You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాక్: ఇంతకూ ఆ 39 మంది భారతీయులపై మోసుల్‌లో ఏం జరిగింది?
ఇరాక్‌లో 2014లో అపహరణకు గురైన 40 మంది భారతీయుల్లో 39 మంది హతులైనట్టు మంగళవారం విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు.
డీఎన్ఏలను సరిపోల్చడం ద్వారా శవాలను గుర్తించినట్టు ఆమె తెలిపారు. జాడలేకుండా పోయిన 39 మంది భారతీయులెవరూ ప్రాణాలతో మిగలలేదని సుష్మ రాజ్యసభలో ప్రకటించారు.
వీరందరినీ తీవ్రవాద సంస్థ ఐసిస్ హత్య చేసిందని ఆమె తెలిపారు. 40వ వ్యక్తి తనను తాను ముస్లింగా చెప్పుకొని తప్పించుకున్నాడని ఆమె అన్నారు.
తప్పించుకున్న వ్యక్తి పేరు హర్జీత్ మసీహ్. ఈ భారతీయులందరూ ఉపాధి కోసం అక్కడికి వెళ్లినవారే.
2015లోనే వెల్లడించిన హర్జీత్ మసీహ్
వీరిలో 31 మంది పంజాబ్‌కు చెందినవారు కాగా, నలుగురు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారు. మిగిలిన వారు బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వారు. హతులైన వారందరూ తారిఖ్ నూర్ అల్ హుదా కంపెనీలో పని చేస్తుండేవారు.
తప్పించుకున్న హర్జీత్ మహీస్ పంజాబ్‌కు చేరుకొని, "అపహరించిన భారతీయులందరినీ ఐసిస్ మిలిటెంట్లు కాల్చి చంపారు" అని తెలిపారు.
2015లో ఆయనీ విషయం ప్రకటించగా, మంత్రి సుష్మ నాడు ఆయన చెప్పిన విషయాలు తప్పు అని తోసిపుచ్చారు.
అసలేం జరిగింది?
మోసుల్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు 2014లో మొత్తం 80 మందిని అపహరించారు. వారిలో 40 మంది భారతీయులు కాగా, మరో నలభై మంది బంగ్లాదేశీయులు.
అపహరణ జరిగినప్పటి నుంచి భారత ప్రభుత్వం పలు మార్లు వారు హత్యకు గురయ్యారన్న విషయాన్ని ఖండిస్తూ వచ్చింది.
జాడలేకుండా పోయిన భారతీయుల కుటుంబ సభ్యులు 2017లో సుష్మను కలిశారు. విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కూడా ఆ భేటీ సందర్భంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇరాక్‌కు వెళ్లారు కూడా.
మోసుల్ విషాదం
ఇరాక్‌లోని రెండో అతి పెద్ద పట్టణమైన మోసుల్‌ను 2014లో తమను తాము ఇస్లామిక్ స్టేట్‌గా చెప్పుకునే మిలిటెంట్ సంస్థ ఆక్రమించుకుంది.
దానిని తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం కోసం ఇరాక్ సైన్యానికి చెందిన వేల మంది సైనికులు, కుర్ద్ పెష్‌మర్గా మిలిటెంట్లు, సున్నీ అరబ్ తెగలు, షియా తిరుగుబాటుదారులు అంతా కలిసి ఐసిస్‌తో పోరాడారు.
అమెరికా వైమానిక దళం కూడా వారి పోరాటానికి అండగా నిలిచింది.
మిలిటెంట్లు ఆ పట్టణంలోని ప్రముఖ మార్గాలన్నింట్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలను దూరం నుంచే గమనించడానికి వీలుండేలా పలు భవంతులను నేలమట్టం చేశారు.
సుదీర్ఘ పోరాటం తర్వాత, మోసుల్‌ను ఐసిస్ పట్టులోంచి విడిపించినట్టుగా ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్-అబాదీ 2017లో ప్రకటించారు.
మోసుల్‌పై యుద్ధం ప్రభావం
యుద్ధం ఫలితంగా మోసుల్ పట్టణానికి చాలా నష్టం వాటిల్లింది. లక్షల మంది ప్రాణభయంతో పట్టణం వదిలి పారిపోయారు. మిలిటెంట్లు పట్టణాన్ని ధ్వంసం చేశారు.
భవనాలు, మసీదులను, వంతెనలను కూల్చివేశారు. యుద్ధంలో భాగంగా జరిగిన వైమానిక దాడుల్లో పట్టణం అంతా శిథిలమైంది. వందల మంది శిథిలాల కింద చాలా రోజుల పాటు చిక్కుకుపోయారు.
కొందరిని సైనికులు బయటకు తీసి రక్షించారు. మరి కొందరు శిథిలాల కిందే ప్రాణాలు కోల్పోయారు.
పట్టణం పునర్నిర్మాణానికి బిలియన్ డాలర్లు అవసరం
మోసుల్ పట్టణంలో మౌలిక సదుపాయాలను మళ్లీ అభివృద్ధి చేయాలంటే ఒక బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 6,521 కోట్లు) అవసరమని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సేవలతోపాటు పాఠశాలలు, ఆసుపత్రులను మళ్లీ నిర్మించాలంటే ఇందుకు రెట్టింపు ఖర్చు అవుతుందని అంచనా.
మోసుల్ నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా ప్రజలు నివాసాలను వదిలి వెళ్లిపోయారని అంతర్జాతీయ శరణార్థుల సంస్థ తెలిపింది. వీరిలో చాలా మంది సమీపంలోని శిబిరాల్లో తలదాచుకున్నారు. మిగిలిన వారు స్నేహితులు, బంధువుల వద్ద ఉండేందుకు వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)