గూఢచారిపై విష ప్రయోగం: రష్యాలో 23 మంది బ్రిటన్ రాయబారుల బహిష్కరణ

బ్రిటన్‌లో మాజీ గూఢచారి, ఆయన కుమార్తెపై విష ప్రయోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో.. రష్యా 23 మంది బ్రిటన్ రాయబారులను తమ దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించింది.

వారంలోపు వీరిని దేశం నుంచి పంపేస్తామని రష్యా విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది.

తమ దేశంలోని బ్రిటీష్ కౌన్సిల్, బ్రిటీష్ కాన్సులేట్‌ను కూడా మూసేస్తామని కూడా రష్యా తెలిపింది.

ఇక్కడి బ్రిటీష్ కౌన్సిల్ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది.

తమ దేశంలో ఉన్న 23 మంది రష్యా రాయబారులను తిప్పి పంపాలని బ్రిటన్ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో రష్యా కూడా అలాంటి నిర్ణయం తీసుకుంది.

మార్చి 4న తమ దేశంలో మాజీ గూఢచారి, ఆయన కుమార్తెపై రష్యా విష ప్రయోగం చేసిందని బ్రిటన్ ఆరోపించింది. దీన్ని రష్యా ఖండించింది.

అసలేం జరిగింది?

సిర్గీ స్క్రిపాల్ గతంలో రష్యా సైనికాధికారిగా పని చేశారు. ఆయన వయసు 66.

తన ముప్ఫైమూడేళ్ల కూతురు యూలియా స్క్రిపాల్‌తోపాటుగా మార్చి 4న సాల్స్‌బరీలోని వీధిలో ఓ బెంచ్‌పై అచేతనంగా పడివున్నారు. స్థానికుల సమాచారంతో వీరిని పరీక్షించిన వైద్యులు వీరిపై విషప్రయోగం జరిగిందని ప్రాథమికంగా తెలిపారు.

వీరిద్దరూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

వీరిద్దరూ కలిసి భోజనం చేసిన జిజ్జీ రెస్టారెంట్‌లోని టేబుల్ మీద, టేబుల్ పరిసర ప్రాంతంలో నొవిఛోక్ అవశేషాలను నిపుణులు గుర్తించారు.

జీజ్జీ రెస్టారెంట్‌కు సమీపంలో ఉండే మిల్ పబ్‌లో కూడా ఈ అవశేషాలను గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆరోజు జిజ్జీ రెస్టారెంట్‌కు, మిల్ పబ్‌కు వెళ్లినవారు ఆందోళన చెందారు.

వీరిలో దాదాపు 500 మంది ముందు జాగ్రత్తగా తమ వస్తువులను శుభ్రం చేసుకున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)