You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియాకు ఐదేళ్ల జైలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ప్రతిపక్ష నేత ఖాలిదా జియాకు అవినీతికి సంబంధించిన ఓ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.
అనాథ పిల్లల కోసం ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన 1.61 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారన్న కేసులో 72 ఏళ్ల ఖాలిదాను కోర్టు దోషిగా ప్రకటించింది.
'బీడీన్యూస్24' రిపోర్టు ప్రకారం, తెల్లని చీరలో కోర్టుకు హాజరైన ఖాలిదాను తీర్పు వెలువరించిన వెంటనే జైలుకు తరలించారు.
జైలుకు తరలిస్తున్న సమయంలో ఏడుస్తున్న తన బంధువును ఉద్దేశించి ఖాలిదా, "బాధ పడకండి. ధైర్యంగా ఉండండి. నేను తిరిగొస్తాను" అని అన్నారని 'డెయిలీ స్టార్' తెలిపింది.
జియా కుమారుడికి కూడా శిక్ష
ఢాకాలోని ఓ కోర్టులో తీర్పును ప్రకటిస్తూ న్యాయమూర్తి, "కోర్టులో జియాపై ఉన్న ఆరోపణలు రుజువయ్యాయి. ఆమె సామాజిక, శారీరక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఐదేళ్ల శిక్ష విధిస్తున్నాం" అని ప్రకటించారు.
తీర్పు వెలువడడానికి ముందు కోర్టు ఆవరణలో వేల సంఖ్యలో ఖాలిదా మద్దతుదారులు గుమిగూడారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది.
ఈ కేసులో ఖాలిదా జియా కుమారుడు తారిక్ రహమాన్‌కు కోర్టు అతని గైర్హాజరీలో పదేళ్ల జైలు శిక్ష విధించింది. రహమాన్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు.
నలుగురు జియా అనుచరులకు కూడా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఖాలిదా ఈ తీర్పుపై వ్యాఖ్యానిస్తూ, తనపై మోపిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని అన్నారు.
ప్రస్తుత ప్రధానమంత్రి షేఖ్ హసీనాకు చిరకాల ప్రత్యర్థి అయిన జియాపై ఇదే కాకుండా ఇంకా చాలా కేసులు నడుస్తున్నాయి.
ఈ తీర్పు నేపథ్యంలో, ఈ సంవత్సరం జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో జియా పాల్గొనలేరు.
భద్రతా బలగాలతో తలపడ్డ మద్దతుదారులు
తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఢాకా సహా పలు పట్టణాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు వార్తా కథనాలను బట్టి తెలుస్తోంది.
అయినప్పటికీ ఖాలిదా మద్దతుదారులు భారీ సంఖ్యలో కోర్టు పరిసరాల్లోకి చేరుకున్నారు.
ఖాలిదా జియా కారు కోర్టు ఆవరణలోకి ప్రవేశించిన సమయంలో ఆమె మద్దతుదారులు భద్రతా బలగాలతో తలపడ్డారు. కోర్టుకు కొద్ది దూరంలో జరిగిన ఈ ఘర్షణలో కొందరు జవాన్లు గాయపడ్డారు.
తీర్పు వెలువరించడానికి ముందు వందల సంఖ్యలో తమ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారని ఖాలిదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)