వీడియో గేమ్ కొట్లాట.. 13 ఏళ్ల అక్కను కాల్చి చంపిన 9 ఏళ్ల బాలుడు

అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో.. వీడియో గేమ్ సందర్భంగా జరిగినట్లుగా భావిస్తున్న గొడవలో తొమ్మిదేళ్ల బాలుడు తుపాకీతో కాల్పడంతో 13 ఏళ్ల బాలిక మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

తన అక్క వీడియో గేమ్ కంట్రోలర్ ఇవ్వటం లేదని ఆగ్రహించిన బాలుడు తుపాకీని తీసుకుని, ఆమె వెనుకవైపు నుంచి కాల్చాడని.. బాలిక తలలోంచి బుల్లెట్ దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు.

శనివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా, బాలికను మెంఫిస్ నగరంలోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన బాలిక ఆదివారం మృతి చెందింది.

అయితే, తొమ్మిదేళ్ల బాలుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనేది స్పష్టం కాలేదు.

‘‘ఆ బాలుడి వయసు తొమ్మిదేళ్లే. బహుశా ఏదైనా వీడియో గేమ్‌లోనో సినిమాలోనో (తుపాకీ కాల్పడాన్ని) చూసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అసలు దాంతో ఏం జరుగుతుందనేది కూడా అతడికి తెలిసి ఉండకపోవచ్చు. నేను ఏదీ స్పష్టంగా చెప్పలేను. కానీ, జరిగింది మాత్రం విషాదం’’ అని మొన్రో కౌంటీ షరీఫ్ (పోలీసు అధికారి) సెసిల్ కంట్రెల్ చెప్పారు.

ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ల అమ్మ వేరే గదిలో మిగతా పిల్లలకు భోజనం తినిపిస్తోంది.

కాగా, ఈ కాల్పులకు దారితీసిన పరిణామాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు బాలుడికి .25 తుపాకీ ఎలా అందింది? అన్న అంశంపైనా దృష్టి సారించారు.

‘‘ఇది మాకు కొత్త. ఒక చిన్నారి మరొక చిన్నారిపై కాల్పులు జరిపిన కేసును ఇంతకు ముందెన్నడూ మేం చూడలేదు’’ అని షరీఫ్ కంట్రెల్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)