తెలుసు!
ట్రంప్ మాటలతో ఒక విషయం స్పష్టమవుతోంది. అదేమిటంటే, దౌత్యంతో పని కాకపోతే అమెరికాకు ఉన్న మరో మార్గం దాడి చేయడం.
దాడులు
అవి పరిమిత దాడులు కూడా కావచ్చు. ఎలాగంటే ఏడాది కిందట సిరియాలోని షెరాజ్ ఎయిర్ బేస్‌పై అమెరికా దాడి చేసింది. భారీ దాడులు సైతం చేయగలమన్న సందేశాన్ని ఇవ్వడమే ఆనాటి అమెరికా దాడుల ఉద్దేశం.
కానీ అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
అంటే ఇప్పుడు మరో మార్గం విస్తృత దాడులు చేయటం కావొచ్చు. ఒక వేళ భారీ దాడులు జరిగితే వాటి పరిణామాలేంటి?
నేరుగా చెప్పకపోయినా.. భారీ దాడులు చేస్తామని అర్థం వచ్చేలాగా ట్రంప్ మాట్లాడారు. అయితే.. సిరియా నెపంతో అమెరికా, రష్యాలు తలపడితే.. ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు కూడా పాల్గొంటే అప్పుడది ప్రపంచ యుద్ధం లాంటి పెద్ద యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది.
కానీ, ఈ దేశాలు అమెరికాకు ఎంతవరకు మద్దతు ఇస్తాయన్నదే అసలు ప్రశ్న.
ఒకవేళ ఆ దేశాలు మద్దతు ఇవ్వకుంటే.. ట్రంప్ గతంలో చాలాసార్లు అన్నట్లు అమెరికా ఒంటరిగానే పోరాడుతుందా?
ఇవి కూడా చూడండి:
- సిరియా: ‘రసాయన దాడి’లో 70 మంది మృతి
- 'రసాయన దాడి': సిరియా, రష్యాలను హెచ్చరించిన ట్రంప్
- ఏడేళ్ల సిరియా అంతర్యుద్ధం: గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు?
- REALITY CHECK: ఈ శవాల గుట్టలు ఎంత వరకు నిజం?
- రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. ‘ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’
- సిరియా రసాయన దాడులపై ‘తీవ్ర’ పరిణామాలు తప్పవు.. 48 గంటల్లో కీలక నిర్ణయాలు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)